IPL 2025: ఇషాన్ కిషన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన హార్దిక్! ఇకపై నవ శకం ప్రారంభం కానుంది అంటూ..
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞుల సమ్మేళనంతో జట్టును మరింత బలంగా తీర్చిదిద్దింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టు నిర్మాణాన్ని గొప్ప ముందడుగుగా అభివర్ణించాడు. ఇషాన్ కిషన్ జట్టు విడిచి వెళ్లినప్పటికీ, కొత్త శకం కోసం జట్టులో సరికొత్త యువతకు అవకాశం కల్పించారు.
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో తమ జట్టు నిర్మాణంలో గొప్ప ముందడుగు వేసినట్లు కెప్టెన్ హార్దిక్ పాండ్యా అభిప్రాయపడ్డారు. ఈ వేలంలో తమ జట్టు కోసం సరైన ఆటగాళ్ల మిశ్రమం కనుగొన్నామనే ఆనందం వ్యక్తం చేశారు. యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞుల సమ్మేళనంతో జట్టు బలంగా ఉండబోతోందని హార్దిక్ స్పష్టం చేశారు. “వేలం డైనమిక్స్ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. కానీ భావోద్వేగాలకు ఆమడ దూరంలో ఉండి, జట్టు అవసరాలను గుర్తించడమే ముఖ్యమని” ఆయన అభిప్రాయపడ్డారు.
ఇషాన్ కిషన్ జట్టునుండి విడిపోవడం ముంబై ఇండియన్స్ కు ఎప్పుడు గణనీయమైన లోటే అని పేర్కొన్నాడు. 2018 నుండి జట్టులో ముఖ్యమైన భాగంగా ఉన్న ఇషాన్, వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ. 11.25 కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యారు. ఈ అంశంపై హార్దిక్ మాట్లాడుతూ, “ఇషాన్ మా డ్రెస్సింగ్ రూమ్‌ను ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంచేవాడు. అతనిని నిలుపుకోవడం మాకు సాధ్యం కాలేదు. కానీ ముంబై ఇండియన్స్‌తో అతని అనుబంధం ఎప్పటికీ ప్రత్యేకమైంది” అన్నారు. ఇప్పటివరకు ఫ్రాంచైజీకి ఇచ్చిన సేవలను గుర్తుచేసుకుంటూ, ఇషాన్‌పై పాండ్యా ప్రత్యేక ప్రేమను వ్యక్తం చేశారు. ఇప్పుడు సన్‌రైజర్స్‌లో అతనికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నట్టు హార్దిక్ చెప్పారు.
ఈ సారి ముంబై ఇండియన్స్ యువ ఆటగాళ్లను కొనుగోలు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నమన్ ధీర్, రాబిన్ మింజ్, అర్జున్ టెండూల్కర్ వంటి ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు జట్టులో చోటు సంపాదించారు. మీ ప్రతిభను గుర్తించి, ముంబై ఇండియన్స్ లో మీకు అవకాశం ఇచ్చిందని, కష్టపడి శిక్షణ తీసుకుంటే, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లలా దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకోవచ్చు అని హార్దిక్ యువ ఆటగాళ్లకు సందేశమిచ్చాడు.
ముంబై ఇండియన్స్ మెగా వేలం తర్వాత జట్టులో యువతకు అవకాశం కల్పించడంలో బలమైన ప్రణాళికను అమలు చేయగా, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ వంటి వారి కీలక పాత్రలతో జట్టును సమతుల్యంగా తీర్చిదిద్దుతున్నారు. హార్దిక్ చెప్పినట్లు, ఈ సారి ముంబై ఇండియన్స్ తమ అన్ని బలహీనతలను దృష్టిలో ఉంచుకొని, అత్యుత్తమ జట్టు నిర్మాణానికి ప్రయత్నించింది.
మొత్తంగా, మెగా వేలం తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు యువ ప్రతిభ, అనుభవంతో కూడిన జట్టుగా ఆకర్షణీయంగా తయారైంది. కాగా, ఇషాన్ కిషన్ జట్టు విడిచి వెళ్లడం ఒకింత నష్టంగా ఉన్నప్పటికీ, కొత్త ఆటగాళ్లతో ముంబై ఇండియన్స్ కొత్త శకాన్ని ప్రారంభించనుంది.