T20 World Cup 2022: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. టీ20 ప్రపంచకప్ నుంచి యార్కర్స్ కింగ్ ఔట్..

Jasprit Bumrah: దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు వెన్ను గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమయ్యాడు. ఇకపై T20 ప్రపంచ కప్‌లో కూడా బరిలోకి దిగడు.

T20 World Cup 2022: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. టీ20 ప్రపంచకప్ నుంచి యార్కర్స్ కింగ్ ఔట్..
Jasprit Bumrah
Follow us
Venkata Chari

|

Updated on: Oct 04, 2022 | 12:11 AM

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఈ ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌కు ముందు వెన్నులో గాయంతో బాధపడ్డాడు. అప్పటి నుంచి ఈ ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచకప్ నుంచి అతడిని తప్పింనట్లు బీసీసీఐ ధ్రువీకరించింది. ఈ మేరకు బీసీసీఐ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. BCCI తన ప్రకటనలో, “BCCI వైద్య బృందం ICC T20 ప్రపంచ కప్ కోసం టీమ్ ఇండియా నుంచి జస్ప్రీత్ బుమ్రాను తొలగించింది. సమగ్ర విచారణ, నిపుణుల అభిప్రాయం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం” అని పేర్కొంది.

బుమ్రా స్థానంలో ఎవరు?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బుమ్రా అంతకుముందు దూరమయ్యాడు. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు జరగ్గా, బుమ్రా రెండు మ్యాచ్‌ల్లోనూ ఆడలేదు. అతని వెన్ను గాయం వార్త వచ్చిన వెంటనే, అతను ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు అతడి స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారన్నదే ప్రశ్నగా మారింది. ఇందులో మొదటి పేరు మహమ్మద్ షమీ అని వినిపిస్తుంది. అతనికి అనుభవం కూడా ఉంది. ప్రపంచ కప్ కోసం సిద్ధంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో కూడా షమీని ఎంపిక చేయలేదు. వీరితో పాటు మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్ పేర్లు కూడా ఉన్నాయి. చాహర్ స్టాండ్-బైలో షమీతో ఉన్నాడు. అయితే అతను దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో పాల్గొంటున్నాడు.

బుమ్రా భర్తీకి సంబంధించి, బీసీసీఐ త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. బీసీసీఐ తన ప్రకటనలో, “ఈ పెద్ద టోర్నమెంట్‌కు బుమ్రా స్థానంలో బీసీసీఐ త్వరలో ఒకరిని ఎంపిక చేస్తాం” అని పేర్కొంది.

రాహుల్-సౌరవ్ ఆశాభావం వ్యక్తం చేసినా..

బుమ్రా గాయపడిన వార్త విన్న తర్వాత, బుమ్రా టీ20 ప్రపంచకప్ ఆడడని భావించారు. ఇది పలు మీడియా నివేదికలలో కూడా స్పష్టంగా పేర్కొంటూ వార్తలు వచ్చాయి. అయితే BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం.. బుమ్రా ప్రపంచ కప్‌లో ఆడగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచకప్ చాలా దూరంలో ఉందని, బుమ్రా ఇంకా దాని నుంచి బయటపడలేదని గంగూలీ కొద్దిరోజుల క్రితం ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

అదే సమయంలో, రాహుల్ ద్రవిడ్ కూడా విలేకరుల సమావేశంలో బుమ్రా కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పుడు BCCI ప్రకటన తర్వాత వీరి భావనలకు ముగింపు పలికినట్లైంది. ఇక ప్రస్తుతం టీమ్ ఇండియా ప్రపంచ కప్‌లో బుమ్రా లేకుండానే బరిలోకి దిగనుంది.