MS Dhoni: ధోనీ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ.. ఆడేది ఆ 2 మ్యాచ్‌లేనట.? క్లారిటీ ఇచ్చిన మాజీ ప్లేయర్
MS Dhoni Injury Update: ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తమ ఆరాధ్య దైవం మహేంద్ర సింగ్ ధోనీ రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గాయం కారణంగా ఈ సీజన్‌లో సగానికి పైగా మ్యాచ్‌లకు దూరమైన ధోనీ ఫిట్‌నెస్‌పై తాజాగా బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ కీలక వ్యాఖ్యలు చేయగా, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన అంచనా ఇప్పుడు క్రీడా లోకంలో చర్చనీయాంశమైంది.

MS Dhoni Injury Update: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు, దిగ్గజ స్పిన్నర్ ఆర్. అశ్విన్ ధోనీ పునరాగమనంపై చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ సీజన్‌లో ధోనీ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం ఉందని అశ్విన్ జోస్యం చెప్పడం గమనార్హం. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ధోనీ ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే పూర్తి సీజన్ ఆడటం కష్టమని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ధోనీ లేని లోటును సంజూ శామ్సన్ వికెట్ కీపర్‌గా భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా కాకుండా వికెట్ కీపర్‌గానే..
ధోనీ కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమై ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వస్తారనే ప్రచారానికి మైఖేల్ హస్సీ తెరదించాడు. ధోనీ జట్టులోకి వస్తే అది వికెట్ కీపర్ బాధ్యతలతో కూడిన పూర్తి స్థాయి ఆటగాడిగానే ఉంటుందని ఆయన స్పష్టం చేశాడు. జట్టులో సంజూ శామ్సన్, కార్తీక్ శర్మ వంటి ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ, స్టంప్స్ వెనుక ధోనీ ఉండటమే జట్టుకు కొండంత అండ అని హస్సీ పేర్కొన్నాడు. నెట్స్ ప్రాక్టీస్‌లో ధోనీ ఇప్పటికే వికెట్ కీపింగ్ సాధన మొదలుపెట్టడం సానుకూల అంశం.
అసలు సమస్య రన్నింగ్ మధ్యలోనే..!
ధోనీ బ్యాటింగ్ లేదా కీపింగ్‌లో ఎటువంటి ఇబ్బంది పడటం లేదని, కానీ వికెట్ల మధ్య పరిగెత్తడమే ప్రధాన సమస్యగా మారిందని కోచ్ వివరించాడు. కండరాల నొప్పుల కారణంగా వేగంగా ఒకటి, రెండు పరుగులు తీయడం ధోనీకి సవాలుగా మారింది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు వచ్చే ఒత్తిడిని తట్టుకునేలా ఆయన కండరాలు సిద్ధంగా ఉండాలని, అందుకోసం ధోనీ తీవ్రంగా శ్రమిస్తున్నారని హస్సీ తెలిపాడు. నెట్స్ లో ఆయన బ్యాటింగ్ అద్భుతంగా ఉందని, అయితే 100 శాతం ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే మైదానంలోకి దిగుతారని యాజమాన్యం వెల్లడించింది.
ప్రస్తుతం పట్టికలో ఐదో స్థానంలో ఉన్న చెన్నైకి ధోనీ అనుభవం ఎంతో అవసరం. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు కూడా ఆయన దూరంగా ఉండటం అభిమానులను నిరాశపరిచింది. అయితే, వచ్చే కొన్ని మ్యాచ్‌ల్లో ఆయన తిరిగి మైదానంలో కనిపిస్తారని జట్టు యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ‘థాలా’ తన మార్క్ ఫినిషింగ్‌తో అభిమానులను ఎప్పుడు అలరిస్తారో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
