NEET Exam 2026: అస్సలు రాజీ పడొద్దు.. నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ఆదేశాలు
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తుతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం రీ-నీట్ పరీక్ష నిర్వహణపై ఫోకస్ పెట్టింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా, పారదర్శక నిర్వహణపై కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంచేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం వెల్లడించింది.

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో CBI విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాసిక్ కేంద్రంగా సాగిన ఈ నెట్‌వర్క్‌ను CBI అధికారులు బట్టబయలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్.. అలాగే వరుస అరెస్టులతోపాటు పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం.. రీ-నీట్ పరీక్ష సన్నాహాలపై దృష్టిసారించింది.. ఈసారి పకడ్బందీగా పరీక్షలను నిర్వహించేందుకు నడుంబిగించింది.. రాబోయే నీట్ (యూజీ) పునఃపరీక్ష సన్నాహాలను సమీక్షించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. పరీక్ష నిర్వహణలో సంపూర్ణ సమగ్రత, పారదర్శకత అవసరాన్ని నొక్కిచెబుతూ, గత పరీక్షా ప్రక్రియలో గుర్తించిన అన్ని లోపాలను సమగ్రంగా సరిదిద్ది, అంతరాలను తొలగించాలని.. ధర్మంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు.
పునః-నీట్ పరీక్షను కట్టుదిట్టమైన భద్రతా ప్రోటోకాల్‌ల నడుమ సురక్షితంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా, పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉద్ఘాటించారు. పరీక్షా ఏర్పాట్లను పటిష్టంగా పర్యవేక్షించి, సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రాలవ్యాప్తంగా జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసు సూపరింటెండెంట్లతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
పరీక్షా కేంద్రాల వద్ద అప్రమత్తత, భద్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని నొక్కిచెప్పారు. దీంతోపాటు.. విద్యార్థులకు రవాణా, తాగునీరు, ఇతర నిత్యావసర సౌకర్యాలతో సహా తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలని.. భద్రత, సౌకర్యాల విషయంలో రాజీ పడొద్దని ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత.. సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని.. పారదర్శకతే లక్ష్యంగా పరీక్షల పవిత్రతను కాపాడాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
పరీక్షల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులలో నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
