IPL 2026: ఇదేందిది.. ప్లేఆఫ్స్‌కు చెన్నై టీం.. టాప్ 4 కోసం పెద్ద ప్లాన్ చేశారుగా..!
CSK IPL 2026 Playoff Scenarios: సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఎదురైన ఘోర పరాజయం ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ ఆశలను తీవ్రంగా దెబ్బతీసింది. లీగ్ దశ ముగింపునకు వస్తున్న తరుణంలో, అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న చెన్నై జట్టు ఆఖరి నాలుగు స్థానాల్లో నిలవాలంటే ఎలాంటి అద్భుతాలు జరగాలో ఇప్పుడు చూద్దాం.

CSK IPL 2026 Playoff Scenarios: సొంత మైదానమైన చెపాక్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్‌కు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే ప్లేఆఫ్స్ రేసులో చెన్నై ముందంజలో ఉండేది. కానీ, హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి నేరుగా ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ ఓటమితో చెన్నై జట్టు 13 మ్యాచ్‌లలో 6 విజయాలతో 12 పాయింట్లతో ఆరో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే నాకౌట్ చేరగా, ఆఖరి స్థానం కోసం చెన్నై పోరాడుతోంది.
గుజరాత్‌తో జరిగే ఆఖరి మ్యాచ్ చావో రేవో..!
చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశలో తన చివరి మ్యాచ్‌ను మే 21న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ చెన్నై జట్టుకు జీవన్మరణ సమస్యగా మారింది. ఇందులో ఓడిపోతే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా చెన్నై టోర్నీ నుంచి పూర్తిగా నిష్క్రమిస్తుంది. ఒకవేళ గుజరాత్‌పై భారీ విజయం సాధిస్తేనే చెన్నై గరిష్టంగా 14 పాయింట్లకు చేరుకుంటుంది. అయితే, కేవలం గెలుపు మాత్రమే సరిపోదు, నెట్ రన్ రేట్ కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది.
ఇతర జట్ల ఓటములపైనే ‘తలా’ సేన ఆశలు..
ప్రస్తుతం చెన్నై ప్లేఆఫ్స్ భాగ్యం పూర్తిగా వారి చేతుల్లో లేదు. గుజరాత్‌పై చెన్నై గెలిచిన తర్వాత కూడా ఈ కింది ఫలితాలు రావాల్సి ఉంటుంది:
రాజస్థాన్ రాయల్స్ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాలి: ఇప్పటికే 12 పాయింట్లతో ఉన్న రాజస్థాన్, తన మిగిలిన రెండు మ్యాచ్‌లలో (లక్నో, ముంబైలపై) ఓడిపోవాలి.
పంజాబ్ కింగ్స్ ఓడిపోవాలి: 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న పంజాబ్ జట్టు లక్నో సూపర్ జయంట్స్‌తో జరిగే మ్యాచ్‌లో పరాజయం పాలుకావాలి.
కోల్‌కతా నైట్ రైడర్స్ సమీకరణాలు: కోల్‌కతా జట్టు ఢిల్లీని ఓడించి, ముంబై చేతిలో ఓడిపోవాలి.
ఈ అంచనాలన్నీ అనుకూలంగా జరిగితే, 14 పాయింట్లతో నిలిచే చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య నెట్ రన్ రేట్ ఆధారంగా నాలుగో స్థానాన్ని నిర్ణయిస్తారు.
రన్ రేట్ కీలకం కానున్న క్లైమాక్స్..
ప్రస్తుతం 5 జట్లు ఒకే ఒక్క స్థానం కోసం పోటీ పడుతుండటంతో రన్ రేట్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చెన్నై నెట్ రన్ రేట్ ప్రస్తుతం స్వల్పంగా మైనస్‌లోకి వెళ్లినందున, గుజరాత్‌పై కేవలం గెలవడమే కాకుండా భారీ తేడాతో విజయం సాధించడం అత్యవసరం. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ ఒత్తిడిని అధిగమించి జట్టును ఎలా నడిపిస్తాడనేది చూడాలి.
చెన్నై సూపర్ కింగ్స్ ఆశలు ప్రస్తుతం సన్నని దారంపై వేలాడుతున్నాయి. అద్భుతాలు జరిగితే తప్ప 5సార్లు విజేతగా నిలిచిన ఈ జట్టు టాప్-4 లో అడుగుపెట్టడం అసాధ్యంగా కనిపిస్తోంది. కోట్లాది మంది అభిమానులు తమ ప్రియతమ జట్టు కోసం, ఎంఎస్ ధోనీని మరోసారి నాకౌట్ మ్యాచ్‌ల్లో చూడటం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. మరి మే 21 నాటి పోరులో చెన్నై ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
