IND vs SA 2nd T20I: ఉత్కంఠ మ్యాచ్‌లో టీమిండియాదే విజయం.. 7 ఏళ్ల తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికాపై తొలి సిరీస్ కైవసం..
IND Vs SA 2nd T20I Match Report Today: టీమిండియా అందించిన టార్గెట్‌ను దక్షిణాఫ్రికా టీం ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 221 పరుగులకే పరిమితమైంది. దీంతో 16 పరుగుల తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది.
భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. టీ20 క్రికెట్‌లో భారత్‌కు ఇది నాలుగో అత్యధిక స్కోరుగా నిలిచింది. సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జవాబుగా దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 221 పరుగులకే పరిమితమైంది. దీంతో 16 పరుగుల తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది. సౌతాఫ్రికా తరపున డేవిడ్ మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్‌తో సెంచరీ(106 పరుగులు, 47 బంతులు, 8 ఫోర్లు, 7 సిక్సులు) చేయగా, డికాక్ 69(48 బంతులు, 3 ఫోర్లు, 4 సిక్సులు) పరుగులతో అజేయంగా నిలిచారు. భారత్ బౌలర్లలో అర్షదీప్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 16 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. దక్షిణాఫ్రికాతో భారత్‌లో తొలిసారిగా టీ20 సిరీస్‌ను రోహిత్ సేన కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య తొలి టీ20 సిరీస్ 2015లో భారత్‌లో జరిగింది.
అర్ష్‌దీప్ సింగ్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు. అతను దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా, రిలే రస్సో ఇద్దరినీ సున్నాకి ఔట్ చేశాడు. అక్షర్ పటేల్ ఆఫ్రికాకు మూడో దెబ్బ ఇచ్చాడు. అతను 33 పరుగులు చేసిన తర్వాత ఐదన్ మార్క్రామ్‌ను ఔట్ చేశాడు.
దమ్ము రేపిన టీమిండియా టాప్ 4 బ్యాటర్స్..
భారత్ టాప్ 4 బ్యాట్స్ మెన్ అద్భుతంగా ఆడి మంచి స్కోరు చేశారు. కేఎల్ రాహుల్ 28 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అదే సమయంలో రోహిత్ శర్మ 37 బంతుల్లో 43 పరుగులు చేశాడు. 28 బంతుల్లో విరాట్ కోహ్లి బ్యాటింగ్‌లో 49 పరుగులు వచ్చాయి. వీరే కాకుండా సూర్యకుమార్ యాదవ్ అద్భుత బ్యాటింగ్ చేశాడు. కేవలం 22 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 277.27గా నిలిచింది. అతని బ్యాట్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.
మైదానంలోకి పాము.. కొద్దిసేపు ఆగిన ఆట..
దక్షిణాఫ్రికా జట్టులో ఒక మార్పు వచ్చింది. స్పిన్నర్ తబ్రేజ్ షమ్సీ నేటి మ్యాచ్‌లో ఆడడం లేదు. అతని స్థానంలో లుంగీ ఎన్‌గిడి వచ్చాడు. అదే సమయంలో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. మ్యాచ్ సందర్భంగా ఓ కీలక ఘటన చోటుచేసుకుంది. భారత ఇన్నింగ్స్ ఏడో ఓవర్ ముగిసే సరికి పాము మైదానంలోకి వచ్చింది. దీంతో మ్యాచ్‌ను 10 నిమిషాల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. కొంత సేపటికి గ్రౌండ్ స్టాఫ్ పామును బయటకు పంపడంతో ఆట మొదలైంది.
రోహిత్ @400 టీ20 మ్యాచ్‌లు..
వేన్ పార్నెల్ వేసిన బంతిని స్కూప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ వేలికి గాయమైంది. అయితే ఫిజియో చికిత్స తీసుకున్న తర్వాత మళ్లీ బ్యాటింగ్ ప్రారంభించాడు. రోహిత్‌కి ఇది 400వ టీ20. ఇందులో అంతర్జాతీయ, లీగ్ మ్యాచ్‌లు రెండూ ఉన్నాయి. 400 టీ20లు ఆడిన తొలి భారత క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు.
రెండు జట్లు ప్లేయింగ్ XI..
భారతదేశం- రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, R. అశ్విన్, అర్ష్దీప్ సింగ్.
దక్షిణాఫ్రికా : క్వింటన్ డి కాక్, టెంబా బావుమా (కెప్టెన్), రిలే రస్సో, ఐడాన్ మార్క్రామ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, లుంగి ఎన్గిడి, కగిసో రబడ, ఎన్రిక్ నోర్త్యా, కేశవ్ మహరాజ్.