England: చెత్త బుట్ట కన్నా హీనంగా చూస్తున్నారు: కోచ్, కెప్టెన్‌పై SRH ప్లేయర్ ఫైర్
Liam Livingstone vs Brendon McCullum: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. జట్టు మేనేజ్‌మెంట్ తనతో వ్యవహరించిన తీరు గౌరవం లేకుండా ఉందని ఆయన ఆరోపించాడు. ముఖ్యంగా కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆరోపణలు గుప్పించాడు.

England Team Controversy: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ జట్టు మేనేజ్‌మెంట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. 2025లో వెస్టిండీస్ సిరీస్‌కు తనను జట్టులోకి ఎంపిక చేయలేదని చెప్పిన విధానం తనకు షాక్ ఇచ్చిందని తెలిపాడు. బ్రెండన్ మెకల్లమ్ నుంచి వచ్చిన కాల్ కేవలం ఒక నిమిషం మాత్రమే కొనసాగిందని, అందులో కూడా సరైన వివరణ ఇవ్వలేదని అన్నాడు. “నన్ను ఎందుకు డ్రాప్ చేశారని అడిగితే, ఇంకొకరికి అవకాశం ఇవ్వాలనుకున్నామని చెప్పారు,” అని ఆయన వెల్లడించాడు.
అదే సమయంలో సెలెక్టర్ ల్యూక్ రైట్ తనతో మాట్లాడలేదని, కెప్టెన్ హ్యారీ బ్రూక్ కేవలం ఒక మెసేజ్ మాత్రమే పంపాడని చెప్పాడు. మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ కూడా తనతో సరైన కమ్యూనికేషన్ చేయలేదని విమర్శించాడు.
“జట్టులో ఉంటేనే విలువ”: లివింగ్‌స్టోన్ వ్యాఖ్యలు..
లివింగ్‌స్టోన్ మాటల్లో, జట్టులో ఉన్నప్పుడు మాత్రమే ఆటగాళ్లను పట్టించుకుంటారని, బయటకు వెళ్లిన తర్వాత ఎవరూ గుర్తించరని అన్నాడు. “జట్టులో ఉంటేనే అందరూ మీ గురించి ఆలోచిస్తారు. లేకపోతే ఎవరూ పట్టించుకోరు. ఇది నాకు ఒక ‘eye-opening experience’లా అనిపించింది” అని పేర్కొన్నాడు. ఈ అనుభవం తన ఆలోచనా విధానాన్ని మార్చిందని, ఇకపై క్రికెట్‌ను ఆనందంగా ఆడాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు.
బ్యాటింగ్ ఆర్డర్ మార్పులపై అసంతృప్తి..
లివింగ్‌స్టోన్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న మరో పెద్ద సమస్యగా బ్యాటింగ్ ఆర్డర్ మార్పులను ప్రస్తావించాడు. తాను పైస్థానాల్లో బ్యాటింగ్ చేసినప్పుడు మంచి ప్రదర్శన ఇచ్చినా, కీలక ఆటగాళ్లు తిరిగి వచ్చాక మళ్లీ నెంబర్ 7కి పంపించేవారని చెప్పుకొచ్చాడు.
“నెంబర్ 7లో బ్యాటింగ్ చేయడం, ఆరవ బౌలర్‌గా ఉండడం నా టాలెంట్‌కు తగ్గది కాదు. అది వృథా అవుతున్నట్లు అనిపించింది,” అని స్పష్టం చేయడం గమనార్హం.
ఇండియా టూర్‌లో సహాయం లేకపోవడం..
2025లో ఇండియా టూర్ సమయంలో తాను ఫామ్ కోల్పోయినప్పుడు కోచ్ మెకల్లమ్‌ను సహాయం కోరినప్పటికీ సరైన మార్గదర్శకత్వం అందలేదని తెలిపాడు. “నాకు ‘చిల్ అవ్వాలి’ అని మాత్రమే చెప్పారు. కానీ పరిస్థితులు బాగోలేకపోతే సహజంగానే మనం ఆందోళన చెందుతాం,” అని లివింగ్‌స్టోన్ పేర్కొన్నాడు.
IPL 2026పై ఆశలు..
ఇప్పుడు తన దృష్టి మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026పై ఉందని లివింగ్‌స్టోన్ తెలిపాడు. ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడనున్న ఆయన, మంచి ప్రదర్శనతో మళ్లీ ఇంగ్లండ్ జట్టులో చోటు సంపాదించాలని ఆశిస్తున్నాడు. “IPL ఒక ప్రత్యేక అనుభవం. నేను నా మొదటి సీజన్‌లా మళ్లీ రాణించాలని భావిస్తున్నాను,” అని ఆయన అన్నాడు.
లివింగ్‌స్టోన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇంగ్లండ్ క్రికెట్ వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టాయి. ఆటగాళ్లతో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, పాత్రలపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. IPLలో ఆయన ప్రదర్శన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
