AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srivari Brahmotsavas: అందంగా ముస్తాబైన తిరుమల.. రేపు సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ఏదైనా ఉత్స‌వం నిర్వ‌హించే ముందు అది విజ‌య‌వంతం కావాల‌ని కోరుతూ స్వామివారిని ప్రార్థిస్తూ అంకురార్పణ చేస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షిస్తారు.

Srivari Brahmotsavas: అందంగా ముస్తాబైన తిరుమల.. రేపు సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Srivari Brahmotsavas 2022
Surya Kala
|

Updated on: Sep 25, 2022 | 8:26 PM

Share

Srivari Brahmotsavas: ప్ర‌పంచ మాన‌వాళి సంక్షేమాన్ని కాంక్షించ‌డంతో పాటు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి దివ్య‌మైన ఆశీస్సుల‌ను భ‌క్తులంద‌రికీ అందించేందుకు శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను టీటీడీ నిర్వ‌హిస్తుంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడుకి బ్రహ్మోత్సవాలకు సోమ‌వారం రాత్రి 7 నుండి 8 గంట‌ల మధ్య  శాస్త్రోక్తంగా అంకురార్పణం జరగనుంది. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్స‌వం నిర్వ‌హించే ముందు అది విజ‌య‌వంతం కావాల‌ని కోరుతూ స్వామివారిని ప్రార్థిస్తూ అంకురార్పణ చేస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షిస్తారు.

అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కనుక ఇది అంకురార్పణం అయింది. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు.  అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. శాస్త్రాల ప్రకారం ఉత్సవానికి తొమ్మిది రోజుల ముందు అంకురార్పణం కార్యక్రమం నిర్వహించనున్నారు.

పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వెంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఈ ప్రకారం ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీవేంకటేశ్వరుడికి  ఆశ్వయుజంలోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించార‌ట‌. అందువల్లే ఇవి ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధిచెంది అప్పటినుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది రేపటి నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు 9 రోజుల పాటు జ‌రుగ‌నున్నాయి.  ఈ ఉత్స‌వాల్లో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తి అయిన శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు వివిధ వాహ‌నాల‌పై ఆల‌య నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు దివ్య‌ద‌ర్శ‌నంఇస్తారు. ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు నిర్వహించనున్నారు. గరుడవాహనసేవ రాత్రి 7 నుండి అర్ధ‌రాత్రి ఒంటి గంట వరకు జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

క‌రోనా కార‌ణంగా రెండేళ్ల త‌రువాత మాడ వీధుల్లో బ్ర‌హ్మోత్స‌వ వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హించ‌నున్నందున విశేషంగా విచ్చేసే భ‌క్తులకు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు టీటీడీ భారీగా ఏర్పాట్లు చేసింది. ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా రంగ‌వ‌ల్లులు తీర్చిదిద్దారు. గ్యాల‌రీల్లో  వేచివుండే భ‌క్తుల సౌక‌ర్యార్థం తాగునీరు, మ‌రుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. భ‌క్తులు మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారీకేడ్లు, క్యూలైన్ల గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..