TTD Rath Saptami: ఇక అలాంటి ఘటనకు నో ఛాన్స్.. రథసప్తమి వేడుకలపై టీటీడీ హై అలెర్ట్..!
తిరుమలలో రథసప్తమి వేడుకలకు మాడవీధులు ముస్తాబవుతున్నాయి. రథసప్తమి సందర్భంగా ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసినట్టు ప్రకటించింది టీటీడీ. సుమారు రెండు లక్షల మంది భక్తులు హాజరుకానుండటంతో గత అనుభవాల దృష్ట్యా గ్యాలరీల్లో ఉండే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది పాలకమండలి.

తిరుపతి తొక్కిసలాట ఘటన తిరుమల తిరుపతి దేవస్థానం మరింత అప్రమత్తం చేసింది. రథసప్తమిపై టీటీడీ ఫోకస్ చేసింది. ఇదే అజెండాగా పాలక మండలి ప్రత్యేక సమావేశం కాబోతోంది. భక్తుల రద్దీ, వసతి, భద్రతకు హై ప్రియారిటీ ఇవ్వనుంది.
తిరుమల వెంకన్న క్షేత్రంలో జరగనున్న రథసప్తమికి టీటీడీ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలో జరిగే అన్ని ఉత్సవాల్లో కన్నా రథసప్తమికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఒక రోజు బ్రహ్మోత్సవం గా కూడా పరిగణించే రథసప్తమికి దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని టిటిడి అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా నే అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే తిరుమలలో రథసప్తమి వాహన సేవల ట్రయల్ రన్ నిర్వహించిన టీటీడీ సర్వభూపాల, సూర్యప్రభ వాహనాన్ని ట్రయల్ రన్ చేపట్టింది.
ఫిబ్రవరి 4న రథసప్తమి వేడుకలు జరగనున్న నేపథ్యంలో అధికారులతో పలు సమీక్షలు, సమావేశాలు నిర్వహించిన టీటీడీ శుక్రవారం(జనవరి 31) అత్యవసర పాలకమండలి సమావేశం నిర్వహించనుంది. భక్తుల రద్దీని అంచనా వేసి ముందుస్తు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, వైద్య బృందాలు, ఎల్ఈడి స్క్రీన్ల ఏర్పాటుపై ఇప్పటికే ప్రత్యేక సమీక్ష నిర్వహించింది. శుక్రవారం టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం కూడా రథసప్తమి ప్రధాన ఏజెండా జరగనుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్వర్యంలో రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు, అధికారులతో సమీక్ష జరగనుంది.భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేయనుంది.
రథసప్తమి రోజు ప్రత్యేకంగా అలంకరించిన ఏడు వాహనాలపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. జనవరి 8వ తేదీన తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తోపులాట ఘటన ను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తోంది. రథసప్తమికి పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ ఫిబ్రవరి 3 నుండి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు జారీ రద్దు చేసింది. ఫిబ్రవరి 4న పలు ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనాలు, అన్ని ప్రివిలైజ్ దర్శనాలను రద్దు చేసింది. గ్యాలరీలో ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు, అన్నప్రసాదాలు అందజేయడం తోపాటు భక్తుల రద్దీకి తగ్గట్టుగా భద్రత పరంగా కలెక్టర్, ఎస్పీతో కలిసి చర్చించి అన్ని చర్యలు తీసుకుంటోంది.
ప్రతి ఏటా సూర్య జయంతి సందర్భంగా శుక్లపక్ష సప్తమి తిథిలో తిరుమలలో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తుంది టీటీడీ. ఫిబ్రవరి 4న ఉదయం 5.30కి సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహన సేవ.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి.
రథసప్తమి వేడుకల కోసం మాడవీధుల్లో్ ఏర్పాట్లను పరిశీలించారు టీటీడీ ఈవో, అదనపు ఈవో. రథసప్తమి సందర్భంగా అష్టాదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేసినట్టు ప్రకటించింది టీటీడీ. ఎన్‌ఆర్‌ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసింది. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. ఫిబ్రవరి 4న జరగనున్న ఈ వేడుకలకు సుమారు రెండు లక్షల మంది భక్తులు హాజరవుతారు. భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..