TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. గంటన్నర వ్యవధిలోనే దర్శనం.. ఎప్పటి నుంచంటే..
సామాన్య భక్తులు గంటల కొద్దీ నిరీక్షణ లేకుండా శ్రీవారి దర్శనం కల్పించేందుకు ప్లాన్ రెడీ చేసినట్లుగా ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. భక్తులకు సర్వదర్శనం గంటన్నర వ్యవధిలోనే చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) గుడ్‌న్యూస్ చెప్పింది. సామాన్య భక్తులు గంటల కొద్దీ నిరీక్షణ లేకుండా శ్రీవారి దర్శనం కల్పించేందుకు ప్లాన్ రెడీ చేసినట్లుగా ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. భక్తులకు సర్వదర్శనం గంటన్నర వ్యవధిలోనే చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా రూ.300 దర్శనంతో పాటు వివిధ సేవలకు సంబంధించిన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. రద్దీకి అనుగుణంగా సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. తిరుపతిలోని శ్రీభూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం, శ్రీనివాసం ప్రాంతాల్లో టైమ్‌స్లాట్ టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు రద్దీకి అనుగుణంగా సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రొటోకాల్ మినహా వీఐపీ బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలను తీసుకోవడం లేదని గుర్తు చేశారు.
శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన నిధులతో 150 కొత్త ఆలయాలను నిర్మించామన్నారు. అలాగే, దాదాపు 100 పురాతన ఆలయాలకు నిధులు కేటాయించామని అన్నారు. గత రెండున్నరేళ్లలో తిరుమలలో దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తిరుమలలో 7,500 గదులకు 40 ఏళ్లుగా మరమ్మతులు చేయలేదని, కరోనా సమయంలో 4,500 గదులకు మరమ్మతులు చేసినట్టు వివరించారు. సెప్టెంబరు నాటికి మిగతా గదులకు కూడా మరమ్మతు పూర్తిచేస్తామని ధర్మారెడ్డి తెలిపారు.
రెండున్నరేళ్లలో రూ.1500 కోట్ల విరాళాలు తీసుకురాగలిగామని.. హుండీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇతర పనులకు ఉపయోగించకుండా బ్యాంకుల్లో జమ చేసేందుకు అవకాశం కలిగినట్లు చెప్పారు. మొత్తానికి సామాన్య భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోందనే చెప్పాలి.