Tirumala: తిరుమల లడ్డూ వివాదంపై దేశవ్యాప్తంగా ప్రకంపనలు.. సీబీఐ విచారణకు కేంద్ర మంత్రులు సహా పలువురి డిమాండ్
తిరుమల లడ్డు ప్రసాదం లో ఉపయోగించే నెయ్యి కల్తీ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఓ వైపు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. ఒకరు సుప్రీంకోర్టుకు వెళితే...మరొకరు హైకోర్టు తలుపులు తట్టారు. ఇంకొకరు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారు. ఇక ఈ విషయంపై కేంద్రం కూడా కదిలింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సమగ్ర నివేదిక కోరింది. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ మేటర్...దేశవ్యాప్తంగా హీట్ పెంచేసింది. అంతేకాదు నెక్స్ట్ ఏమిటి అనే ఆలోచన అందరిలోనూ కలుగుతుంది.
పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అయిందనే వార్తలు భక్తుల్లో ఆందోళన, ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. తిరుమల లడ్డూ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కల్తీ నెయ్యి ఘటన ఎంతో బాధ కలిగించిందని, ఇలాంటి ఘటనలతో ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు రాహుల్. దీనిపై లోతైన విచారణ జరపాలన్నారు. ఇదే విషయంపై ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. అన్యమతస్తులకు TTD పగ్గాలు ఇవ్వడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు బండి. CBIతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు నిగ్గు తేలుతాయన్నారు.
సీబీఐ విచారణకు కేంద్ర మంత్రులు డిమాండ్
కేంద్ర మంత్రులు ప్రల్హాద్ జోషి, గిరిరాజ్ సింగ్ కూడా ఈ మేటర్‌పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు చాలా తీవ్రమైనవని, ఆ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని, దోషులను కఠినంగా శిక్షించాలన్నారు ప్రల్హాద్ జోషి. మన మధ్య హిందూ వ్యతిరేకులు ఉన్నారు, మమ్మల్ని క్షమించు వెంకటేశ్వర అంటూ కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ట్వీట్ చేశారు. ఈ విషయంలో ల్యాబ్ రిపోర్ట్ పంపించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. ఆ నివేదికపై సమగ్ర పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు ఆయన.
సీజేఐకి జర్నలిస్ట్ లేఖ
ఇదే మేటర్‌పై సుప్రీంకోర్టు సీజేఐకి లేఖ రాశారు జర్నలిస్ట్ సురేష్ చౌహాన్కే. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని, ఆలయాల పవిత్రత, మత విశ్వాసాలు, సంప్రదాయాలపై అవగాహన ఉన్నవారికే దేవాలయాల నిర్వహణ అప్పగించాలని ఆ లేఖలో కోరారు.
ముందే ఎందుకు విచారణ చేయలేదన్న షర్మిల
దోషులను 48 గంటల్లో గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై కాలయాపన చేస్తే ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరించారు బీసీ యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. ఇక లడ్డూ వివాదంపై హాట్ కామెంట్స్ చేశారు షర్మిల. వంద రోజులు ముందే తెలిసినప్పుడు ఎందుకు విచారణకు ఆదేశించలేదని చంద్రబాబును ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ అమిత్‌షాకి లేఖ రాశారు షర్మిల.
తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ఆ పార్టీ. ఈ విషయంపై సిట్టింగ్ జడ్జి లేదా కోర్టు నియమించిన కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కోరింది. వచ్చే బుధవారం నాడు పిటిషన్‌ను విచారిస్తామంది కోర్టు. సీబీఐ విచారణకు డిమాండ్లు, హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడంతో.. ఈ మేటర్‌లో వాట్ నెక్ట్స్ అనే ఉత్కంఠ నెలకొంది. మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..