AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అరుదైన శివలింగం.. ఆ ఆలయంలో ప్రతిదీ అద్భుతమే..!

తొలి శివాలయానికి ఎంతో చరిత్ర ఉందంటున్న భక్తులు ఆలయ ప్రాశస్త్యం గొప్పదంటున్నారు పరమేశ్వరుడు పరుశురామేశ్వరుడిగా ఎందుకయ్యాడనే పలు పురాణ ఆధారాలు ప్రాచూర్యంలో ఉన్నాయంటున్నారు. స్థల పురాణం ప్రకారం తండ్రి ఆజ్ఞ మేరకు పరశురాముడు తల్లిని సంహరించి తిరిగి తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బతికించుకున్నాడని కథనం పురాణాలు చెబుతున్నాయి.

ప్రపంచంలోనే అరుదైన శివలింగం.. ఆ ఆలయంలో ప్రతిదీ అద్భుతమే..!
Gudimallam Shivalinga
Raju M P R
| Edited By: Balaraju Goud|

Updated on: Feb 26, 2025 | 8:44 AM

Share

ఆ ఆలయంలోని శివలింగం త్రిమూర్తులతో ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అరుదైన శివలింగంగా చరిత్ర కెక్కింది. తిరుపతి జిల్లా గుడిమల్లంలోని ఈ ఛారిత్రక కట్టడం ఏ కాలం నాటిదన్న దానిపై స్పష్టత లేదు. భారతీయ పురావస్తు శాఖలో సరైన ఆధారం లేదు. కానీ 1 నుంచి 3 వ శతాబ్దానికి మధ్య కాలం నాటి ప్రాచీన ఆలయంగా మాత్రం పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆలయం విశేషాలేంటి..  ఆ ఆలయంలో కొలువైన నిజలింగం ప్రత్యేకత ఏంటి.. స్థలపురాణం ఏం చెబుతోంది..!

అరుదైనదే కాదు అద్భుత కళా సంపద

గుడిమల్లం. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని ఒక మారుమూల గ్రామం. తిరుపతికి దాదాపు 25 కిలో మీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామం చారిత్రక సంపదకు నిలయం. రోడ్డు సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉన్న గుడిమల్లంలో ఉన్న ఆలయం ఎంతో చరిత్రను ఇనుమడింప చేసుకుంది. ఏర్పేడు మండలం లోని గుడిమల్లం ఆలయం శాతవాహన నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. తవ్వకాల్లో లభించిన శాసనాలు ద్వారా 12వ శతాబ్దంలో విక్రమ చోళులు కాలంలో ఆలయం పునర్ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది.

గర్భాలయం పైకప్పు గజవృష్ట ఆకారంలో ఉండగా ఛోళుల తర్వాత పల్లవులు కొంత కాలం ఆలయ నిర్వహణ కొనసాగించినట్లు తెలుస్తోంది. గుడి పల్లం కాస్తా గుడిమల్లంగా ఏర్పడగా చోళ, పల్లవుల కాలం నుంచి రాయల కాలం దాకా నిత్య దూప నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయం 1954లో ఆర్కియాలజీ చేతిలోని వెళ్ళింది. దీంతో పూజలు నిలిచిపోవడంతో చాలా విగ్రహాలు చోరీకి గురి అయ్యాయి. ప్రస్తుతం భారత పురావస్తు శాఖ వద్ద ఆలయానికి చెందిన సాహిత్యం కూడా లేకపోగా ఉజ్జయినిలో దొరికిన రాగి నాణేలపై గుడిమల్లం ఆలయం మూల విరాట్ బొమ్మ ఉండగా, మధుర మ్యూజియంలోనూ ఇలాంటి శిల ఉందని తెలుస్తోంది. 9వ శతాబ్దం వరకు ఆరు బయటనే పూజలు అందుకుంటున్న శివలింగం చుట్టూ రాజవంశాలు గుడి నిర్మాణాలు చేపట్టాయి. ఆలయ ప్రాంగణంలో పార్వతి, సుబ్రమణ్యస్వామి, సూర్య భగవానుడి విగ్రహాలతో ఆలయ నిర్మాణం జరిగింది.

60 ఏళ్లకు ఒకసారి అసలేం జరుగుతుంది..!

ఏకశిలపై శివుని అనేక రూపాలు చెక్కడం నాటి శిల్పుల విశిష్టతను చాటుతోంది. భూగర్భజల మట్టం ఈ లింగం కింద 350 అడుగుల లోతు లో ఉన్నప్పటికీ ఒత్తిడి పెరిగిన సమయంలో ఆ నీళ్లు లింగంపై పడుతుంటాయి. ఈ నిర్మాణం వెనుక అద్భుతమైన అర్కెటెక్చర్ పరిజ్ఞానం దాగి ఉంది. 2005 డిసెంబర్ 5న అలా నీళ్లు శివుడిని అభిషేకించాయి. తిరిగి 60 ఏళ్లకు అంటే 2065 కు అలా వచ్చే వరదనీటితో ఈ ఆలయం నిండి పోతుందని భక్తుల నమ్మకం. శిల్ప చరిత్రలోనే అపురూపమైనదని అంతర్జాతీయ పురాతత్వ వేత్తల రచనలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఇక ఆలయంలోని దొరికిన శాసనాల ద్వారా పరమేశ్వర ఆలయంగా గుర్తించిన చరిత్రకారులు శిల్ప చరిత్రలోనే అపురూపమైన శివలింగం ప్రాచీనమైనదిగా గుర్తించారు. పురావస్తుశాఖ పరిశోధన ప్రకారం క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన ఆలయంగా గుర్తించగా 1908 నాటికే బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఆలయాన్ని గుర్తించింది.

లింగాన్ని ప్రతిష్టించిదెవరు..?

ఇక ఆలయంలోని త్రిమూర్తులు కొలువైన శివలింగం ఎవరు ప్రతిష్టించారన్న శాసన ఆధారం ఏమీ లేకపోవడంతో ఇది నిజలింగం, స్వయంభుగా వెలసిందన్నదే అని అందరి నమ్మకం. ఈ మేరకు భక్తుల తాకిడి కూడా ఈ మధ్యకాలంలో పెరగ్గా గత కొన్నేళ్లుగా స్థానికుల సహకారంతో దేవాదాయ శాఖ 7 రోజులపాటు మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇక ఆలయాల జిల్లాగా పేరొందిన తిరుపతి జిల్లాలో ఎన్నో చారిత్రక, పురాతన కట్టడాలున్నాయి. శ్రీవారి దివ్యక్షేత్రం తిరుమలతోపాటు ప్రముఖ ఆలయాలున్న తిరుపతి జిల్లా పర్యాటక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. క్రీస్తు పూర్వం రెండో శతాబ్దానికి చెందిన ఆలయంగా గుర్తింపు ఉన్న గుడిమల్లంలోని శ్రీ పరుశరామేశ్వరుని ఆలయం శైవం, వైష్ణం రెండింటినీ ప్రతిబింబిస్తున్న ఆలయం. భారతీయ పురావస్తుశాఖ పర్యవేక్షణలో ఉన్న ఆలయం మలి చక్రవర్తి నిర్మించిన ఈ ఆలయంలో విష్ణువు, బ్రహ్మ, శివుడు ఇలా ముగ్గురి ఆకృతులు ఒక్కటిగా పరుశరాముడు పురుష లింగా కారంలో దర్శనం ఇస్తుండటం విశేషం.

త్రిమూర్తులు కలిగిన శివలింగం ప్రపంచంలోనే అరుదైన విషయమని చరిత్రకారుల అభిప్రాయం. గొడ్డలి ధరించిన విష్ణువు ఆకృతి లోని శివలింగం నల్లరాతితో ప్రత్యేక శైలిలో చెక్కిన ఇక్కడి విగ్రహం విలువ చరిత్ర కారుల అంచనా ప్రకారం కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. యాదవ దేవరాయల కాలం లో అంటే క్రీస్తు శకం 842 నుంచి క్రీస్తు శకం 1346 మధ్యకాలంలో ఈ ఆలయంలోని మూల విరాట్ కు పూజలు జరిగాయని శిలా శాసనాల ఆధారంగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆలయ నిర్వహణ క్షీణించగా ఈ దేవాలయాన్ని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. స్థలపురాణం పరిశీలిస్తే ఈ ఆలయం ఎంతో చారిత్రక నిర్మాణంగా భావిస్తున్న భక్తులు త్రిమూర్తులున్న శివలింగాన్ని దర్శించుకోవడం అధృష్టంగా భావిస్తారు.

తొలి శివాలయం ఇదే..!

తొలి శివాలయానికి ఎంతో చరిత్ర ఉందంటున్న భక్తులు ఆలయ ప్రాశస్త్యం గొప్పదంటున్నారు పరమేశ్వరుడు పరుశురామేశ్వరుడిగా ఎందుకయ్యాడనే పలు పురాణ ఆధారాలు ప్రాచూర్యంలో ఉన్నాయంటున్నారు. స్థల పురాణం ప్రకారం తండ్రి ఆజ్ఞ మేరకు పరశురాముడు తల్లిని సంహరించి తిరిగి తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బతికించుకున్నాడని కథనం పురాణాలు చెబుతున్నాయి. పాప ప్రాయిశ్చిత్యం కోసం గుడిమల్లంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో తపస్సు చేసేందుకు వచ్చిన పరశురాముడు స్వయంభు గా వెలసిన శివలింగాన్ని పూజిస్తాడు. ఆ అడవిలో సరోవరాన్ని నిర్మించుకున్న పరశురాముడు అక్కడే తపస్సు చేశాడు.

అక్కడ పూసే విచిత్రమైన ఆకారంలో పూసే వింత సువాసన వెదజల్లే ఒకే ఒక పువ్వుతో శివున్ని ఆరాధించేవారు. ఆ పువ్వును అడవి జంతువుల నుంచి కాపాడేందుకు చిత్రశేనుడు అనే యక్షకుడిని ఏర్పాటు చేసి ప్రతిరోజు జంతువును ఆహారంగా ఇచ్చే వాడని, ఒక రోజు పరశురాముడు రాకముందే ఆ పుష్పాన్ని స్వామి వారికి సమర్పించి పూజించడంతో చిత్రశేనుడి తో పరశురాముడు యుద్ధం చేశాడని పురాణ కథలు చెబుతున్నాయి. దాదాపు 14 ఏళ్లు పాటు యుద్ధం చేశాడని, యుద్ధం ముగియకపోవడంతో పరమశివుడు ప్రత్యక్షమైన భక్తికి మెచ్చాడని పురాణాలు చెబుతున్నాయంటున్నారు ఆలయ అర్చకులు.

ఇక ప్రాచూర్యంలో ఉన్న కథలు రెండుగా విచ్చిన్నమైన శివుడు ఆ ఇద్దరులో ఏకమయ్యాడని చెబుతున్నాయి. దీంతో ఒక్కడి లింగం ఒక ఆకారం పరుశరాముడి గాను ఒక చేతిలో వేటాడిన మృగంతో చిత్రశేనుడు బ్రహ్మ ముఖంతో వెలసినట్లు భక్తుల నమ్మకం. ఇక పెరుగుతున్న సూర్యకిరణాలు ఉత్తరాయణం, ధక్షణాయంలో రెండుసార్లు ఈ పరశురాముడి ఆలయంలోని శివలింగాన్ని సృజిస్తాయి. ఇప్పటికీ ఈ అద్భుతం జరుగుతుండగా ఈ ఆలయంలోని శివలింగంపై యక్షుడి భుజాలపై మానవుడి ఆకారంలో ఉన్న శివుడి రూపం కనిపిస్తుండగా చంద్రగిరి సంస్థానానికి చెందిన రాజుల కాలంలో ఉజ్వలంగా వెలిగి పోయింది. అయితే మహ్మదీయుల పాలనలో ఆలయంలోని కొన్ని విగ్రహాలు ద్వంసం అయ్యాయన్నది చరిత్రకారుల అభిప్రాయం. నవ పాషాలతో నల్లని రాతి విగ్రహం వెల కట్టలేనిదంటున్న చరిత్రకారులు ఆలయ నిర్మాణం కళా సంపదకు నిలయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..