AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CPR Training: పునర్జన్మనిస్తున్న సీపీఆర్.. అత్యవసర సమయాల్లో ఫర్‌ఫెక్ట్‌గా ఎలా చేయాలంటే?

How to perform CPR perfectly: ఇటీవల గుండెపోటు మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో, సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పుల వల్ల యువతలోనూ గుండెపోటు వస్తోంది. అప్రమత్తంగా ఉండి సరైన సమయంలో సీపీఆర్ చేస్తే, ప్రాణాలు రక్షించవచ్చు. ప్రభుత్వం, ప్రజలు ఈ నైపుణ్యాన్ని నేర్చుకోవాలని ప్రోత్సహిస్తోంది, ప్రాణదాతలుగా మారే అవకాశం కల్పిస్తోంది.

CPR Training: పునర్జన్మనిస్తున్న సీపీఆర్.. అత్యవసర సమయాల్లో ఫర్‌ఫెక్ట్‌గా ఎలా చేయాలంటే?
Cpr Training
Naresh Gollana
| Edited By: |

Updated on: Jan 24, 2026 | 4:06 PM

Share

ఈ మధ్య ఎక్కడ చూసినా ఏ నోట విన్నా.. సీపీఆర్ అనే మాట దండిగానే వినిపిస్తోంది. మన మధ్య సంతోషంగా గడుపుతున్న ఓవ్యక్తి ఉన్నట్టుండి కింద పడిపోయి హఠాత్తుగా స్పృహకోల్పోతున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు అలర్ట్ అయి సీపిఆర్ చేయడంతో పోయిన ప్రాణాలు తిరిగొచ్చి పునర్ జన్మ పొందిన‌ వారవుతున్నారు. ఈలిస్ట్ లో ఈ‌వయసు ఆ వయసు అన్నతేడా లేదు.. 30 ఏళ్ల నవ యువత నుండి మొదలు 60 ఏళ్ల వృద్దుల వరకు అందరు ఈ ప్రమాదం భారీన పడుతున్నారు. కారణం.. ఆహారపు అలవాట్లు, జీవన శైలి, మానసిక ఒత్తిడి వంటివి అని చెప్తున్నారు వైద్యులు. దీంతో‌ రంగంలోకి‌ దిగిన వైద్యారోగ్య శాఖ, ప్రభుత్వాలు గుండెపోటు మరణాలను నివారించాలన్న లక్ష్యంతో సీపీఆర్‌ (కార్డియో పల్మనరీ రిససిటేషన్‌) పై అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది.

తాజాగా నిర్మల్ జిల్లా బాసర అమ్మ వారి ఆలయంలో వసంత పంచమి వేడుకల్లో పాల్గొనేందుకు మంచిర్యాల జిల్లా నుండి వచ్చిన సిద్దం తిరుపతి అనే వ్యక్తి ఉన్నట్టుండి హఠాత్తుగా కిందపడిపోయాడు. క్యూలైన్ లో అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న ఆయన అస్వస్థతకు గురై ఒక్కసారిగా కూలిపోయాడు. వెంటనే అప్రమత్తం అయిన బాసర ఆలయ హోంగార్డు సిబ్బంది ఇంద్రకరణ్ రెడ్డి, గణేష్ లు తిరుపతికి సీపీఆర్ చేశారు. తిరుపతిని ప్రాణాపాయం నుండి కాపాడి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఒక్క తిరుపతే కాదు చాలా మందిది ఈ మధ్య ఇదే పరిస్థితి. పోలీస్ కానిస్టేబుల్లు, ట్రాపిక్ పోలీసులు, హోంగార్డులు చాలా వరకు సీపీఆర్ పై అవగాహన పెంచుకోవడంతో గుండెపోటుకు గురవుతున్న వారిని కాపాడుతున్నారు.

కార్డియాక్‌ అరెస్ట్‌ అంటే ఏమిటి

ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండె స్తంభించి, హృదయ స్పందనలు ఆగిపోవడమే కార్డియాక్ అరెస్ట్. కొందరికి గుండెల్లో నొప్పి రాకుండానే ఈ రకమైన గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆ సమయంలో అవగాహన ఉన్నవారు వెంటనే సీపీఆర్‌ చేస్తే ప్రాణాలను కాపాడవచ్చు. లేదంటే ప్రాణాలు గాలిలో కలిసి పోతాయి. అలా జరగకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ సీపీఆర్ పై విస్తృత ప్రచారం చేస్తోంది.

సీపీఆర్ చేసి ఎలా కాపాడాలి..

మొదటగా బాధితుడు ఊపిరి తీసుకుంటున్నాడా లేదా.. నాడీ కొట్టుకుంటుందా.. లేదా చూడాలి. ఈ రెండూ లేకున్నా, గుండె వేగంగా అతి తక్కువగా ఉన్నా వెంటనే సీపీఆర్‌ చేయాలి. గుండెపై కుడిచేతి కింద ఎడమ చేయి పెట్టి వేళ్లను చొప్పించి లాక్‌ చేయాలి. ఛాతికి, పొట్టకు మధ్యలో ఎడమవైపున నిమిషానికి 120 సార్లు ప్రెస్‌ చేయాలి. నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల లోపలికి వెళ్లేలా ఒత్తిడి చేయాలి. రెండుసార్లు నోటి ద్వారా శ్వాసను అందించాలి. ఈ ప్రక్రియను ఐదు నుంచి పది నిమిషాల పాటు మోచేతులు వంపకుండా, మోకాళ్లను నేలమీద పెట్టి చేయాలి. కార్డియాక్ అరెస్ట్ కు గురైన వ్యక్తి స్పృహలోకి వచ్చిన వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ఇలా చేస్తే గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడవచ్చు.

ఒక వ్యక్తి ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు రక్త ప్రసరణలో తేడా వస్తుంది. ఈ సందర్భాల్లో మెదడు, శరీరంలోని ముఖ్యమైన అవయవాలకు రక్తం ప్రసరణ నిలిచిపోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో సీపీఆర్​ ద్వారా రక్త ప్రవాహాన్ని త్వరగా పునరుద్ధరించి బాధితుడిని కాపాడవచ్చని చెబుతున్నారు వైద్యులు.

గుండెపోటు వచ్చిన తర్వాత, అవయవాలన్నీ పని చేయడం ఆగిపోవడానికి దాదాపు ఐదు నుంచి పది నిమిషాల సమయం పడుతుందని.. ఆ ఐదు నిమిషాల సమయమే అత్యంత విలువైన సమయమని.. మెదడును సజీవంగా ఉంచి ప్రాణాల్ని రక్షించేందుకు సీపీఆర్ ఎంతగానే ఉపయోగ పడుతుందని చెపుతున్నారు వైద్య నిపుణులు. సమాజంలో ప్రతి ఒక్కరూ సీపీఆర్ చేయడం​ నేర్చుకోవాలని.. ప్రాణదాతలుగా మారే అవకాశం దక్కుతుందని చెపుతున్నారు నిపుణులు.

మరిన్ని లైఫ్‌స్లైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.