AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు బిగ్ రిలీఫ్.. నగరంలో కొత్తగా ఆరు లైన్ల భారీ ఫ్లైఓవర్.. ఈ ప్రాంతాల మీదుగా..

హైదరాబాద్ ప్రజలకు భారీ గుడ్ న్యూస్ అందించింది జీహెచ్‌ఎంసీ. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి సిద్దమవుతోంది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్‌కి సులువుగా చేరుకునేలా ఆరు లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి సిద్దమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన డీపీఆర్ రెడీ అవ్వగా.. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు బిగ్ రిలీఫ్.. నగరంలో కొత్తగా ఆరు లైన్ల భారీ ఫ్లైఓవర్.. ఈ ప్రాంతాల మీదుగా..
Hyderabad Flyover
Venkatrao Lella
|

Updated on: Mar 06, 2026 | 11:21 AM

Share

హైదరాబాద్‌లో వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గించడం, ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా కొత్త ఫైఓవర్ల నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు జరుగుతోండగా.. మరికొన్ని ప్రాంతాల్లో కొత్తవాటిని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ప్రజలకు ఉపయోగపడేలా మరో నూతన ఫ్లైఓవర్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ రెడీ అవుతోంది. ఎయిర్ పోర్ట్ వైపు వెళ్లేవారికి ఈ కొత్త ఫ్లైఓవర్ ఎంతో ఉపయోగపడనుంది. మరింత వేగంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఆరు లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణం

హైదరాబాద్ నుంచి శంషాబాద్ వరకు మెట్రోను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూట్ మ్యాప్ రెడీ చేసింది. రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా నేరుగా ఎయిర్‌పోర్ట్ వరకు చేరుకునేలా మెట్రో లైన్ నిర్మించనుంది. ఇందుకోసం ఇప్పటికే డీపీఆర్ రెడీ అవ్వగా.. ఇప్పుడు దీనికి సమాంతరంగా ఆరు లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ సిద్దమవుతోంది. దాదాపు ఇందుకోసం రూ.345 కోట్లు అవసరమవుతుందని అంచనా వేసింది. మైలార్ దేవ్ పల్లి, శంషాబాద్, కాటేదాన్ జంక్షన్ల మీదుగా ఈ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇరువైపులు రాకపోకలు సాగించేలా బై డైరెక్షన్ ఆరు లైన్లుగా ఫ్లైఓవర్ ఉంటుంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ చొరవతో ఈ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. వాహనాల కదలికను నిర్ధారించడం, ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లే ప్రయాణికులకు మాత్రమే కాకుండా నేషనల్ హైవే ఉపయోగించేవారికి ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా ఈ కొత్త ఫ్లైఓవర్ ఉండనుంది.

ఎయిర్‌పోర్ట్‌కి పెరగనున్న కనెక్టివిటీ

ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాలంటే విమానాశ్రయ బస్సులు, ప్రైవేట్ వాహనాలపై ప్రయాణికులు ఆధారపడాల్సి వస్తుంది. ఇది ప్రయాణ, పార్కింగ్ ఖర్చులను పెంచుతుంది. ప్రయాణికులకు అనువైన రవాణా వ్యవస్థను తీసుకొచ్చేందుకు మెట్రో, ఫ్లైఓవర్లు ఉపయోగపడనున్నాయి. నగరం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లేందుకు కనెక్టివిటీ మరింత పెరగనుంది. దీంతో ప్రయాణికులతో పాటు వాహనదారులకు ఊరట లభించనుంది. అటు నగరంలో మరికొన్ని ఫ్లైఓవర్లు ప్రతిపాదన దశలో ఉన్నాయి. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి జీవీకే మాల్ వైపు స్టీల్ వంతెన, టీవీ9 ఆఫీస్ వద్ద అండర్ పాస్ వంటి పనులను త్వరలోనే చేపట్టనుంది. ఇక కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ వంటివి ప్రతిపాదన దశలో ఉన్నాయి. త్వరలోనే టెండర్లను ఆహ్వానించి వీటి పనులు మొదలుపెట్టనుంది. భవిష్యత్తులో ఈ కొత్త ఫ్లైఓవర్ల రాకతో నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గనుందని చెప్పవచ్చు.

Follow Us