రోడ్డు మీద పరుగులు తీస్తున్న ఆటో.. లోపల ఏముందో చూసి పోలీసులకే షాక్!
Hyderabad Ganja Seizure: హైదరాబాద్‌లో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. గచ్చిబౌలి–మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో 26 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, గంజాయి డాన్‌గా పేరుగాంచిన నీతు భాయ్ అనుచరుడైన ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నీతు భాయ్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా, నగరంలోని డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌పై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.

హైదరాబాద్ నగరంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మాదాపూర్ ఎస్ఓటీ (SOT), గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గంజాయి డాన్‌గా పేరుగాంచిన నీతు భాయ్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో అనుమానాస్పదంగా గంజాయి తరలిస్తున్న ఆటోను గుర్తించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలో 26 కిలోల గంజాయి లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.26 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. పట్టుబడిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతను పరారీలో ఉన్న గంజాయి వ్యాపారి నీతు భాయ్‌కు అనుచరుడిగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అనంతరం స్వాధీనం చేసుకున్న గంజాయిని తదుపరి దర్యాప్తు కోసం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న నీతు భాయ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. అలాగే నగరంలో గంజాయి సరఫరా నెట్‌వర్క్, సంబంధిత వ్యక్తులు, సరఫరా మార్గాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, మాదకద్రవ్యాల వ్యాపారంలో పాల్గొనే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
