Chidambaram Nataraja Temple: ఆ ఆలయాన్ని దీక్షితుల వర్గం నిర్మించలేదు.. తమిళనాడు మంత్రి శేఖర్ బాబు సంచలన
వెనక్కి తగ్గేదే లేదు. రాజుల కాలం నాటి సంపద వివరాలు తెలుసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది.. అంటూ మంత్రి శేఖర్‌బాబు చేసిన వ్యాఖ్యలతో వివాదం పీక్స్‌కు చేరింది.
తమిళనాడులో చిదంబరం నటరాజ స్వామి ఆలయ సంపద లెక్కింపు వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. తాజాగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నటరాజస్వామి ఆలయం ఉన్నది ప్రభుత్వ భూమిలో అని.. ఈ ఆలయం ప్రభుత్వానికే చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆలయాన్ని మహారాజులు కట్టించారని ఈ ఆలయాన్ని దీక్షితుల వర్గం నిర్మించలేదంటూ తమిళనాడు మంత్రి శేఖర్‌బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయ సంపద వివరాలు ప్రభుత్వానికి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. దీక్షితుల వర్గం దీనిని అడ్డుకోవడం మంచిది కాదన్నారు. రాజులకాలం నుంచి ఆలయంలో ఉన్న సంపద ఉందా..? లేదా..? తెలుసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ స్పష్టంచేశారు.
దేవాదాయ శాఖ మీద నమ్మకం లేకపోతే , దీక్షితుల పట్ల ప్రభుత్వ వైఖరి తప్పయితే న్యాయస్థానంలో పోరాటం చేయాలని మంత్రి శేఖర్ సవాల్ విసిరారు. ప్రభుత్వం కూడా న్యాయపోరాటానికి సిద్ధంగా ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆలయ సంపద లెక్కింపు విషయంలో వెనక్కి తగ్గదని మంత్రి శేఖర్ బాబు స్పష్టం చేశారు. ఆలయం, ఆలయం చుట్టు ఉన్న ఇల్లు, స్థలాలు ప్రభుత్వ భూములే అంటూ మంత్రి శేఖర్‌బాబు తెలిపారు.
ప్రభుత్వ భూములపై దీక్షితుల వర్గానికి ఎటువంటి హక్కు లేదని మంత్రి పేర్కొన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసుకున్నారని ఆరోపించారు. భూములపై సర్వ్ ఫై కమిటీని నియమించినట్టు, నివేదిక వచ్చిన తరువాత దేవాదాయ శాఖ వాటిని స్వాధీనం చేసుకుంటుందని మంత్రి శేఖర్ బాబు తెలిపారు. కడలూరు జిల్లాలోని శైవ క్షేత్రమైన చిదంబరం నటరాజ స్వామి ఆలయంపై దీక్షితులు, ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న ఈ వివాదం ఇప్పుడు మరింత ముదురుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..