CM Jagan-Tirumala: ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్న సీఎం జగన్

ఈరోజు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 28వ తేదీ బుధవారం సీఎం నూతన పరకామణి భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు.

CM Jagan-Tirumala: ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్న సీఎం జగన్
Cm Jagan Visits Tirumala
Follow us
Surya Kala

|

Updated on: Sep 27, 2022 | 12:09 PM

CM Jagan-Tirumala: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం అంకురార్పణ చేశారు. ఈరోజు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు.. ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. సాయంత్రం 5.15 నుండి 6.15 గంట‌ల వ‌ర‌కు ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి పెద్ద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తారు. ఈ నేపథ్యంలో కలియుగదైవం కొలువైన క్షేత్రంలో  సీఎం జగన్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఈరోజు సాయంత్రం 5.20 గంటలకు తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి సీఎం జగన్ చేరుకోనున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు అలిపిరిలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్ సర్వీసులను ప్రారంభించనునున్నారు. రాత్రి 7.45 గంటలకు బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాత్రి 8.55 గంటలకు మాడవీధుల్లో శ్రీవారి పెద్ద శేష వాహన సేవలో సీఎం జగన్ పాల్గొననున్నారు. రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు.

రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి:

ఇవి కూడా చదవండి

28వ తేదీ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని  సీఎం జగన్ మోహన్ రెడ్డి దర్శించుకోనున్నారు. అనంతరం నూతన పరకామణి భవనం, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాలాజీ నగర్ లో నిర్మించిన రెస్ట్ రూమ్ ను ప్రారంభించనున్నారు. అనంతరం తిరుమల నుంచి సీఎం జగన్ తిరుగు ప్రయాణంకానున్నారు. రేపు ఉదయం 9.45 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లులో సీఎం జగన్ పర్యటించనున్నారు.

పరకామణి భవనం ప్రత్యేకతలు:

సీఎం చేతులమీదుగా నూతన పరకామణి భవనం ప్రారంభోత్సవం రేపు జరుపుకోనుంది. ఈ కొత్త పరకామణి భవనంలో టీటీడీ అధికారులు హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అంతేకాదు భక్తులు వీక్షించేలా భవనానికి ఇరువైపులా అద్దాలు ఏర్పాటు చేశారు. దాతలు ఇచ్చిన 2.5 కోట్లు విలువ గల చిల్లర నాణేలు వేరు చేసే యంత్రాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ యంత్రం ద్వారా 13 రకాల నాణేలను యంత్రం సెగ్రిగేషన్  చేయవచ్చునని తెలుస్తోంది. ఈ నూతన పరకామణి వాడుకలోకి వచ్చిన అనంతరం.. ఆలయంలోని పాత పరకామణిలో లెక్కింపు నిలిపివేస్తారు.  ఆధునిక సౌకర్యాలు, పటిష్టమైన భద్రతతో మొత్తం 26 కోట్లతో పరకామణి భవనం నిర్మించిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..