first techer in india : భారత్ లో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే.

భారత దేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందిన సావిత్రిబాయి ఫూలే సామజిక సంస్కర్త, విద్యావేత్త, కవయిత్రి.

first techer in india : భారత్ లో మొదటి  మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే.
Follow us
Anil kumar poka

|

Updated on: Jan 03, 2021 | 3:14 PM

భారత దేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందిన సావిత్రిబాయి ఫూలే సామజిక సంస్కర్త, విద్యావేత్త, కవయిత్రి. బ్రిటిష్ హయాంలో మహిళలు ఇల్లుదాటి బైటకు రావడం పాపంగా భావించే రోజులలో, వారి హక్కుల గురించి ఎవ్వరు పట్టించుకోనని సమయంలో ఆమె మహిళా విద్య కోసం, సామజిక రుగ్మతల నిర్ములన కోసం విశేషంగా కృషిచేసిన మహారాష్ట్రలోని పేరొందిన సామజిక సంస్కర్తలలో ఒకరుగా గుర్తింపు పొందారు.

సామాజిక ఉద్యమాలలో క్రియాశీలంగా పాల్గొంటున్న భర్త జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహంతో మహిళల వికాసం కోసం కృషి చేయడమే కాకుండా దేశంలో బాలికల కోసం తొలి పాఠశాలను ప్రారంభించి విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలికారు.

సంపన్న వ్యవసాయ కుటుంభంలో, వెనుకబడిన సామాజిక వర్గంలో మహారాష్ట్రలోని సతారా జిల్లా నాగన్ లో 1931 జనవరి 3న ఆమె జన్మించారు. తొమ్మిదేళ్ల వయస్సులోనే 13 ఏళ్ళ జ్యోతిరావుతో ఆమెకు వివాహం జరిగింది. సనాతన హైందవ గ్రంధాలు అన్నింటిని చదివిన జ్యోతిరావు మానవులు అందరికి విద్య అనే సాధనంను సమకూర్చితే అన్ని సామాజిక అసమానతలు తొలగిపోతాయనే నిర్ణయానికి వచ్చారు.

ముఖ్యంగా అంటరానితనం వికృత రూపం ఆయనను కదిలించివేసింది. కనీసం తమ నీడను సహితం వారు తాకరాదని ఆంక్షలు విధించడం, ముఖ్యంగా వయస్సుమళ్ళిన భర్తలు చనిపోతే యవ్వనంలోనే మహిళలు అందమైన దుస్తువులు, ఆభరణాలు ధరించకుండా, జుట్టు కత్తిరించడం వంటి ఆచారాలకు ఆవేదన చెందారు.

విధవ మహిళలు కేవలం ఆనందం అందించడం కోసమే అంటూ వారితో నగ్నంగా నృత్యాలు చేయించడంతో దిగ్బ్రాంతి చెందారు. అందుకనే మహిళలు చదువుకొనేటట్లు చేయడమే ఈ సమస్యలకు పరిష్కారం అనే నిర్ణయంకు వచ్చారు. ఈ కృషి తన భార్యతోనే ప్రారంభించాలని దృఢ నిర్ణయానికి వచ్చారు.

ఈ విషయం తెలుసుకున్న జ్యోతిరావు తండ్రి ఇరుగు, పొరుగు తమ ఇంటిపై దాడి చేస్తారనే భయంతో వారిని ఇంటి నుండి గెంటివేస్తానని బెదిరించాడు. అయితే సావిత్రిబాయి భర్త అడుగుజాడలలో నడవాలని నిర్ణయించుకోంది.

ముందుగా నిరక్షరాస్యురాలైన భార్యకు ఇంటిలోనే తానే చదువు చెప్పి, తర్వాత ఆమెను ఉపాధ్యాయ శిక్షణకు పంపారు. మరో మహిళా ఫాతిమా షేక్ తో కలసి ఆమె శిక్షణ పూర్తిచేసుకున్నారు. దానితో 1848లో భార్యాభర్తలు ఇద్దరు కలసి భారత దేశంలో మొదటి బాలికల పాఠశాలను పూణే లోని విశ్రంబాగ్ వాడ వద్ద ప్రారంభించారు.

ఈ పాఠశాలలో మొదట్లో కేవలం 9 మంది అన్ని కులాలకు చెందిన బాలికలు మాత్రమే చేరారు. క్రమంగా ఆ సంఖ్య 25కు పెరిగింది. సావిత్రిబాయి ప్రధాన ఉపాధ్యాయురాలిగా పనిచేయగా, ఆమెతో పాటు శిక్షణ పొందిన ఫాతిమా షేక్, జ్యోతిరావు మేనత్త సగుణాబాయి కూడా బోధించేవారు.

ఈ సందర్భంగా అనేక వేధింపులు, దూషణలకు సావిత్రిబాయి గురయ్యారు. జ్యోతిరావు పురుగులు పడి చనిపోతారని, సావిత్రిబాయి అకాల మరణం చెందుతారని అంటూ ఆమె వెడుతూ ఉంటె శాపాలు పెడుతూ వచ్చారు. అయినా ఆమె బెదిరిపోలేదు. ధైర్యంగా నిలబడి వారికి సమాధానం చెప్పెడిది.

“సోదరులారా, మీ చెల్లెలు చదువు చెప్పడం అనే పవిత్రమైన కార్యాన్ని నేను చేస్తున్నాను. మీరు నాపై వేస్తున్న ఆవు పేడ, రాళ్లు వంటివి నా సంకల్పాన్ని అడ్డుకేలేవు. పైగా నాకు మరింత స్ఫూర్తి కలిగిస్తాయి. మీరు నాపై పూలు చల్లుతున్నట్లే భావిస్తాను. దేవుడు మిమ్ములను ఆశీర్వదించాలని కోరుకొంటున్నాను”.

ఆమె ఎప్పుడు పాఠశాలకు రెండు చీరలను తీసుకు వెడుతూ ఉండెడిది. దారిలో చీరపై పేడ వంటివి వేస్తే, పాఠశాలలు వెళ్ళాక మార్చుకొంటూ ఉండెడిది. కానీ, ఒక రోజు పరిస్థితులు శృతిమించి, ఒక బలమైన వ్యక్తి ఆమెను దారిలో అడ్డుకొని మెహర్లు, మాంగ్ లకు చదువు చెప్పడం ఆపక పోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించాడు.

ఆమెను బలంగా కొట్టి పారిపోయాడు. అక్కడ గుమికూడిన జనం వించ చూసిన్నట్లు చూడడమే కానీ ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ వార్త పూణే నగరం అంతా దానవలంగా వ్యాపించింది. అయితే అప్పటి నుండి ఆమెపై దాడులు మాత్రం ఆగిపోయాయి. పూణే లోనే మూడు బాలికల పాఠశాలలను తెరిచారు.

భారత స్త్రీవాదానికి మాతృమూర్తిగా ఆమెను భావిస్తారు. కుల, లింగ వివక్షతలకు వ్యతిరేకంగా అలుపు ఎరుగని పోరాటాలు జరిపారు. ధృడ నిశ్చయంతో ఆమె బాలికల కోసం అనేకచోట్ల విద్యాలయాలు నెలకొల్పారు. చివరకు ఆమె కృషిని గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆమెను సత్కరించింది.

ఆమె ప్రారంభించిన పాఠశాలలు ఎంతగా ఆదరణ పొందాయి అంటే ఒక సమయంలో పుణెలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలుర సంఖ్యా కన్నా ఆమె పాఠశాలలోనే ఎక్కువ మంది చదువుతూ ఉండేవారు.

పూలె దంపతులకు పిల్లలు లేరు. ఒక బ్రాహ్మణా యువతీ అవాంఛనీయ గర్భం కారణంగా ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నం చేస్తుంటే, ఆమెను కాపాడి, ఆమె పుత్రుడు యశ్వంత్ ను ఈ దంపతులు దత్తత తీసుకున్నారు.

దేశంలో మొట్టమొదటి సారిగా మంగళుల సమ్మెను వీరు నిర్వహించారు. యువ వితంతువులకు క్షవరం చేయడానికి వారిని దుర్వినియోగం చేయడంపై తిరగబడ్డారు. అంటరానితనం దురాగతాన్ని ఎండగడుతూ అన్ని కులాలవారికి నీరిచ్చే తమ సొంత రిజర్వాయర్ ను కూడా వారు ఏర్పాటు చేశారు.

1890 లో జ్యోతిరావు ఫులే మరణించిన తరువాత, సావిత్రిబాయి తన పనిని కొనసాగించారు. ముఖ్యంగా, భర్త స్థాపించిన సత్య షోధక్ సమాజ్ కార్యకలాపాలపై దృష్టి సారించారు. పుణేలో ప్లేగు బ్యాధి ప్రబలిన సమయంలో ఆమె ప్రతి రోజు 2,000 మంది పిల్లలకు ఆహరం అందించేవారు.

ఆమె భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మాత్రమే కాకూండా మొదటి మహిళా కవి కూడా. ఆమె ‘కవ్య ఫులే’ (1934), ‘బవన్ కాశీ సుబోధ్ రత్నాకర్’ (1982) అనే రెండు కవితల పుస్తకాలు వ్రాసారు. నాటి సామాజిక సమస్యలను ప్రతిబిమించే ఈ గ్రంధాలు నేటికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.

1850 లలో, సావిత్రిబాయి, జ్యోతిరావ్ ఫులే దంపతులు రెండు విద్యా ట్రస్టులను స్థాపించారు. ఈ రెండు ట్రస్టులు సావిత్రిబాయి ఫులే, తరువాత ఫాతిమా షేక్ నేతృత్వంలో అనేక పాఠశాలలను నెలకొల్పాయి.

తన భర్తతో కలిసి, ఆమె వివిధ కులాల పిల్లలకు చదువు చెప్పడం కోసం మొత్తం 18 పాఠశాలలను ప్రారంభించారు. ఈ జంట గర్భిణీ అత్యాచార బాధితుల కోసం బల్హత్య ప్రతిబంధక్ గ్రిహా (“చైల్డ్-కిల్లింగ్ ప్రొహిబిషన్ హోమ్”) అనే సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది.

సావిత్రిబాయి, ఆమె దత్తపుత్రుడు యశ్వంత్, 1897 లో నలసోపారా చుట్టుపక్కల ప్రాంతంలో ప్లేగు బారిన పడిన వారికి చికిత్స చేయడానికి ఒక క్లినిక్ ప్రారంభించారు. ఈ క్లినిక్ పూణే శివార్లలో స్థాపించబడింది.

పాండురంగ్ బాబాజీ గైక్వాడ్ కుమారుడిని ఈ వ్యాధి బారి నుండి కాపాడే ప్రయత్నంలో సావిత్రిబాయి వీరోచిత మరణం పొందారు. ముండ్వా వెలుపల మహర్ సెటిల్మెంట్లో గేక్వాడ్ కుమారుడు ప్లేగు బారిన పడ్డాడని తెలుసుకున్న సావిత్రిబాయి ఫులే అక్కడకు వెళ్లి, అతనిని ఆసుపత్రికి తీసుకొచ్చారు.

ఈ ప్రక్రియలో, సావిత్రిబాయి ఫులే ప్లేగు బారిన పడి 1897 మార్చి 10న రాత్రి 9:00 గంటలకు మరణించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన ఆమె విధవ వివాహాలను ప్రోత్సహించారు. సావిత్రిభాయి స్త్రీవాదానికి ఒక కొత్త నిర్వచనం చెప్పారు. భారతీయ మహిళల వికాసం కోసం బలమైన వరవడి సృష్టించారు.