Sankata Hara Chaturthi: ఇది అత్యంత అరుదైన రోజు.. అడ్డంకులు, అప్పుల బాధలు తొలగాలంటే..?
Sankata Hara Chaturthi: సంకటహర చతుర్థి అనేది వినాయకుడికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. ఇది మంగళవారం వస్తే అంగారక సంకష్టి చతుర్థి అంటారు, ఇది అత్యంత విశేషమైనది. భక్తులు, ముఖ్యంగా మహిళలు, కుటుంబ శ్రేయస్సు కోసం ఉపవాసం ఉండి, వినాయకుడిని పూజిస్తారు. ఈ రోజున పూజ చేయడం వల్ల అడ్డంకులు తొలగి, కోరికలు నెరవేరుతాయి, జీవితంలో సానుకూలత వస్తుంది. జనవరి 6న అరుదైన అంగారక సంకష్టి వచ్చింది.

క్యాలెండర్ ప్రకారం సంకటహర చతుర్థి అనేది ప్రతి నెలలో వచ్చే వినాయకుడి పండుగ. దీనినే సంకష్టి చతుర్థి అని కూడా పిలుస్తారు. పౌర్ణమి తర్వాత 4వ రోజు ఈ సంకష్టహర చతుర్థి వస్తుంది. ఈ సంకటహర చతుర్థి (Sankata Hara Chaturthi) మంగళవారం రోజు వస్తే దానిని అంగారక సంకటహర చతుర్థి అంటారు. ఈ అంగారక సంకటహర చతుర్థిని ఏడాదిలో వచ్చే మిగిలిన సంకటహర చతుర్థి రోజుల్లో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున మహిళలు తమ పిల్లల దీర్ఘాయుష్షు, వారి కుటుంబాల ఆనందం, శ్రేయస్సు కోసం ఉపవాసం ఉంటారు. ఈ సంవత్సరం పవిత్రమైన సంకష్టి చతుర్థి ఉపవాసం మంగళవారం జనవరి 6న జరుపుకుంటున్నారు. ఈ రోజు అత్యంత అరుదైన రోజని పండితులు చెబుతున్నారు. ఈ రోజున చేయాల్సిన పూజా విధానం, ఉపవాసం ఫలితం ఎలాంటిదో పూర్తి వివరాల్లోకి వెళితే…
సంకటహర చతుర్థి రోజున భక్తులు, ముఖ్యంగా మహిళలు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు. రోజంతా ఉపవాసం ఉంటారు. సాయంత్రం చంద్రోదయం తర్వాత చంద్రుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమిస్తారు. ఈ రోజున వినాయకుడిని, చంద్రుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. పనిలో అడ్డంకులు, ఆర్థికపరమైన సమస్యలు, అప్పుల బాధలు తొలగుతాయని విశ్వాసం. జీవితంలో సానుకూలత ఏర్పడుతుందని నమ్ముతారు. వినాయకుడు అంటేనే విఘ్నాధిపతి. అడ్డంకులను తొలగించేవాడు.. తెలివితేటలకు, జ్ఞానానికి అధిపతి. ఆయన కాటాక్షం ఉంటే అన్నీ సత్ఫలితాలే కలుగుతాయని ప్రతీతి.
ఈ రోజు ఉదయం 11.37 గంటల నుంచి రేపు 7వ తేది బుధవారం ఉదయం 10.46 గంటల వరకు చవితి తిథి ఉంటుంది. చవితి తిథి.. చంద్రోదయం సమయం ఉంటుందో ఆ రోజే సంకట హర చతుర్థి జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో జనవరి 6వ తేదీ సంకట హర చతుర్థి వస్తుంది. మంగళవారం ఆశ్లేష నక్షత్రం కూడి వచ్చిన ఈ రోజును అంగారక సంకష్ట హర చతుర్థిగా పేర్కొంటారు. అలాగే ఈ రోజు కొంతసమయం భద్ర కాలం కూడా ఉంటుంది. పూజకు లేదా శుభ కార్యాలకు భద్ర కాలం సముచితం కాదు. కాబట్టి, భద్ర కాలంలో పూజ లేదా సంకల్పం మొదలైన వాటిని చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ రోజు ఉపవాసం ఉండే వారు శుభ సమయంలో పూజలు, ప్రార్థనలు చేస్తారు. చంద్రుడు ఉదయించిన తర్వాత రాత్రి చంద్రుడిని చూసి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమిస్తారు. దీంతో సంకటహర చతుర్థి ఉపవాసం పూర్తవుతుంది.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




