తూరుపు దిక్కున జరిగే మహాకుంభ్‌ అంబుబాచి మేళ, కరోనా కారణంగా ఈ ఏడాది రద్దు!

హరిద్వార్‌లో జరిగిన కుంభమేళా కారణంగా కరోనా కేసులు ఎంతగా పెరిగాయో మనం చూశాం! ఈ ఘటన తర్వాత ప్రభుత్వాలు సకల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.. చార్‌ధామ్‌ పర్యటనను రద్దు చేసింది కూడా ఇందుకే! ఇప్పుడు అంబుబాచి మేళాను కూడా రద్దు చేసింది అసోం ప్రభుత్వం..

తూరుపు దిక్కున జరిగే మహాకుంభ్‌ అంబుబాచి మేళ, కరోనా కారణంగా ఈ ఏడాది రద్దు!
Temple

హరిద్వార్‌లో జరిగిన కుంభమేళా కారణంగా కరోనా కేసులు ఎంతగా పెరిగాయో మనం చూశాం! ఈ ఘటన తర్వాత ప్రభుత్వాలు సకల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.. చార్‌ధామ్‌ పర్యటనను రద్దు చేసింది కూడా ఇందుకే! ఇప్పుడు అంబుబాచి మేళాను కూడా రద్దు చేసింది అసోం ప్రభుత్వం.. కరోనా మహమ్మారి లేకపోయి ఉంటే ఈ మేళ అద్భుతంగా జరిగేది. ఈసారి భక్తులకు అనుమతి లేకపోయినప్పటికీ, అంబుబాచి మేళా లేకపోయినప్పటికీ సందర్భం వచ్చింది కాబట్టి అంబుబాచి గురించి కాస్త తెలుసుకుందాం! మనకు మహాకుంభమేళా గురించి తెలుసు. దాదాపు అంతటి వైభవోపేతమైన అంబుబాచి మేళా గురించి చాలామందికి తెలియదు. ఈశాన్య భారతంలో జరిగే ఈ మహాకుంభ్‌కు భక్తులు పోటెత్తుతారు. సిద్ధులు తాంత్రిక పూజలు గావిస్తారు. సాధువులు భక్తిపూర్వక విన్యాసాలు చేస్తారు. ఇదంతా కరోనా లేని రోజుల్లో!

అష్టాదశ శక్తిపీఠాలలో అత్యంత శక్తివంతమైనది కామాఖ్యాదేవి ఆలయం! అసోంలోని బ్రహ్మపుత్ర నదీతీరంలో.. గౌహతికి దగ్గరలో ఉన్నదీ క్షేత్రం! ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే.. కామాఖ్యాదేవికి నెలలో మూడు రోజులు రుతుస్రావం జరుగుతుంది.. మృగశిర నక్షత్రం మూడో పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలోని మొదటి పాదం వరకు అమ్మవారి రుతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు.. అస్సామీయుల క్యాలెండర్‌ ప్రకారం అహార్‌ నెలలోని ఏడో రోజున ఈ మేళ ప్రారంభం అవుతుంది.. అన్నట్టు దేవి భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల ప్రస్తావన ఉందట! ఈ ప్రత్యేకమైన మూడు రోజుల్లో యోని శిలనుంచి ఎర్రని స్రావం వెలువడుతుంది.. శక్తిపీఠం ఎదురుగా ఉన్న సౌభాగ్య కుండంలోని జలమే ఈ ఎరుపురంగు నీరని చెబుతుంటారు.

Temple.2

Temple.2

కామాఖ్యాదేవికి రుతుస్రావం జరిగే మూడు రోజులూ ఆలయం మూసి ఉంచుతారు. నాలుగో రోజున పెద్దఎత్తున ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆలయ ద్వారాలను తెరుస్తారు. అంబుబాచి మేళకు ముందే భక్తులు అమ్మవారికి వస్త్రాలను సమర్పించుకుంటారు. ఆ వస్త్రాలను అమ్మవారి శిలపై ఉంచుతారు.. ఆ తర్వాత వాటిని పూజారులు పార్వతీకుండంలో ఉతికి ఆరబెడతారు. ఆ తర్వాత వేలం పద్దతిలో వాటిని మళ్లీ భక్తులకే విక్రయిస్తారు. అమ్మవారి వస్త్రాలను కోనేందుకు భక్తులు పోటీపడతారు.. అవి తమ దగ్గరుంటే రుతుస్రావ దోషాలు.. ఇతర ఏ దోషాలు అంటవన్నది భక్తులు బలమైన నమ్మకం.

నిజానికి అయిదు రోజులపాటు జరిగే అంబుబాచి మేళ కోసం భక్తులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తుంటారు.. ఇప్పుడు కూడా ఎదురుచూసే ఉంటారు.. కాకపోతే ప్రభుత్వం మేళాను రద్దు చేయడంతో ఇంటి పట్టునే ఉంటూ అమ్మవారిని వేడుకుంటున్నారు. అసలైతే ఎంతో గొప్పగా జరిగే ఈ మేళా కోసం దూరతీరాల నుంచి భక్తులు వస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో వేలాదిమంది పండాలు.. సిద్ధులు.. తాంత్రికులు అంబుబాచి మేళకు తరలివస్తారు.. అమ్మవారిపై తమకున్న భక్తిని చాటుకుంటారు. అఘోరాలు కూడా వస్తుంటారు.. తప్పెట్లు.. తాళాలు వాయించుకుంటూ సిద్ధులు చేసే విన్యాసాలు అద్భుతంగా ఉంటాయి.. జటలు కట్టిన బారెడు జట్టుతో ఉన్న సాధులు, సాధ్విలు పెట్టే అభయముద్రలు కూడా కనువిందుగా ఉంటాయి.. ఈ అయిదు రోజులూ వారి బస ఇక్కడే! సాధారణ రోజుల్లో కూడా సాధువులు, సంతులు, అఘోరాలు, తాంత్రికులు కామాఖ్యాదేవి ఆలయానికి వస్తుంటారు. మంత్ర, తంత్ర, ఐంద్రజాలాలకు కామాఖ్యాక్షేత్ర శక్తిపీఠం కేంద్రస్థానమట! వీరంతా తరలివచ్చేది ఇందుకే! ఇక్కడికి వచ్చే సాధువుల్లో చాలామంది ఆ తర్వాత మళ్లీ ఎక్కడా కనిపించరు. ఎక్కడినుంచి వస్తారో, ఎక్కడికి వెళతారో ఎవరికీ తెలియదు..

Temple.3

Temple.3

గువహటికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలాచల పర్వతాలపై ఈ కామాఖ్యదేవి ఆలయం ఉంది.. ఇక్కడ వెలిసిన కామాఖ్యాదేవిని త్రిపుర శక్తిదాయినిగా కొలుచుకుంటారు. కామరూపిణి అమ్మవారిగా పిలుచుకుంటారు. ఈ క్షేత్రంలో అమ్మవారు మూడు ప్రధాన రూపాలలో దర్శనమిస్తుంది. అసురలను అంతం చేయడానికి త్రిపురభైరవి రూపం ధరిస్తుంది. ఈ రూపాన్ని పరమశివుడు కూడా చూడలేడట! సింహవాహినిగా ప్రసన్నవదనంతో దర్శనమిస్తుంది.. ఇక ముక్కంటిపై అనురాగంతో త్రిపురసుందరిగా మారుతుంది. ఇవే కాదు. ఇంకా అనేక రూపాలలో దర్శనమిస్తుందీ తల్లి!

అంబుబాచి మేళ సందర్భంగా ప్రధాన ఆలయ ద్వారాలే కాదు. నీలాచల పర్వతంపై వెలిసిన అన్ని గుడి తలుపులు మూసుకుంటాయి. ఆ మూడు రోజులపాటు అక్కడ ప్రార్థనలు జరగవు. దేవి స్తోత్రాలు చదవరు. అమ్మవారికి సంబంధించిన ఏ ఇతర పూజాధికాలు జరగవు. స్థానిక ప్రజలు వివాహాది శుభకార్యాలను కూడా జరుపుకోరు. నాలుగో రోజున గుడి తలుపులు తెరుచుకుంటాయి. అమ్మవారి దివ్యదర్శనం కోసం భక్తులు బారులు తీరతారు. అప్పుడక్కడ తీర్థప్రసాదాలు ఉండవు. భక్తులకు ఇచ్చే ప్రసాదం కాసింత పవిత్ర జలం. ఓ ఎర్రని సిల్కు వస్ర్తం ముక్క. దీన్ని రక్తవస్త్ర అని. అంగవస్త్ర అని పిలుచుకుంటారు. ఈ వస్త్రం అందరికి లభించదు. దొరికిన వారు మహా అదృష్టవంతులన్నది భక్తుల భావన! ఎందుకంటే ఈ వస్త్రం ఉన్న ఇంట్లో ఎలాంటి చెడులు జరగవట! అంతా శుభమే జరుగుతుందట! ఆ ఇంటివారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయట!

Temple.4

Temple.4

తూరుపు దిక్కున జరిగే మహాకుంభ్‌గా ప్రసిద్ధిగాంచిన ఈ మేళా కోసం ప్రభుత్వాలు కూడా విస్తృత ఏర్పాట్లను చేసేవి…కోవిడ్‌ లేకపోయి ఉంటే ఈసారి కూడా గొప్పగానే జరిగేది. అసలు నీలాచల్‌ పర్వత ప్రాంతాలకు చేరుకోగానే ఓ రకమైన పాజిటివ్‌ ఎనర్జీ వస్తుందట! అందుకే కాలినడకన ఎంత దూరం ప్రయాణించినా భక్తులకు ఎలాంటి అలసట కలగదు.. యోనికి పూజలు జరిపే ఇలాంటి ఆలయం మరెక్కడా లేదు! దక్షుడి యజ్ఞవాటికలోనే సతీదేవి ప్రాణాలు అర్పించుకోవడం, సతీ వియోగాన్ని తట్టుకోలేక పరమశివుడు వియోగిగా మారడం, సతీదేవి దేహంలోని ఒక్కో భాగం ఒక్కో పుణ్యక్షేత్రంగా వెలిసిన విషయాలు తెలిసినవే! అవే అష్టాదశ పీఠాలుగా మారాయి. అమ్మవారి యోని భాగం నీలాచలంపై పడింది. సృష్టికి మూల కారణమైన స్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తిపీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అన్ని శక్తిపీఠాలకు ఆధారస్థానంగా మారింది.

ఈ శక్తిపీఠాన్ని మహాయోగ స్థలమని పిలుస్తారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అమ్మవారు విగ్రహరూపంలో దర్శనం ఇవ్వరు. అక్కడి రాతి యోనిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని అంటారు. ముక్కోటి దేవతలు పర్వతరూపంలో ఉంటూ అమ్మవారిని సేవించుకుంటూ ఉంటారు. ఎంతో పురాతనమైన ఈ ఆలయానికి స్థలపురణాలు ఎన్నో ఉన్నాయి. అమ్మవారు ఎక్కడుంటే అయ్యవారు కూడా అక్కడే ఉండాలి కాబట్టి ఇక్కడ శివుడు ఉమానంద భైరవుడిగా కొలువుతీరాడు.. కామాఖ్యాదేవి అమ్మవారి ఆలయం ముందు ఓ పుష్కరిణి ఉంది.. దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారని చెబుతారు. ఇందులోని నీరు ఎరుపురంగులో ఉంటుంది. రెండు నీలాచల పర్వతాల మధ్యన ఆదిమతెగలకు చెందిన శాక్తీయులు ఉంటారు.. వారే ఈ దేవిని ఎక్కువగా ఆరాధిస్తారు.. ఇప్పటికీ వీరు మాతృస్వామ్య వ్యవస్థనే పాటిస్తారు.. అంబుబాచి మేళాలో వీరు మేకపోతులనే బలి ఇస్తారు తప్పితే ఆడ జంతువులను బలి ఇవ్వరు..