AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Basar: అక్షరాభ్యాసానికి పోటెత్తిన భక్తులు.. అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో పడిగాపులు.. 

దేవీ శరన్నవరాత్రుల్లో మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతిగా త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తన అంశలోని నిజ స్వరూపాన్ని సాక్షాత్కరింప చేయడమనేది ఈ శరన్న వరాత్రుల్లోని అంతరార్థం. నవరాత్రుల్లో..

Basar: అక్షరాభ్యాసానికి పోటెత్తిన భక్తులు.. అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో పడిగాపులు.. 
Basara Saraswathi Temple
Ganesh Mudavath
|

Updated on: Oct 02, 2022 | 7:57 AM

Share

దేవీ శరన్నవరాత్రుల్లో మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతిగా త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తన అంశలోని నిజ స్వరూపాన్ని సాక్షాత్కరింప చేయడమనేది ఈ శరన్న వరాత్రుల్లోని అంతరార్థం. నవరాత్రుల్లో నవ దుర్గ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తోంది అమ్మల గన్న అమ్మ పెద్దమ్మ దుర్గమ్మ. మొదటిరోజు శైల పుత్రిగా, రెండో రోజు బ్రహ్మచారిణి, మూడో రోజు చంద్రగంట రూపంలో, నాలుగో రోజు కూష్మాండ, ఐదో రోజు స్కందమాత, ఆరో రోజు కాత్యాయని గా, ఏడో రోజు మూల నక్షత్రం వేళ నిజరూపంలో తల్లి దర్శనమిస్తోంది. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి కొలువైన బాసరలో మూల నక్షత్ర వేడుకలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో కృపా కటాక్షాలు పొందాలని భక్తులు వేలాదిగా అమ్మవారి దర్శనానికి తరలి‌వచ్చారు. మూలా నక్షత్ర శుభ ముహూర్తాన తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించేందుకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ జిల్లాల‌ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాలుగు క్యూ‌లైన్లను ఆలయ నిర్వహకులు ఏర్పాటు చేశారు. ఉదయం 3 గంటల నుంచే చిన్నారులకు నాలుగు మండపాల్లో అక్షర శ్రీకర పూజలు ప్రారంభించారు.

బాసర సరస్వతీ ఆలయంలో దసరా ఉత్సవాలు విభిన్నంగా కొనసాగుతాయి. మిగతా శక్తి స్వరూపిణి ఆలయాల్లో 9 రోజులు 9 అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. బాసర ఆలయంలో మాత్రం అమ్మవారి మూల విగ్రహానికి మొదటి రోజు అభిషేకం నిర్వహించిన అనంతరం నవమి వరకు ఎనిమిది రోజులపాటు అభిషేకం నిర్వహించరు. సాధారణ రోజుల్లో నిత్యం అమ్మవారికి అభిషేకం జరుపుతారు. దసరా ఉత్సవాల్లో మాత్రం అభిషేకం జరగదు. ఉత్సవ విగ్రహానికి తొమ్మిది రోజుల పాటు శక్తి స్వరూపిణి అలంకరణలు చేస్తారు. అమ్మవారి దర్శనానికి మగవారు అర్ధ శరీరంపై ఎలాంటి దుస్తులు లేకుండా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. నవమి రోజు నవ నిర్వహించి పూర్ణాహుతి చేస్తారు. దసరా రోజూ అమ్మ వారికి మహాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం నెమలి పల్లకిలో అమ్మవారిని ఆలయం, బాసర గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. శమీ పూజ, సాయంకాల పూజలు అనంతరం ఉత్సవాలు ముగుస్తాయి.

Basara Temple

Basara Temple

నవరాత్రుల్లో మధుకరం అనే అమ్మవారి దీక్ష చేపట్టేందుకు అధిక సంఖ్యలో భక్తులు బాసర ఆలయానికి చేరుకుంటారు. తొమ్మిది రోజులపాటు ఆలయంలోనే ఉండి బాసర గ్రామంలో భిక్షాటన చేసి అమ్మవారిని దర్శిస్తారు. ఆ తల్లి అనుగ్రహ వీక్షణలుంటే చాలు ఏ కష్టాన్నైనా దూది పింజంలా ఎగరగొట్టవచ్చని భక్తుల‌ అపార నమ్మకం. ఈ తల్లి జన్మనక్షత్రం మూలా. కనుక శరన్నవరాత్రిలో సప్తమి మూలా నక్షత్రం రోజును శారదా దేవిగా అలంకరించి ఆది పరాశక్తిని సరస్వతీ దేవిగా కొలుస్తారు. శారదాదేవి బుద్ధిని విద్యను, జ్ఞానమును, యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని, వివేచనాశక్తిని, జ్ఞాపకశక్తిని, కల్పనా నైపుణ్యాన్ని ధారణా శక్తిని ప్రసాదిస్తుంది. అమ్మవారి అనుగ్రహం వల్లనే మనలో సంస్కారము, సత్వగుణము, మాటతీరు సద్బుద్ధి, విచక్షణాజ్ఞానం కలుగుతాయి.

ఇవి కూడా చదవండి
Basara Temple 1

Basara Temple 1

మరోవైపు.. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కాలరాత్రి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మూల నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో అక్షర శ్రీకర పూజకు రెండు గంటల సమయం పడుతోంది. అమ్మ వారికి అష్టోత్తర నామార్చన పూజతో పాటు అమ్మవారికి నైవేద్యంగా కిచిడి సమర్పించారు. అమ్మవార్లకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉదయం 8 గంటలకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మధ్య రాత్రి నుంచి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తుల దృష్ట్యా నాలుగు మండపాలలో చిన్నారులకు అక్షరాభ్యాస పూజలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. 200 మంది పోలీసులు, 8 మంది ఎస్ఐలు, ముగ్గురు సీఐలు, ఇద్దరూ అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

– నరేష్ స్వేన, ఆదిలాబాద్, టీవీ9 తెలుగు

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..