21వ రోజుకి చేరిన అమరావతి రైతుల పాదయాత్ర.. ద్వారకాతిరుమల నుంచి నేడు యాత్ర ప్రారంభం..
Amaravati Farmers Maha Padayatra: అమరావతి రైతుల మహా పాదయాత్ర 21వ రోజుకి చేరుకుంది. నిన్న పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన రైతులు, ఇవాళ తిరిగి ప్రారంభించనున్నారు. ఈరోజు ఎక్కడ్నుంచి ...ఎక్కడి వరకు యాత్ర సాగనుందో ఆ డిటైల్స్ చూద్దాం.
అమరావతి టు అరసవల్లి పేరుతో రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర 20వ రోజు ఏలూరు జిల్లాలోనే కొనసాగింది. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చేరుకోగానే చిన్న వెంకన్నస్వామిని దర్శించుకున్నారు రైతులు. ముందుగా పాదుకా మండపం దగ్గర జైఅమరావతి నినాదాలతో హోరెత్తించారు. ఆ తర్వాత మెట్ల మార్గంలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకున్నారు. అయితే, ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ పరిసరాలన్నీ జై అమరావతి నినాదాలతో మార్మోగిపోయింది.
పాదయాత్ర ఎలాంటి ఆటంకాల్లేకుండా ముందుకు సాగాలని, ఆలోపే సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన తీర్పు రావాలని ఆ దేవదేవున్ని ప్రార్ధించినట్లు అమరావతి రైతులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం వికేంద్రీకరణ విధానం తీసుకుందన్నారు. ఐదు కోట్ల ప్రజలను యోగక్షేమాలను పక్కనబెట్టి, ఆ 29 గ్రామాలనే అభివృద్ధి చేయాలనడం సరికాదని ఆయన అన్నారు.
21వ రోజు అంటే ఇవాళ ద్వారకాతిరుమల నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభం కానుంది. ద్వారకా తిరుమల నుంచి రాళ్లకుంట, అయ్యవరం, కొత్తగూడెం మీదుగా దూబచర్ల వరకు సాగనుంది. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది.