Srivari Brahmotsavam: గరుడ వాహనంపై దర్శనమిచ్చిన మలయప్పస్వామి.. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు..
మాఢ వీధుల్లో భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ ఏనుగులు, అశ్వాలతో గరుడవాహన సేవ కనులపండువగా సాగింది. గరుడసేవను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శనివారం రాత్రి కలియుగ వైకుంఠ నాథుడు తనకెంతో ఇష్టమైన గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాఢ వీధుల్లో భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ ఏనుగులు, అశ్వాలతో గరుడవాహన సేవ కనులపండువగా సాగింది. గరుడసేవను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమల భక్తజనసంద్రంగా మారింది. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్‌స్వామి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.లలిత్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, తదితరులు గరుడ వాహన సేవలో పాల్గొన్నారు.
తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు ప్రత్యేక స్థానం ఉంది. గరుడ వాహనంపై విహరించిన శ్రీమలయప్పస్వామికి వెల కట్టలేనన్ని ఆభరణాలతో అలంకరిస్తారు.
గరుడ వాహన సేవకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.