Kanpur Accident: కాన్పూర్ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం..

కాన్పూర్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో, సమాజ్‌వాదీ పార్టీ కూడా ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది.

Kanpur Accident: కాన్పూర్ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం..
PM MODI
Follow us

|

Updated on: Oct 01, 2022 | 11:42 PM

కాన్పూర్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీంతో పాటు బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అదే సమయంలో సమాజ్‌వాదీ పార్టీ కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు, గాయపడిన వారికి ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 25 మంది భక్తులు మరణించగా, 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. పోలీసులు-అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని కాన్పూర్‌లోని హలత్ ఆసుపత్రిలో చేర్పించగా, స్వల్పంగా గాయపడిన వారికి సమీపంలోని పీహెచ్‌సీలో చికిత్స అందిస్తున్నారు.

కాన్పూర్‌లో ట్రాక్టర్-ట్రాలీ బోల్తా పడిన ప్రమాదంతో కలత చెందినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన వారందరికీ నా సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలా సాయం చేస్తోంది. పీఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మరణించిన ప్రతి కుటుంబానికి రెండు లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు అందజేయనున్నట్లు ప్రకటించారు.

సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన నిర్వహించాలి- సీఎం యోగి..

అదే సమయంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ఆయన ట్వీట్ చేస్తూ, “కాన్పూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా హృదయ విదారకంగా ఉంది. జిల్లా మేజిస్ట్రేట్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు సరైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు.

విచారం వ్యక్తం చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్..

మరోవైపు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేస్తూ, “ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం హృదయాన్ని కదిలించింది. ఇందులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. స్థానిక పరిపాలన అన్ని విధాలుగా సహాయం చేస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు.

ఈ ప్రమాదంలో 25 మంది మరణించారు..

ఘతంపూర్ తహసీల్ ప్రాంతంలోని సాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే ఉన్న చెరువులో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి 25 మంది మృతి చెందారు. అదే సమయంలో 20 మందికి పైగా గాయపడ్డారు. ఘటన జరిగినప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, మరణించిన వారిలో 11 మంది చిన్నారులు ఉన్నారు.

సమాచారం ప్రకారం, కోర్తా గ్రామానికి చెందిన ఒక కుటుంబం ఫతేపూర్ జిల్లాలోని చంద్రికా దేవి ఆలయానికి బంధువులతో కలిసి పుట్టు వెంట్రుకల వేడుకకు వెళ్లింది. ఆ కార్యక్రమం చేయించుకుని తిరిగి వస్తున్న ట్రాక్టర్ ట్రాలీ రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడిపోయింది.