Gujarat Elections: ప్రధాని మోదీ ఇలాకాలో పట్టు కోసం అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నాలు..

ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ముచ్చటగా మూడో రాష్ట్రంగా గుజరాత్ లో పాగా వేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది చివరికి గుజరాత్ శాసనసభ పదవీకాలం ముగుస్తుంది. దీంతో తప్పనిసరిగా మరో..

Gujarat Elections: ప్రధాని మోదీ ఇలాకాలో పట్టు కోసం అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నాలు..
Arvind Kejriwal
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 01, 2022 | 10:35 PM

ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ముచ్చటగా మూడో రాష్ట్రంగా గుజరాత్ లో పాగా వేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది చివరికి గుజరాత్ శాసనసభ పదవీకాలం ముగుస్తుంది. దీంతో తప్పనిసరిగా మరో రెండు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎలాగైనా పాగా వేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ తనదైన వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ప్రతి నెలలో ఖచ్చితంగా వీలైనన్ని ఎక్కువసార్లు గుజరాత్ లో పర్యటించడమే కాకుండా.. గ్రామీణ ప్రజలను ఆకట్టుకోవడం కోసం అనేక హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే గృహ విద్యుత్తు వినియోగదారులకు 300 యూనిట్ల వరకు ఎటువంటి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మరిన్ని హామీలను గుజరాత్ ప్రజలకు ఇచ్చారు. ఈనెల 29, 30వ తేదీల్లో గుజరాత్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించి. కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ కూడా అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ ఎన్నికలు వీరిద్దరికి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారతాయి. ఇక్కడి గెలుపు, ఓటములు జాతీయ స్థాయిలోనూ ప్రభావం చూపించే అవకాశం ఉంది.

వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు కూడా ఈఏడాది చివర్లో జరగనున్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాత్రం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించినప్పటికి.. అక్కడి ఎన్నికల కంటే గుజరాత్ ఎన్నికలనే సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ లో బీజేపీని బలహీనపర్చి తన బలాన్ని పెంచుకోవడం ద్వారా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని, తద్వారా జాతీయ రాజకీయ అరంగ్రేటం చేయాలనే ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే గుజరాత్ ను ప్రధానంగా కేజ్రీవాల్ టార్గెట్ గా పెట్టుకున్నారు. కాంగ్రెస్ బలహీనపడిన నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీ చేసి.. గెలవకపోయినా ప్రతిపక్ష స్థానానికి ఎదగాలని కేజ్రీవాల్ ప్లాన్ గా తెలుస్తోంది. దీంతో ఇటీవల కాలంలో అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో తరచూ పర్యటిస్తున్నారు. తాజాగా అక్టోబర్ ఒకటో తేదీ శనివారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌తో కలిసి గుజరాత్ లో పర్యటించారు ఢిల్లీ సీఏం అరవింద్ కేజ్రీవాల్. ఈ సందర్భంగా కచ్‌లోని గాంధీధామ్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం కురిపించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి హామీతో పాటు.. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేస్తామని, కచ్ జిల్లాలోని మారుమూల చోట్లకు కూడా నర్మదా జలాలను రప్పిస్తామని హామీ ఇచ్చారు.

ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదవుతున్న పేద కుటుంబాల విద్యార్థులు వైద్య, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారని, ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. గుజారాత్‌లో మాత్రం బీజేపీ ప్రభుత్వం కచ్‌లో ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తోందని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే గుజరాత్‌లోని ప్రతి గ్రామంలో పాఠశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పిల్లల భవిష్యత్ కోసం ఒక్కసారి ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇవ్వండి అంటూ గుజరాత్ ప్రజలను కోరారు అరవింద్ కేజ్రీవాల్.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..