Diwali: ఒంగోలులో దీపావళి వేడుకలు.. వైభవంగా నరకాసుర వధ కార్యక్రమం.. 120 ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయం
నరకాసురుని బొమ్మ చేయడం... దానిని దహనం చేయడం మనం ప్రతి చోటా చూసే నరకాసుర వధ... కానీ ఒంగోలులోని యువజన మిత్రమండలి వారు నిర్వహించే కార్యక్రమానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.
పండుగ వచ్చిందంటే చాలు ఒంగోలు ప్రజలు ప్రత్యేకతను చాటుకుంటారు.. దసరా సంబరాల్లో కళారాలు.. దీపాళికి సత్యభామ.. నరకాసుర వధ.. వంటి సాంప్రదాయ కళలను, కళాకారులను ప్రోత్సహిస్తారు. అందులో భాగంగా దీపావళి రోజున సత్యభామ – నరకాసుర వధ వీధి పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టు ప్రదర్శిస్తారు.. 1902 వ సంవత్సరం నుంచి ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ లో ఉన్న యువజన మిత్ర మండలి నిర్వహించే నరకాసుర వధ కార్యక్రమాన్ని మరెక్కడా చూడలేము… గత 120 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న ఈ సత్యభామ – నరకాసుర యుద్ధం ఒంగోలు దీపావళి సంబరాల్లో ప్రత్యేకంగా నిలుస్తుంది.
నరకాసురుని బొమ్మ చేయడం… దానిని దహనం చేయడం మనం ప్రతి చోటా చూసే నరకాసుర వధ… కానీ ఒంగోలులోని యువజన మిత్రమండలి వారు నిర్వహించే కార్యక్రమానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అది ఈ కార్యక్రమాన్ని గత 120 సంవత్సరాలుగా నిర్వహించడం.. ఒంగోలు యువజన మిత్రమండలి వారి నరకాసుర వధ కార్యక్రమ ప్రత్యేకత ఏమిటంటే… దీపాళి ముందు రోజు అర్ధరాత్రి ప్రత్యేకంగా అలంకరించిన రెండు ప్రత్యక వాహనాల్లో సత్యభామ సమేత శ్రీకృష్ణుడు ఆయన పరివారం ఒక వాహనంలో.. నరకాసురుడు ఆయన అనుచరులు మరొక వాహనంలో నగరంలో పాటలు..పద్యాలతో తమ విన్యాసాలను ప్రదర్శిస్తూ నగరంలో పర్యటిస్తారు. తెల్లవారుజాము సమయానికి నగరంలోని గాంధీ రోడ్డు సెంటర్ కు రెండు వాహనాలు చేరుకుంటాయి. అక్కడ నరకాసుర వధ కార్యక్రమాన్ని సంప్రదాయ బద్దంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సత్యభామ, శ్రీకృష్ణుడు, నరకాసురుడు ఆలపించే పద్యాలు, పాటలు ఎంతో ఆకట్టుకుంటాయి. వీరు ఒకరిపై ఒకరు బాణాలు సంధించడం.. వాటికి అనుగుణంగా టపాసులు పేల్చడం ప్రత్యేక ఆకర్షణ.
మన సంప్రదాయాలను కాపాడటంతో పాటు కళాకారులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ఉద్దేశ్యమని నిర్వాహకులు ఇందుర్తి కేశవరావు అన్నారు. ఎప్పటినుంచో వస్తున్న ఆచారాన్ని తాము కొనసాగిస్తున్నామని, మన పండగలు…మన సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే కళాకారులు మాట్లాడుతూ, తాము ఈ నరకాసుర వధ కార్యక్రమంలో పాల్గొనటం చాలా ఆనందంగా ఉందని, తాము గత 10 పది సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నామని కళల ద్వారా మన సంప్రదాయాలను కొనసాగించేందుకు అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు.
Reporter: Fairoz
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..