Jangaon: వల్మిడిలో సీతారామచంద్రస్వామి ఆలయం పునఃప్రారంభం.. విగ్రహ ప్రతిష్ట చేసిన చినజీయర్ స్వామి
పాలకుర్తి నియోజకవర్గం వల్మిడిలో నిర్మించిన రామాలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో త్రిదండి చినజీయర్ స్వామి పాల్గొన్నారు. ఆలయాలు నిర్మించడం పెద్ద విషయమేమి కాదని, కాని ప్రాచీన ఆలయాల జీర్ణోద్ధరణ చేయడం చాలా గొప్ప కార్యమని చినజీయర్ స్వామి అన్నారు. ఆలయ నిర్మాణంలో విశేష కృషి చేసిన మంత్రి దయాకర్ రావును జీయర్ స్వామి ఆశీర్వదించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని వల్మీడి గ్రామంలోని వల్మిడి గుట్టపై ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు నాలుగు రోజులుగా శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఆలయ పునరుద్ధరణ కోసం దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
మహాకవి పోతనామాత్యుడి జన్మస్థలం, పాలకుర్తి సోమనాథుడి స్వస్థలం. రామాయణం రచించిన వాల్మీకి మహర్షికి జన్మనిచ్చిన పాలకుర్తి గడ్డ.. ఇప్పుడు మరో గొప్ప కార్యానికి వేదికగా మారింది. వాల్మీకి మహర్షి రామాయణం రచించిన గుట్టపై అబ్బురపరిచే రీతిలో శ్రీరాముడి ఆలయం రూపుదిద్దుకుంది. భద్రాద్రిని మించి నిర్మించిన ఈ గుడిలో త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా శ్రీసీతారామ లక్ష్మణ సమేత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. ఆదర్శపురుషుడు అనగానే గుర్తుకు వచ్చేది శ్రీరాముడు. బహుశా ఆ రాముడికి ఉన్నన్ని ఆలయాలు మరే దేవుడికి ఉండేవేమో. రాముడి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది అయోధ్య, భద్రాచలం. అంతే చరిత్ర కలిగిన ఊరు వల్మిడి. ఒకప్పటి వాల్మీపుపురమే నేడి వల్మిడి. రాముడి నడయాడిని నేల, రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి జన్మస్థలం అంటే నమ్మకం కలగకపోవచ్చు. కానీ, పురాణాతిహాసాలు, తరతరాలుగా స్థానికులు చెప్పుకునే చరిత్రకు ఈ ప్రాంతం సజీవసాక్ష్యంగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంకల్పబలంతో వల్మీడి నేడు పుణ్యక్షేత్రంగా మారిపోయింది. వాల్మీకి నడయాడిన నేల ఇప్పుడు మహాఘట్టానికి ముస్తాబైంది. వల్మిడి రాములవారి గుట్టపై పునర్‌నిర్మించిన శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. సోమవారం ఉదయం త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది.
పాలకుర్తి మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వల్మిడి గ్రామం. దీనికి రెండు వైపులా రెండు గుట్టలున్నాయి. ఒకటి మునులగుట్టు, మరొకటి రాములగుట్ట. మునుల గుట్టపై మునులు తప్పుచేసేవారని, రాముల గుట్టపై సీతారామ లక్ష్మణులు నివసించారని ఇక్కడి వారు చెప్పుకుంటారు. నిర్మానుష్యంగా ఉండే కొండపై 163 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. అంతే కాదు పాలకుర్తి పరిసర ప్రాంతాల్లో దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక కారిడర్ అభివృద్ధి చేస్తున్నారు.
వల్మిడి ఆలయ పునర్‌నిర్మాణంలో పూర్తిగా బ్ల్యాక్ గ్రానైట్ ఉపయోగించారు. యాదాద్రి దేవాలయ పునఃనిర్మాణంలో పాల్గొన్న వారే ఈ ఆలయంలో భాగస్వాములయ్యారు. ఆలయ విగ్రహ పునః ప్రతిష్ఠాపన సందర్భంగా నాలుగు రోజుల పాటు ఉత్సవాలు, వైదిక కర్మలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 4న, సోమవారం చినజీయర్ స్వామి చేతుల మీదుగా యంత్రప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన, విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు జరిగాయి. మరో వైపు సర్వాంగ సుందరంగా ముస్తాబైన వల్మిడి ఆలయానికి తరలివచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..