Telangana: తెలంగాణ ప్రజలకు న్యూ ఇయర్ కానుక ఇదే.. ప్రభుత్వం నుంచి అదిరిపోయే న్యూస్
తెలంగాణ రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. న్యూ ఇయర్ కానుకగా ప్రజలకు శుభవార్త అందించారు. త్వరలోనే హైదరాబాద్‌లో 370 కొత్త బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు. నగరంలోని శివారు ప్రాంతాలతో పాటు ఐటీ కారిడార్‌కు ఇవి తిరగనున్నాయి.

TGSRTC: నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలోని ప్రజలకు ఆర్టీసీ శుభవార్త అందించింది. కొత్త బస్సులపై కీలక అప్డేట్ ఇచ్చింది. త్వరలోనే 370 కొత్త బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లో కనెక్టివిటీని పెంచాలనే ఉద్దేశంతో ఈ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు. శివారు ప్రాంతాల ప్రజలు నగరంలోకి చేరుకోవాలంటే బస్సుల సంఖ్య తక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల నుంచి సరైన బస్సు సౌకర్యం కూడా అందుబాటులో లేదు. ఈ కొత్త బస్సులను నగరం నలుమూలల శివారు ప్రాంతాలకు తిప్పనున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఈ కొత్త బస్సుల్లో కొన్నింటిని ఐటీ కారిడార్‌కు కూడా తిప్పనున్నారు. శివారు ప్రాంతాలు, ఐటీ కారిడార్లతో కనెక్ట్ చేసేలా 370 కోట్ల రూట్లను అధికారులు గుర్తించారు. ఈ మార్గాల్లో కొత్త బస్సులను తిప్పనుట్లు తెలుస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఖైరతాబాద్‌లో గురువారం జరిగిన ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త బస్సులపై ప్రకటన చేశారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రజా రవాణాను మరింత మెరుగుపరుస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలని, అతివేగం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటివి చేసి ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు. రాంగ్ రూట్‌లో ప్రయాణం చేయవద్దని, అలా చేస్తే ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లెసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించేందుకు స్కూళ్లల్లో ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం కోటి 80 లక్షల వాహనాలు ఉన్నాయని, కేవలం వెయ్యి మంది అధికారులు నియంత్రించడం సాధ్యం కాదన్నారు. ప్రజలు స్వచ్చంధంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
