టీజీఎస్ఆర్టీసీ
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వేర్పడిన తర్వాత.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఈ సంస్థ రవాణా సౌకర్యాన్ని అందిస్తోంది. టీఎస్ఆర్టీసీ పరిధిలో మూడు జోన్లు, 97 డిపోలు ఉన్నాయి. అలాగే రోజుకు సుమారు 9.2 మిలియన్ల ప్రయాణీకులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. ఇదిలా ఉండగా.. 2023, జూలై 31న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వంలో వీలనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రతిపాదన బిల్లుకు ఆగస్టు 6న శాససభలో ఆమోదం లభించింది. అనంతరం వివరణలు, స్పందనలు.. ఇలా పలు కీలక అంశాలు జరిగిన తర్వాత అదే ఏడాది సెప్టెంబర్ 14న ఆర్టీసీ సిబ్బంది అఫీషియల్‌గా ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. టీఎస్ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా జీరో టికెట్ సర్వీస్‌ను సైతం అమలులోకి తెచ్చింది. ఈ టికెట్ సౌకర్యంతో పల్లెవెలుగు, సిటీ సర్వీసులు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మహిళలు తెలంగాణ బోర్డర్ వరకు ఉచిత ప్రయాణాన్ని చేయవచ్చు.
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలోకి వీలనం చేయాలన్న డిమాండ్‌తో 2019లో ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉధృతం చేశారు. ఇక ఆ సమయంలో కార్మికులు విన్నవించిన కోరిక మేరకు.. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఆర్‌అండ్‌బీ, రవాణాశాఖ కార్యదర్శులు, జీఏడీ, లేబర్‌తోపాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ తదితరలు సభ్యులుగా ఓ కమిటీ ఏర్పాటైంది. సత్వరమే ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందించింది.
‘ఆర్టీసీ-వీలనం’ ఆర్థికపరమైన బిల్లు కావడంతో అందుకు అనుగుణంగా శాసనసభలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై నుంచి అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఆగష్టు 2వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు బిల్లును రాజ్ భవన్‌కు పంపించింది. అయితే, బిల్లు పరిశీలనకు కాస్త సమయం కావాలని, దీనిపై న్యాయపరమైన సలహా తీసుకోవాలని గవర్నర్ కార్యాలయం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఐదు అంశాలపై వివరణ కోరింది. ఇక గవర్నర్ అనుమతి ఆలస్యం కావడంతో.. ఆగస్టు 5న ఆర్టీసీ ఉద్యోగులు డిపోల ముందు రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపట్టి, మధ్యాహ్నం 12 గంటల వరకు బస్సుల బంద్ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు ఛలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించారు.
ఇదిలా ఉండగా.. గవర్నర్ వివరణ కోరిన ఐదు అంశాలపై ఆగష్టు 5వ తేదీ సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం తగిన విధంగా స్పందించింది. ఆగష్టు 6 మధ్యాహ్నం ఆర్టీసీ ఉన్నతాధికారులు గవర్నర్‌ను కలిసి బిల్లులోని అంశాలపై స్పష్టత ఇవ్వగా, బిల్లుపై సమగ్ర నివేదిక తీసుకున్న అనంతరం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే.. అప్పటి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లుతో 43,055 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం ఆర్టీసీ కార్పొరేషన్ నిబంధనల ప్రకారమే కొనసాగుతారని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో విలీన బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత, తుది ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించారు. బిల్లును పరిశీలించిన గవర్నర్, ప్రభుత్వానికి 10 సిఫార్సులు చేసింది. వాటికి కూడా ప్రభుత్వం వివరణలు ఇచ్చింది. ఆ వివరణలతో సంతృప్తి చెందిన గవర్నర్ 2023, సెప్టెంబర్ 14న తుది ఆమోదం తెలిపారు. దాంతో ఆర్టీసీ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.