AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవిముక్తేశ్వరానందపై లైంగిక వేధింపుల కేసు.. పోక్సో కోర్టు ఆదేశాలతో FIR నమోదు!

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా‌నాథ్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న శంకరాచార్య అవిముక్తేశ్వరానందకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. అవిముక్తేశ్వరానందపై FIR నమోదు చేయాలని ప్రయాగ్‌రాజ్‌ పోక్సో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని అవిముక్తేశ్వరానంద అంటున్నారు.

అవిముక్తేశ్వరానందపై లైంగిక వేధింపుల కేసు.. పోక్సో కోర్టు ఆదేశాలతో FIR నమోదు!
Shankaracharya Avimukteshwaranand Saraswati
Balaraju Goud
|

Updated on: Feb 21, 2026 | 8:58 PM

Share

ఉత్తర ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ వర్సెస్‌ జ్యోతిష్యపీఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ప్రయాగ్‌రాజ్‌లో అవిముక్తేశ్వరానందపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. పోక్సో కోర్టు ఆదేశాల మేరకు FIR నమోదు చేశారు. శిష్యులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అవిముక్తేశ్వరానందపై ఆరోపణలు వచ్చాయి. అశుతోష్‌ బ్రహ్మచారి ఇచ్చిన ఫిర్యాదుతో FIR నమోదు చేశారు. అవిముక్తేశ్వరానంద శిష్యుడు ముకుందానంద గిరిపై కూడా లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.

ఆరోపణల్లో నిజం లేదన్న అవిముక్తేశ్వరానంద

ప్రయాగ్‌రాజ్‌ పోక్సో కోర్టు ఆదేశాలతో అవిముక్తేశ్వరానంద కష్టాలు మరింత పెరిగాయి. తన ఆశ్రమంలో మైనర్లపై అవిముక్తేశ్వరానంద లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణలను అవిముక్తేశ్వరానంద తీవ్రంగా ఖండించారు. తనపై కేసు పెట్టిన వ్యక్తికి నేరచరిత్ర ఉందన్నారు. న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని అవిముక్తేశ్వరానంద అన్నారు. ‘‘అశుతోష్‌ అనే వ్యక్తి హిస్టరీ షీటర్‌. యూపీ లోని షామ్లీ జిల్లాలో అతడిపై రౌడీషీట్‌ ఉంది. ఎంతోమందిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. తప్పుడు కేసులు పెట్టడం.. డబ్బులు వసూలు చేయడమే అతడి వృత్తి. ఇలాంటి వ్యక్తులను రామభద్రాచార్య తన శిష్యుడిగా ప్రకటించారు. శంకరాచార్యపై తప్పుడు ఆరోపణలు చేయించారు. తనను తాను జగద్గురు అని చెప్పుకున్న వ్యక్తి శిష్యుడితో కేసు వేయించారు. దీని అర్ధం ఏంటంటే సనాతన ధర్మానికి ఇతర మతాల నుంచి కాదు.. హిందూ మతం లోని కొంతమంది నుంచే ప్రమాదం పొంచి ఉంది’’ అవిముక్తేశ్వరానంద పేర్కొన్నారు.

నేరాలపై సాక్ష్యాలు ఉన్నాయిస అశుతోష్

మరోవైపు అవిముక్తేశ్వరానంద నేరాలపై సాక్ష్యాలను తాను కోర్టుకు ఇచ్చినట్టు చెప్పారు అశుతోష్‌. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తారని అన్నారు.‘‘చిన్నారులపై అవిముక్తేశ్వరానంద అకృత్యాలు చేశాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆయన శిష్యుడు ముకుందానందకు ఈ నేరాల్లో భాగస్వామ్యం ఉంది. చిన్నారులు గురువు వేధింపులకు బలయ్యారు. FIR నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. నేను ఇచ్చిన సీడీలు , పెన్‌డ్రైవ్‌ సాక్ష్యాలపై దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది.’’ అశుతోష్ తెలిపారు. ఇక, కోర్టు ఆదేశం మేరకు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us