కోమాలో ఉన్న ప్రేయసి కోసం ఏడేళ్ల వెయిటింగ్ కానీ.. అది నిజం కాదని తెలిసి

×

కోమాలో ఉన్న ప్రేయసి కోసం ఏడేళ్ల వెయిటింగ్ కానీ.. అది నిజం కాదని తెలిసి

సోషల్ మీడియాలో ఇటీవల ఒక భావోద్వేగ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏడేళ్లు కోమాలో ఉన్న తన ప్రేయసి కోసం ఒక యువకుడు ఎదురుచూసి, ఆమె స్పృహలోకి రాగానే ఆసుపత్రిలోనే వివాహం చేసుకున్నాడనే కథనంతో ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రేమంటే ఇదేరా అంటూ ఈ వీడియోను చూసిన వారంతా కామెంట్లు పెడుతూ, విస్తృతంగా షేర్ చేశారు. ప్రియుడి నిరీక్షణ, ప్రేయసి తిరిగిరావడం, ఆ తర్వాత జరిగిన వివాహం వంటి అంశాలు లక్షలాది మందిని కదిలించాయి. అయితే, ఈ వీడియో వెనుక ఉన్న కథనం పూర్తిగా అవాస్తవం అని తాజాగా ఫ్యాక్ట్ చెక్ కథనాలు వెల్లడించాయి. ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్నవారు నిజమైన ప్రేమికులు కాదని, వారు కేవలం కంటెంట్ క్రియేటర్లు అని తేలింది. ఈ వీడియోలోని సన్నివేశాలను వారు తమ కంటెంట్‌లో భాగంగా రూపొందించారు. అంటే, మనం చూసిన వీడియోకు, దానికి ప్రచారం జరుగుతున్న ఏడేళ్ల కోమా ప్రేమకథకు వాస్తవాలతో ఎటువంటి సంబంధం లేదు. వైరల్ ప్రచారం వేరు, వాస్తవం వేరు అన్నది మరోసారి ఈ ఘటనతో స్పష్టమైంది. నెటిజన్లు నిజమని నమ్మిన ఈ దృశ్యాలు కేవలం ఒక కల్పిత కంటెంట్ మాత్రమే.

Phani CH