AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆ గ్రామంలో 80 ఏళ్లుగా వింత ఆచారం.. కోరిక తీరాలంటే నరసన్నకు అరటిగెల సమర్పించాల్సిందే..

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు వద్ద అరటి గెలలను భక్తులు కడతారు. అరటి గెలలు కట్టడం కోసం రావి చెట్టు వద్ద ప్రత్యేక పందిళ్లను ఏర్పాటు చేస్తారు నిర్వాహకులు. ఈ ఏడాది మొక్కుల్లో భాగంగా పదివేల వరకు అరటి గెలలు వచ్చాయి. ఇలా ఆలయ ప్రాంగణంలో కట్టిన అరటి గెలలను రెండు మూడు రోజుల అనంతరం అదే భక్తులు వచ్చి కట్టిన గెలలను ఇంటికి తీసుకువెళ్ళి స్వామివారి ప్రసాదంగా అరటి పళ్ళను ఇంటిల్లపాది తింటారు.

Andhra Pradesh: ఆ గ్రామంలో 80 ఏళ్లుగా వింత ఆచారం.. కోరిక తీరాలంటే నరసన్నకు అరటిగెల సమర్పించాల్సిందే..
Aratigelala Festival
S Srinivasa Rao
| Edited By: Surya Kala|

Updated on: Feb 23, 2024 | 8:22 AM

Share

సాధారణంగా కోరిన కోరికలు తీరాలంటే దేవుడికి ముడుపు కడతారు.. లేదంటే మేకనో, గొర్రెనో, కోడినో మొక్కుని మొక్కు తీర్చుకుంటారు. కానీ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామంలో  మాత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో అరటి గెలలు కడతారు. ఉద్యోగం రావాలన్నా, పెళ్లి కావాలన్నా పిల్లలు పుట్టాలన్న, అనారోగ్య సమస్యలు తీరాలన్న ఇలా కోరిక ఏదైనా సరే అరటి గెల కడితే సరి. ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనేది భక్తుల నమ్మకం. కొందరు ముందుగా అరటిగెలను సమర్పించి కోరికను కోరుకుంటే.. మరికొందరు ముందుగా కోరికను కోరుకొని అది నెరవేరాక దేవుడుకి అరటి గెలను సమర్పించుకుంటారు. ప్రతిఏటా మాఘ శుద్ధ భీష్మ ఏకాదశి పర్వదినాన ఈ పండుగ ప్రారంభమై మూడు రోజుల పాటు కొనసాగుతోంది.

గత 80 ఏళ్లుగా చెట్ల తాండ్ర గ్రామములో ఈ ఆచారం కొనసాగుతుంది. భీష్మ ఏకాదశి పర్వదినాన వేలాది అరటి గెలలను ఆలయంలో కట్టి స్థానికులు భక్తిని చాటు కుంటుండడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అందుకే శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి ఆలయ ప్రాంగణంలో జరిగే ఈ జాతరకు అరటి గెలల పండుగ అని కూడా స్థానికులు పిలుస్తారు. ఎవరైనా ఆలయానికి వెళ్తే దేవుడికి అరటి పళ్ళు తీసుకువెళ్లటం సాధారణం. ఒకటో, రెండో..లేదా డజను, అరడజను… పళ్లో దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తాం. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా అరటి పళ్ళ గెలను సమర్పిస్తారు భక్తులు. భీష్మ ఏకాదశి పర్వదినం అయిన మంగళవారం నుంచి మూడు రోజుల పాటు వివిధ ప్రత్యేక పూజలతో, సాంస్కృ తిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు వద్ద అరటి గెలలను భక్తులు కడతారు. అరటి గెలలు కట్టడం కోసం రావి చెట్టు వద్ద ప్రత్యేక పందిళ్లను ఏర్పాటు చేస్తారు నిర్వాహకులు. ఈ ఏడాది మొక్కుల్లో భాగంగా పదివేల వరకు అరటి గెలలు వచ్చాయి. ఇలా ఆలయ ప్రాంగణంలో కట్టిన అరటి గెలలను రెండు మూడు రోజుల అనంతరం అదే భక్తులు వచ్చి కట్టిన గెలలను ఇంటికి తీసుకువెళ్ళి స్వామివారి ప్రసాదంగా అరటి పళ్ళను ఇంటిల్లపాది తింటారు. మరి కొందరైతే ఆలయం వద్దే అరటిగెలను విడిచిపెట్టేస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ అరటి గెలల జాతర వెనుక ఒక పెద్ద కథే ఉందట.

సుమారు 150 ఏళ్ల కిందట పరావస్తు అయ్యవారు అనే స్వామీజీ చెట్లతాండ్ర గ్రామానికి చేరుకున్నారు. అందరితో కలివిడిగా ఉంటూ అందరి సమస్యలను తీరుస్తుండేవారు. ఇక్కడే ఒక ఆశ్రమాన్ని స్థాపించి లక్ష్మీ నృసింహ స్వామిని పూజిస్తూ ఉండేవారు. కొన్నాళ్ళ తర్వాత అక్కడే పరవస్తు అయ్యవారు సజీవ సమాధి అయ్యారట. కొన్నేళ్లు గడిచాక ఆయన సమాధి అయిన ప్రాంతంలో ఒక రావి చెట్టు పుట్టి అది క్రమేపి మహావృక్షంగా పెరిగింది. అయితే స్వామిజి సమాధి కావడానికి ముందు కేవలం పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకునే వారట. దీంతో స్వామీజీ వద్దకు వచ్చే భక్తులు ఆయన కోసం అరటి పళ్ళు తీసుకువచ్చేవారట. అదే సంప్రదాయం క్రమంగా అరటి గెలల పండగకు దారితీసిందనేది స్థల పురాణం బట్టి తెలుస్తోంది. మొత్తానికి జాతర మూడు రోజులు ఆలయ ప్రాంగణంలో వేలాడే వేలాది అరటి గెలలు భక్తులకు ఘన స్వాగతం పలుకుతున్నాయి. గ్రామంలో అరటిపండ్ల సువాసనలు గుబాలిస్తున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..