Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రలో చిక్కుకుపోయిన జనగామ వాసులు.. భయాందోళనలో బంధువులు
అమర్‌నాథ్ గుహ వద్ద ప్రస్తుతం వెదర్ క్లియర్‌గా ఉందన్నారు కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్. గాయపడ్డవారిని హెలికాప్టర్ల ద్వారా బేస్ క్యాంప్‌కు తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.
Amarnath Yatra: జమ్మూకశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రికులను శుక్రవారం భీకర వర్షం బెంబేలెత్తించింది. పవిత్ర గుహ సమీపంలో సాయంత్రం 5.30 గంటల సమయంలో వర్ష బీభత్సం కారణంగా వరద పోటెత్తింది. ఆ వరదల్లో ఇప్పటిదాకా కనీసం 13 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది తెలిపారు. మరో 40 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వరదల్లో గాయపడిన వారిని హెలికాప్టర్లలో ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నామని కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ చెప్పారు.
కాగా, అమర్‌నాథ్ యాత్రలో నలుగురు జనగామ జిల్లా వాసులు చిక్కుకుపోయారు. ఈ నెల 3న తాడురి రమేష్, సిద్దలక్ష్మి, లక్ష్మి నర్సయ్య, సత్యనారాయణ యాత్రకు వెళ్లారు. శుక్రవారం రోజున అమర్‌నాథ్ యాత్రలో వరద పోటెత్తి అనేక మంది కొట్టుకుపోయారని తెలిసి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. అయితే తాడురి రమేష్, సత్యనారాయణ తాము సురక్షితంగా ఉన్నామని సమాచారం ఇచ్చారు. మరో ఇద్దరి ఆచూకీ ఇంత వరకు లభ్యం కాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా… నిన్న అమర్‌నాథ్ యాత్రలో వరద బీభత్సం సృష్టించింది.
ఇదిలా ఉంటే, అమర్‌నాథ్ గుహ వద్ద ప్రస్తుతం వెదర్ క్లియర్‌గా ఉందన్నారు కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్. గాయపడ్డవారిని హెలికాప్టర్ల ద్వారా బేస్ క్యాంప్‌కు తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం కాలినడక యాత్రను నిలిపివేశామని, ఎవరు కూడా ముందుకు కదలవద్దు అని హెచ్చరించినట్లు పీఆర్వో వివేక్ తెలిపారు. అమర్‌నాథ్ ప్రాంతంలో కుంభవృష్టి వల్ల అకస్మాత్తుగా వరదలు వచ్చాయి. నార్తర్న్ రూట్‌లో భక్తుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి