Behdienkhlam Festival: బేహ్ దైన్‌ఖ్లామ్ పండుగ ఉత్సవం .. మేఘాలయ రైతుల్లో వర్షోత్సాహం..
వాన మట్టికి పరిమళాన్ని, విత్తుకు మొలకెత్తే శక్తిని, సకల జీవరాశులకు అనిర్వచనీయమైన అనుభూతులను వదిలి వెళుతుంది. వాన ఓ ఆనందానికి చిహ్నం. ఏళ్లు, బయళ్లూ, వూళ్లూ, బీళ్లూ ఏకం చేసే వర్ష రుతువు నిజంగా కర్షక క్రతువే..
వాన మట్టికి పరిమళాన్ని, విత్తుకు మొలకెత్తే శక్తిని, సకల జీవరాశులకు అనిర్వచనీయమైన అనుభూతులను వదిలి వెళుతుంది. వాన ఓ ఆనందానికి చిహ్నం. ఏళ్లు, బయళ్లూ, వూళ్లూ, బీళ్లూ ఏకం చేసే వర్ష రుతువు నిజంగా కర్షక క్రతువే! హర్షోల్లాసపు సంబరమే! అందుకే వర్షాకాలంలో ప్రకృతికి సంబంధించిన పండుగలు ఎక్కువగా జరుగుతాయి. ముఖ్యంగా రైతుల వేడుకలు దేశమంతటా కనిపిస్తాయి. అందులో ఒకటి మేఘాలయలో జరుపుకునే బేహ్ దైన్‌ఖ్లామ్. అక్కడ జరిగే ఈ పెద్ద పండుగను గురువారం ఘనంగా జరుపుకోబోతున్నారు.
చెడును తరిమికొట్టేలా..
మాన్‌సూన్‌లో మనసు దోచుకునే పండుగలెన్నో. ఆ మాటకొస్తే వర్షమే ఓ పెద్ద పండుగ! వర్షానికి మించిన సంబరం మరోటి ఉంటుందా..? నేల ఎంత ఆనందపడుతుందో.. రైతు కూడా అంతే ఆనందపడతాడు.. వేడుక చేసుకుంటాడు.. అలాంటి ఉత్సవాన్నే మేఘాలయ రైతులు కూడా చేసుకుంటారు. ఈ రుతువులోనే మేఘాలయలోని ప్నార్ తెగ ప్రజలు బేహ్ దైన్‌ఖ్లామ్ అనే పండుగను జరుపుకుంటారు. వ్యవసాయంపై ఆధారపడే జయన్‌టియ తెగ ప్రజలకు వర్షం ఓ ఆనందం. వర్షాకాలం రాగానే వ్యవసాయపనులను మొదలు పెడతారు. ఆ తర్వాత బేహ్ దైన్‌ఖ్లామ్ పండుగకు సిద్ధమవుతారు. ఖ్లామ్ అంటే ప్లేగు అట! బేహ్ దైన్ అంటే పారదోలడం అట! అంటే చెడును తరిమికొట్టడానికి జరుపుకునే పండుగ ఇది! పంటలకు ఏ చీడపీడలు తగలకూడదనీ, పంట ఏపుగా పెరగాలనీ చేసుకునే వేడుక! అందరూ ఆనందంగా సుఖశాంతులతో ఉండాలని జరుపుకునే ఉత్సవం ఇది!
మూడు రోజుల పాటు జరిగే గొప్ప పండుగ ఇది! పర్యాటకులకు ఇంతకు మించిన కన్నుల పండుగ మరెక్కడా దొరకదు. అసలు మేఘాలయ సందర్శనకు ఇంతకు మించిన అనువైన సమయం మరెప్పుడూ దొరకదు. ఊరేగింపులు, నృత్యాలు, ఆట పాటలు అన్నీ ఉంటాయి ఇందులో! ప్రకృతిని ప్రసన్నం చేసుకునే ప్రక్రియలు కూడా ఉంటాయి. ఒక్కోసారి నాలుగు రోజుల పాటు కూడా ఉత్సవాలు జరుగుతాయి. చివరి రోజు మధ్యాహ్నం ప్రజలంతా ఐత్నార్ అనే ప్రాంతానికి చేరుకుంటారు. సంధ్య చీకట్లు ముసురుకునేవరకు ఆటపాటలతో ఆనందడోలికల్లో మునిగి తేలుతారు.
వందేళ్ల చరిత్ర..
ఈ పండుగకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఏన్నో ఏళ్లుగా క్రమం తప్పకుండా జయన్‌టియా తెగ ప్రజలు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. ప్లేగు వంటి భయంకరమైన వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రకృతికి ప్రణమిల్లుతున్నారు. పంటకు సమృద్ధిగా నీరు లభించాలని వానదేవుడిని వేడుకుంటున్నారు. ఈ పండుగలోనే మహిళలు పితృదేవతలకు రుచికరమైన వంటకాలతో నైవేద్యం సమర్పించుకుంటారు. ఒకానొక కాలంలో రీ ప్నార్ ప్రాంతాన్ని ప్లేగు వ్యాధి కమ్మేసిందట! జయన్‌టియా తెగ మొత్తాన్ని నాశనం చేసేందుకన్నట్టుగా విరుచుకుపడిందట! ఆ మహమ్మారిని తరిమికొట్టేందుకు బేహ్ దైన్‌ఖ్లామ్ జరుపుకోవడం మొదలు పెట్టారు. తర్వాతి కాలంలో ఇది వ్యవసాయపండుగగా మారింది. తెగ పూజారిని దలోయ్ అంటారు. ఉత్సవాలను ఈయనే ప్రారంభిస్తారు. మొదటి రోజు యువత ఇంటిని శుభ్రం చేస్తుంది. యువతీ యువకులు వెదురుబొంగులతో ఇంటిపైకప్పును కొడతారు. అలా చేయడం వల్ల ఇంటిని అంటిపెట్టుకున్న దుష్టశక్తులు పారిపోతాయని వారి నమ్మకం. ఈ తంతుకు వారం రోజుల ముందు ఓ పందిని పిడుగు దేవుడికి బలి ఇస్తారు. పిడుగు దేవుడిని వారు క్నియా పైర్తట్‌గా పిలుచుకుంటారు. మనం బోనాల పండుగరోజున అమ్మవారికి తొట్టెలు సమర్పించుకున్నట్టుగానే వీరు కూడా ఎత్తయిన తొట్టెలను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రకృతి మాతకు సమర్పించుకుంటారు.
రథాల తయారీలో..
ఊరేగింపుగా తీసుకొచ్చే రథాలు రంగురంగులతో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటి తయారీలో తమ కళాత్మకతను ప్రదర్శించుకుంటారు ప్రజలు. వాటి ద్వారా సమాజానికి కొన్ని హిత వచనాలు కూడా చెబుతారు. వర్తమాన రాజకీయ, ఆర్ధిక సమస్యలపై సందేశాలను రథంలో పొందుపరుస్తారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను కూడా ప్రస్తావిస్తారు. రథాలను తటాకంలోకి తీసుకురావడానికి ముందు స్థానిక పూజారులు రకరకాల పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. రథాల తయారీలో యువతదే కీలకపాత్ర! ఒక్కో తొట్టె 30 నుంచి 40 అడుగుల ఎత్తు ఉంటుంది.. వీటి నిర్మాణానికి వెదురు బొంగులు. రంగురంగుల కాగితాలు ఉపయోగిస్తారు. తమదే ఎత్తుగా ఉండాలనీ.. తమదే అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.. అంటే రథాల తయారీలో గట్టి పోటీ ఉంటుందన్న మాట!
ముగింపు వేడుకలకు ప్రతి ఒక్కరు గొడుగులకు పట్టుకుని వస్తారు.. ఎందుకంటే ఉత్సవాల చివరి రోజు తప్పకుండా వర్షం కురుస్తుందన్న నమ్మకం.. ఆ నమ్మకమే వర్షాన్ని రప్పిస్తుంది కూడా! పండుగ జరిగేది మేఘాలయలో కాబట్టి వద్దన్నా వర్షం కురుస్తుంది. ఇక కొయ్యతో చేసిన బంతితో స్థానికులు ఫుట్‌బాల్ ఆడతారు. ఇది వేడుకకు మరింత ఆకర్షణ తెచ్చిపెడుతుంది. బురద నీటితో యువత చేసే నృత్యాలు కూడా ఆకట్టుకుంటాయి.. మొత్తంగా బేహ్ దైన్‌ఖ్లామ్ ఓ ఆహ్లాదకరమైన వేడుక! ఓ ఆనందభరితమైన ఉత్సవం!
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..