TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నగదు చెల్లింపులపై టీటీడీ కీలక నిర్ణయం.. ఇకపై తిరుమలలోనూ..
Tirumala: తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భాగంగా తిరుమలలో యూపీఐ(Unified Payments Interface) చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టినట్టు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది
Tirumala: తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భాగంగా తిరుమలలో యూపీఐ(Unified Payments Interface) చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టినట్టు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. పైలట్ ప్రాజెక్టు కింద గదుల కేటాయింపులో యూపీఐ విధానాన్ని అమలు చేస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. త్వరలోనే తిరుమలలో అన్ని చెల్లింపులు యూపీఐ విధానంలోనే చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు వారు పేర్కొన్నారు. కాగా ఈ విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అవకతవకలకు చెక్ పడే అవకాశముంటుందని, భక్తులకు పారదర్శక సేవలు అందుతాయని సంబంధిత అధికారులు భావిస్తున్నారు.
టీటీడీ విద్యా సంస్థలపై ప్రత్యేక దృష్టి..
మరోవైపు టీటీడీ విద్యాసంస్థల ఆధునీకరణపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కాగా ఈవో చొరవతో మూడు టీటీడీ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను స్వీకరించేందుకు రేమండ్స్ అధినేత సింఘానియా అంగీకరించారు. ఆయా పాఠశాలల నిర్వహణపై టీటీడీ సంతృప్తి వ్యక్తం చేస్తే టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 35 విద్యాలయాల నిర్వహణ బాధ్యతలు చేపడతామని సింఘానియా వెల్లడించారు. మరోవైపు పద్మావతి మహిళా జూనియర్ కళాశాల నిర్వహణ బాధ్యతలు స్వీకరించేందుకు దాత కొట్టు మురళీకృష్ణ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పరకామణి మండపం నిర్మాణం కోసం ఆయన రూ.16 కోట్లను విరాళంగా అందించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..