మాయావతిలో కనిపించని మునుపటి ఉత్సాహం.? బీఎస్పీ ఓట్లు ఏ పార్టీ కొల్లగొట్టబోతోంది..!

మాయావతిలో కనిపించని మునుపటి ఉత్సాహం.? బీఎస్పీ ఓట్లు ఏ పార్టీ కొల్లగొట్టబోతోంది..!
Bsp

ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌ను శాసించడమే కాకుండా దేశ రాజకీయాలపై బలమైన ముద్రను వేసిన బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతిలో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు.

Balu

| Edited By: Phani CH

Jan 20, 2022 | 3:54 PM

ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌ను శాసించడమే కాకుండా దేశ రాజకీయాలపై బలమైన ముద్రను వేసిన బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతిలో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. ఎన్నికల వేళ క్రీయాశీలకంగా ఉండాల్సిన పార్టీ అధ్యక్షురాలు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అధికార బీజేపీ, అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్న సమాజ్‌వాదీ పార్టీ చాలా రోజుల నుంచి ప్రచారంలో నిమగ్నమై ఉన్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల వేడిని పెంచాయి. హామీలు గుప్పిస్తున్నాయి. ఇక అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దూకుతున్న నేతలు ఇంకాస్త జోష్‌ను పెంచుతున్నారు. ఇంత జరుగుతున్నా, రాష్ట్రంలో రాజకీయ హడావుడి అంతలా ఉన్నా మాయావతి మాత్రం రాజకీయాలపై పట్టింపు లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు. మిగతా పార్టీలు సభలు, సమావేశాలు, ర్యాలీలతో తీరిక లేకుండా ఉంటే మాయావతి మాత్రం సొంత పార్టీ నేతలు నిర్వహిస్తున్న సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు. అసలామె బయట పెద్దగా కనిపించడం లేదు కూడా! పార్టీలో సీనియర్‌ నేతలు కూడా ఒక్కొక్కరుగా పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. అయినా ఆమె మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఎన్నికల కోసం సకల సన్నాహాలు చేసుకుంటున్న పార్టీ నేతలకు తమ అధినేత్రి వ్యవహారశైలి అంతుపట్టడం లేదు. ఇప్పటి వరకు బీఎస్పీకి అందదండగా ఉంటూ వస్తున్న దళితులు కూడా మాయావతిని నమ్ముకోవడం కంటే అఖిలేష్‌ యాదవ్‌ అండ కోరడమే ఉత్తమమని అనుకుంటున్నారు. కొందరు కమలదళంలో చేరిపోయారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి ప్రభావం చాలానే ఉంది. ఇప్పుడు ప్రాభవం కోల్పోయారు కానీ పాతికేళ్ల కిందట యూపీలో తిరుగులేని శక్తిగా ఉండేవారు. బహుజన నేత కాన్షీరాం తర్వాత పార్టీ పగ్గాలను చేబట్టిన మాయావతి అనతి కాలంలోనే పార్టీపై పూర్తి పట్టు సాధించారు. 1995,1997,2002,2007లో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.2002 ఎన్నికల్లో 98 స్థానాలను సంపాదించుకున్న బహుజన్‌ సమాజ్‌పార్టీ 2007లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేసుకోగలిగింది. 403 అసెంబ్లీ స్థానాలకు గాను మాయావతి పార్టీకి 206 సీట్లు వచ్చాయి. ఆ తడవ ఎవరి మద్దతు లేకుండానే మాయావతి ముఖ్యమంత్రి కాగలిగారు. బహుజన్‌ సమాజ్‌పార్టీ వెంట దళితులే కాదు బ్రాహ్మణులు, క్షత్రియులు కూడా మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత మాయావతి వైభవం తగ్గడం మొదలయ్యింది. 2012లో జరిగిన ఎన్నికల్లో మాయావతి పార్టీకి 80 సీట్లు మాత్రమే లభించాయి. 2017 ఎన్నికలకు వచ్చేసరికి కేవలం 19 స్థానాలతో సంతృప్తి చెందాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ పార్టీకి 22.23 శాతం ఓట్లు లభించాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు శాతం మరింత తగ్గింది. కేవలం 19.3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతిసారి సగటున పాతిక శాతం ఓట్లు సాధించిన బహుజన్‌ సమాజ్‌పార్టీకి ఆ ఫలితాలు తీవ్ర నిరాశను కలిగించాయి. అప్పటి నుంచే మాయావతి తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతూ వస్తున్నారు. ఆనాటి నుంచి పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉండటం లేదు. అప్పుడప్పుడు ట్విట్టర్‌ ద్వారా రాజకీయ సమస్యలపై స్పందిస్తున్నారంతే! ఆ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికలను కూడా మాయావతి సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పుడు బీఎస్పీ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఆ పార్టీకి తగ్గిన ఆరేడు శాతం ఓట్లు ఇప్పుడు ఎటువైపుకు వెళతాయన్నదే ప్రశ్న. దళిత సామాజికవర్గం ఓట్లను రాబట్టుకునేందుకు అటు బీజేపీ, ఇటు ఎస్పీ ప్రయత్నిస్తున్నాయి. బీఎస్పీకి దూరమైన దళితులు బీజేపీకి దగ్గరయ్యానడానికి 2017 ఎన్నికలు ఒక ఉదాహరణ. ఆ ఎన్నికల్లో 84 ఎస్సీ నియోజకవర్గాలలో బీజేపీ 71 స్థానాలను గెల్చుకుంది. ఇప్పుడు కూడా అదే ఫలితాలు వస్తాయని బీజేపీ అనుకుంటోంది. దళితులను ఆకట్టుకునేందుకు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాను తిరిగి అధికారంలోకి వస్తే ఎస్సీ అధికారులే ప్రభుత్వాన్ని నడిపిస్తారని ఆయన చెబుతూ వస్తున్నారు. మాయావతి ఇప్పటి వరకైతే మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఆమె యాక్టివ్‌ అవుతారో లేక ఏదైనా పార్టీకి సపోర్ట్‌ చేస్తారో చూడాలి.

Also Read:

ICC పురుషుల టెస్ట్ టీమ్‌లో ఇండియా నుంచి ఇద్దరికి చోటు.. ఈ లెజెండ్‌ కెప్టెన్ అయ్యాడు..?

Medicine: నకిలీ మందులను ఇలా సింపుల్​గా గుర్తించండి.. జస్ట్ స్కాన్ చేస్తే చాలు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu