AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shahid Afridi : జరిమానాలు వేసి డబ్బులు వసూలు చేస్తే సరిపోదు.. సిస్టమ్ మార్చండి.. బోర్డుపై అఫ్రిది ఫైర్

Shahid Afridi : టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ జట్టు ప్రస్థానం అత్యంత దారుణంగా ముగిసింది. కనీసం సెమీఫైనల్ చేరుతుందనుకున్న ఆ జట్టు సూపర్ 8 దశలోనే ఇంటిముఖం పట్టడంతో ఆ దేశంలో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వైఫల్యానికి బాధ్యులను చేస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లపై కఠిన చర్యలకు దిగినట్లు సమాచారం.

Shahid Afridi : జరిమానాలు వేసి డబ్బులు వసూలు చేస్తే సరిపోదు.. సిస్టమ్ మార్చండి.. బోర్డుపై అఫ్రిది ఫైర్
Shahid Afridi
Rakesh
|

Updated on: Mar 03, 2026 | 2:46 PM

Share

Shahid Afridi : టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ జట్టు ప్రస్థానం అత్యంత దారుణంగా ముగిసింది. కనీసం సెమీఫైనల్ చేరుతుందనుకున్న ఆ జట్టు సూపర్ 8 దశలోనే ఇంటిముఖం పట్టడంతో ఆ దేశంలో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వైఫల్యానికి బాధ్యులను చేస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లపై కఠిన చర్యలకు దిగినట్లు సమాచారం. జట్టులోని ప్రతి ఆటగాడికి రూ.50 లక్షల జరిమానా విధించాలని పీసీబీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. బోర్డు నుంచి ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ వార్త పాక్ క్రికెట్ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతోంది.

ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణం భారత్ చేతిలో ఎదురైన ఘోర పరాజయమేనని తెలుస్తోంది. గ్రూప్ దశలో అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా వంటి చిన్న జట్లపై గెలిచినప్పటికీ, టీమిండియా చేతిలో ఓడిపోవడం పాక్ బోర్డుకు మింగుడుపడలేదు. ఇక సూపర్ 8లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడం, ఇంగ్లాండ్‌తో ఓటమి, శ్రీలంకపై నామమాత్రపు విజయం సాధించడంతో పాకిస్థాన్ సెమీస్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సల్మాన్ అలీ ఆగా సారథ్యంలో బరిలోకి దిగిన పాక్ జట్టు ఏ దశలోనూ పటిష్టమైన జట్టుగా కనిపించకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.

పీసీబీ తీసుకున్న జరిమానా నిర్ణయంపై పాక్ మాజీ దిగ్గజం షాహిద్ అఫ్రిది నిప్పులు చెరిగారు. జరిమానాలు వేయడం వల్ల ఆట మెరుగుపడదని, ఇది చాలా సంకుచితమైన ఆలోచన అని ఆయన మండిపడ్డారు. కేవలం డబ్బులు వసూలు చేస్తే సరిపోదని, అసలు సమస్య క్రికెట్ వ్యవస్థలో ఉందని అఫ్రిది విమర్శించారు. వరుసగా విఫలమవుతున్న ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించి, వారిని మళ్ళీ డొమెస్టిక్ క్రికెట్ ఆడి ఫామ్ నిరూపించుకోమని చెప్పాలని ఆయన సూచించారు. జట్టులో కొత్త రక్తాన్ని నింపాల్సిన సమయం వచ్చిందని, జరిమానాలు వేయడం వల్ల ఆటగాళ్లలో భయం పెరుగుతుందే తప్ప టాలెంట్ బయటకు రాదని అఫ్రిది ఘాటుగా స్పందించారు.

సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం అఫ్రిది మాటల్లో నిజముందని అభిప్రాయపడుతున్నారు. ఆటగాళ్ల జీతాల నుంచి కోత విధించడం కంటే, మేనేజ్మెంట్ లో మార్పులు చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి టీ20 వరల్డ్ కప్ ఓటమి పాకిస్థాన్ క్రికెట్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. మరి రాబోయే రోజుల్లో బోర్డు ఎలాంటి ప్రక్షాళన చేపడుతుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us