Andhra Pradesh: వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీపై క్లారిటీ ఇచ్చిన సోము వీర్రాజు..
ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందో.. లేదో అనేదానిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టత ఇచ్చారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్..
Andhra Pradesh: ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందో.. లేదో అనేదానిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టత ఇచ్చారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనీయబోమని చేసిన వ్యాఖ్యల తర్వాత.. జనసేనాని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈనేపథ్యంలో సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందని, వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీచేస్తామన్నారు. దీనిపై ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకత్వంపై అలకబూనారని, ఎన్నికలకు ముందే టీడీపీతో కలిసి వెళ్తారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు రాజధాని అమరావతిపై మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి కేంద్రప్రభుత్వం రూ.6వేల కోట్లు ఇచ్చిందన్నారు. రాజధానిగా అమరావతికే తమ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.
అమరావతినే ఏపీ రాజధానిగా భావించి రాష్ట్రం నలుమూలల రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మించిందన్నారు. రాజధాని నిర్మాణం చేయలేని పాపం రెండు కుటుంబ పార్టీలదే అంటూ వైసీపీ, టీడీపీలను విమర్శించారు. అమరావతి రైతలు ఉద్యమానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు సోము వీర్రాజు. దేవాలయ భూములు ప్రభుత్వాల ఆధీనంలో ఉండకూడదనేది తమ పార్టీ ఆలోచనగా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆలోచనలు దేవాలయాలకు వ్యతిరేకంగా ఉంటాయని తెలిపారు. ఇప్పడు పాలిస్తున్న ప్రభుత్వం మత తత్వ ప్రభుత్వమని వైసీపీని విమర్శించారు సోమువీర్రాజు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..