Volkswagen: ఫోక్స్ వ్యాగన్ నుంచి ఎలక్ట్రిక్ కారు.. వచ్చే సంతవ్సరం భారత్ మార్కెట్‌లోకి..!
Volkswagen: ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్ ఏజీ భారత్ మార్కెట్‌లో వచ్చే సంవత్సరం తొలి విద్యుత్ కారు విక్రయానికి రెడీ అవుతోంది. `ఐడీ.4` అనే పేరుతో వచ్చే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్..
Subhash Goud | Edited By: Ravi Kiran
Updated on: Jun 11, 2022 | 6:52 AM

Volkswagen: ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్ ఏజీ భారత్ మార్కెట్‌లో వచ్చే సంవత్సరం తొలి విద్యుత్ కారు విక్రయానికి రెడీ అవుతోంది. `ఐడీ.4` అనే పేరుతో వచ్చే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్‌యూవీ) కారును వచ్చే ఏడాది పరిమితంగా భారత్‌లో విక్రయించనుంది.

వచ్చే సెప్టెంబర్‌లో `ఐడీ.4` ఎలక్ట్రిక్ కారును ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది కంపెనీ. భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేసి ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఫోక్స్ వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ డివిజన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ అశీష్ గుప్తా తెలిపారు. పరీక్షలు పూర్తయిన తర్వాత వచ్చే సంవత్సరం పరిమిత సంఖ్యలో కార్లు దిగుమతి చేసుకుంటామని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఎటువంటి అధికారిక అనుమతులు అవసరం లేకుండా కేవలం 2500 కార్లను దిగుమతి చేసుకునేందుకు కార్ల తయారీ సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఈ పరిమితికి అనుగుణంగానే ఎలక్ట్రిక్ కార్లను భారత్ మార్కెట్‌లోకి తీసుకువస్తామని అశీష్ గుప్తా అన్నారు.

2025 నుంచి 2027 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల అసెంబ్లింగ్ ప్రారంభిస్తామని ఫోక్స్ వ్యాగన్ అంచనా వేస్తోంది. అప్పటికల్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ఖర్చుతో కూడుకున్నదైన బ్యాటరీలను భారత్‌లో సొంతంగా తయారు చేయగలమని భావిస్తోంది. ప్రపంచంలోకెల్లా భారత్ నాలుగో అతిపెద్ద మార్కెట్. ఎలక్ట్రిక్ కార్ల విక్రయానికి అంతర్జాతీయ సంస్థలు పోటీ పడతాయని భావిస్తున్నారు.





























