Ivy Gourd for Alzheimers: మతిమరుపుకు కళ్లెం వేసే దొండ.. ఈ ఆయుర్వేద చిట్కా తెలుసుకుంటే మీకే మంచిది!
తెలిసో తెలియకో చాలా మంది దొండ కాయలపట్ల అపనమ్మకాన్ని పెంచుకున్నారు. ఇది తింటే మగతగా ఉంటుందని, తెలివి తేటలను హరిస్తుందని.. విద్యార్ధులు అస్సలు తినకూడదని రకరకాల అపోహలు చాలా మందిలో తిష్ట వేసుకుని ఉన్నాయి. అయితే ఆయుర్వేదంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రయోజనాలు ఉన్నాయి. అవును.. అపోహల మాటున దొండ చేసే మేలు గుర్తించలేకపోతున్నాం..
Updated on: Feb 02, 2025 | 1:12 PM

సాధారణంగా దొండ కాయలను చేస్తే చాలా మంది మూతి తిప్పేసుకుంటారు. ఈ కూరగాయ తింటే తెలివితేటలు తగ్గిపోతాయనే భావన చాలా మందిలో ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు సైతం ఈ కూరగాయను పిల్లలకు ఇవ్వడానికి ఇష్టపడరు. అయితే ఇలాంటి అపోహలను నమ్మవద్దని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎందుకంటే దొండలోని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిసిన వారు దీనిని తినకుండా ఉండలేరు.

అంతే కాదు ఆయుర్వేదంలో కూడా దొండకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇందులో ఫైబర్, విటమిన్ బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయుర్వేదంలో దొండ మధుమేహానికి ఔషధంగా ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ-అడిపోజెనిక్ ఏజెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వారానికి ఒకసారి దొండ తినడం లేదా దాని ఆకుల రసం తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో థయామిన్ కూడా ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌గా కూడా మారుస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. ఇది అల్సర్, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒంట్లో విటమిన్ ఎ గా మారి, దృష్టి లోపాలను సరిదిద్దుతుంది.

దొండ తింటే మగత, మెంటల్ రిటార్డేషన్ సమస్యలు వస్తాయని అంటుంటారు. నిజానికి ఇది పూర్తిగా అవాస్తవం. బదులుగా ఇది నాడీ వ్యవస్థను బలపరుస్తుందని, అల్జీమర్స్ వంటి లక్షణాలను తగ్గిస్తుందని అధ్యయనాలు సైతం నిరూపించాయి.

అంతే కాదు బరువు తగ్గాలనుకునే వారికి దొండ కాయ తీసుకోవడం చాలా మంచిది. ఇందులో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే జీవక్రియ రేటును పెంచుతుంది. ఐరన్ లోపంతో బాధపడేవారు దొండ తినడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారికి కూడా ఇది మంచిది.





























