AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Polavaram : ఫలించిన పోరాటం : రూ. 55,656 కోట్ల అంచనాలను ఆమోదించాలని కోరామన్న విజయసాయిరెడ్డి

పోలవరం సవరించిన అంచనాల ఆమోదంపై వైసీపీ ఎంపీల పోరాటం ఫలించింది. కేంద్ర జలశక్తి మంత్రి అనుకూలింగా స్పందించారు. సవరించిన అంచనాలను కేంద్ర కేబినెట్‌ ఆమోదానికి పంపుతామన్నారు..

Polavaram : ఫలించిన పోరాటం :  రూ. 55,656 కోట్ల అంచనాలను ఆమోదించాలని కోరామన్న విజయసాయిరెడ్డి
Gajendra Shekhawat
Venkata Narayana
|

Updated on: Jul 28, 2021 | 8:23 PM

Share

Vijayasai Reddy – Polavaram Project – Gajendra Shekhawat: పోలవరం సవరించిన అంచనాల ఆమోదంపై వైసీపీ ఎంపీల పోరాటం ఫలించింది. కేంద్ర జలశక్తి మంత్రి అనుకూలింగా స్పందించారు. సవరించిన అంచనాలను కేంద్ర కేబినెట్‌ ఆమోదానికి పంపుతామన్నారు గజేంద్ర షెకావత్‌. వైసీపీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. 47 వేల725 కోట్ల రూపాయలకు సవరించిన అంచనాలను అంగీకరించారు గజేంద్రసింగ్‌ షెకావత్‌. రేపు ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపి.. వచ్చేవారం కేంద్ర కేబినెట్‌ ముందుకు ఈ సవరించిన అంచనాలు రానున్నాయి.

ఈ సందర్భంగా విజయసాయి మీడియాతో మాట్లాడుతూ జలశక్తి శాఖ మంత్రితో ఐదు అంశాల గురించి చర్చించామని తెలిపారు. అందులో మొదటిది పోలవరం ప్రాజెక్టుకు పెట్టుబడులను క్లియర్ చేయడమని విజయసాయి చెప్పారు. ఆ మేరకు సవరించిన అంచనాలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించిందని పేర్కొన్నారు. రూ. 55,656 కోట్ల అంచనాలను ఆమోదించాలని తాము కోరామని చెప్పిన విజయసాయి.. కమిటీ సూచించిన మేరకు రూ. 47,725 కోట్లు ఆమోదిస్తామని చెబుతున్నారని వెల్లడించారు. బిల్లుల విషయంలో కాలయాపన లేకుండా ఎస్క్రో ఖాతా తెరవాలని కేంద్రమంత్రిని అడిగామని తెలిపిన వైసీపీ ఎంపీ, “అది సాధ్యం కాదు. వారం పదిరోజుల్లో రీయింబర్స్ చేస్తాం” అని కేంద్రమంత్రి చెప్పారన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం ఖర్చు చేసిన రూ 1,920 కోట్లు రీయింబర్స్ చేస్తామని గజేంద్ర షెకావత్ వెల్లడించారని విజయసాయి స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల పోరాటం ఫలించింది. కొంత తేడాతో సవరించిన అంచనాలను ఆమోదించేందుకు కేంద్ర జలశక్తి శాఖ అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి వెల్లడించారు. బుధవారం సాయంత్రం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో విజయసాయి రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ఎంపీల బృందం భేటీ జరిపింది. దాదాపు అరగంట పాటు పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదం సహా మరికొన్ని అనుబంధ అంశాలపై చర్చించింది. ఈ మేరకు విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రికి ఓ వినతిపత్రాన్ని అందజేశారు.

పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఆమోదించిన రెండవ సవరించిన అంచనా వ్యయాన్ని ఏమాత్రం జాప్యం చేయకుండా ఆమోదించాలని తాము కోరామని విజయసాయిరెడ్డి చెప్పారు. అయితే రివైజ్డ్ కాస్ట్ కమిటీ సిఫార్సు చేసిన రూ. 47,725 కోట్ల అంచనా వ్యయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు. అలాగే ప్రాజెక్ట్ నిర్మాణంలోని అంశాల వారీగా జరిగే పనులకు చెల్లింపులకు బదులుగా మొత్తం పనులను పరిగణలోనికి తీసుకుని చెల్లింపులు చేయాలన్న విజ్ఞప్తికి మంత్రి అంగీకరించినట్లు చెప్పారు.

పోలవరం ప్రాజెక్ట్‌ నిధుల విడుదల ప్రక్రియను కూడా క్రమబద్దీకరించాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ఎస్క్రో ఖాతాను తెరవాలని కోరినట్టుగా తెలిపారు. అయితే ఎస్క్రో ఖాతా తెరవడం సాధ్యం కాదని, నిజానికి ఆ ఖాతా అవసరమే లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన వ్యయాన్ని బిల్లులు పంపిన వారం పది రోజుల్లోనే తిరిగి చెల్లిస్తామని కేంద్ర మంత్రి షెకావత్ చెప్పినట్టు విజయసాయి రెడ్డి తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో ఉన్న పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని పాలనా సౌలభ్యం కోసం ప్రాజెక్టుకు సమీపంలోని రాజమహేంద్రవరంకు తరలించాలని కోరగా, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.

కాగా, పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనా వ్యయం ఆమోదం కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనేక పర్యాయాలు జల శక్తి, ఆర్థిక మంత్రిత్వ శాఖల మంత్రులు, అధికారులతో సంప్రదింపులు, సమావేశాలు జరిపారు. అధికారపార్టీ ఎంపీలు సైతం వీలున్నప్పడల్లా ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వద్ద లేవనెత్తుతూ వచ్చారు. సవరించిన అంచనాలను సమర్పించి రెండేళ్లు దాటినా కేంద్రం నుంచి సరైన స్పందన లేకపోవడంతో, ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతి రోజూ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం వైకాపా ఎంపీలతో చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమయం కేటాయించారు. విజయసాయి నేతృత్వంలో ఉభయ సభలకు చెందిన పార్టీ ఎంపీలు సమావేశమై కేంద్ర మంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చారు. జూన్‌ 2022 నాటికి ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని విజయసాయి రెడ్డి మంత్రికి వివరించారు.

అనేక సమావేశాలు, సంప్రదింపులు, విన్నపాలు, విజ్ఞప్తులు చేసినప్పటికీ పోలవరం జాతీయ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ విషయంలో నెలకొంటున్న సమస్యల పరిష్కారంలో కేంద్రం చురుగ్గా చర్యలు చేపట్టడం లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం ప్రారంభించే సమయానికి 2010-11 నాటి ధరల ప్రాతిపదికపై అంచనా వ్యయానికి ఆమోదం లభించిందని, తదనంతరం పెరిగిన ధరల కారణంగా ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి వాస్తవికమైన అంచనాలతో సవరించిన అంచనాలను సమర్పించాల్సిందిగా పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని తెలిపారు.

నిర్మాణంలో జరిగిన జాప్యం కారణంగా పెరిగిన వ్యయంతోపాటు డిజైన్లలో పలు మార్పులు, చేర్పులు, ధరల పెరుగుదల, కొత్తగా అమలులోకి వచ్చిన భూసేకరణ చట్టంలోని నియమ, నిబంధనలను అనుసరించి భూసేకరణకు, నిర్వాసితుల పునరావాసం, పునఃనిర్మాణానికి అయ్యే వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని 2017-18 నాటి ధరల ప్రాతిపదికపై రూ. 57,297 కోట్లతో సవరించిన అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీకి సమర్పించిందని విజయసాయి రెడ్డి చెప్పారు.

జల శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ (టీఎసీ) సూచనల మేరకు అంచనా వ్యయాన్ని రెండోసారి సవరించి 55,548 కోట్లతో ప్రతిపాదనలను సమర్పించినట్టు ఆయనకు గుర్తుచేశారు. టీఏసీ ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తూనే వాటిని కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ (ఆర్‌సీఈ) పరిశీలనకు పంపింది. కాస్ట్ కమిటీ ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం అంచనా వ్యయాన్ని రూ. 47,725 కోట్లకు కుదించి తుది ఆమోదం కోసం జల శక్తి మంత్రిత్వ శాఖకు పంపించినట్లు విజయసాయి రెడ్డి వివరించారు.

అయితే జల శక్తి మంత్రిత్వ శాఖ రెండవ సవరించిన అంచనా వ్యయానికి ఇన్వెస్టిమెంట్ క్లియరెన్స్‌ ఇవ్వలేదు. పైగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఖర్చుల విభాగం సవరించిన అంచనా వ్యయంలో తాగు నీటి అంశాన్ని తొలగించి 2013-14 నాటి ధరల ప్రాతిపదికన లెక్కగట్టి అంచనా వ్యయాన్ని మరింత కుదించినట్లు ఆయన తెలిపారు. తాగు నీటి అంశం తొలగించడం కేంద్ర జల సంఘం నియమ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని విజయసాయి రెడ్డి తెలిపారు.

ప్రాజెక్టులోని ప్రధాన అంశాలైన నీటి పారుదల, తాగు నీటి అంశాలకు సంబంధించిన వ్యయాన్ని 2013-14 నాటి ధరలకే జల శక్తి మంత్రిత్వ శాఖ పరిమితం చేసిందని, ఫలితంగా ప్రాజెక్టులోని ఇతర అనేక కీలకమైన అంశాలకు చేసిన ఖర్చును తిరిగి రాష్ట్రానికి చెల్లించడానికి పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ నిరాకరించిందని అన్నారు. గతంలో ఆమోదం పొందిన పనులకు సంబంధించి పెరిగిన వ్యయాన్ని తిరిగి చెల్లించడానికి అథారిటీ నిరాకరించడంతో ప్రాజెక్ట్‌ నిర్మాణానికి విడుదలయ్యే నిధులపై తీవ్ర ప్రభావం పడిందని వివరించారు. కాబట్టి అంశాలవారీగా మాత్రమే ఖర్చు చేయాలన్న నిబంధనను తొలగించాలని ఆయన మంత్రిని కోరారు.

అలాగే పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని అప్పట్లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. అయితే దీనిని తరలించే అధికారం ప్రాజెక్ట్‌ అథారిటీకి ఉంది. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, పునఃనిర్మాణ పనులను ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్‌ అథారిటీ పర్యవేక్షించాల్సి ఉన్నందున 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని ప్రాజెక్టుకు సమీపంలోని రాజమహేంద్రవరంకు తరలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Vijayasai Reddy

Vijayasai Reddy

Read also :  Devineni Uma : మాజీ మంత్రి దేవినేని ఉమకు 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలింపు