Modi vs Didi: 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా మమత వ్యూహాలు.. ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి కానున్నారా?
2024 General Elections: ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనేతలంతా సర్వశక్తులొడ్డి పోరాడిన బెంగాల్ ఎన్నికల్లో కమలనాథులను మట్టికరిపించిన మమతా బెనర్జీ.. ఇప్పుడు ఏకంగా ప్రధాని సీటుపైనే కన్నేసినట్టు కనిపిస్తోంది.
PM Narendra Modi vs Mamata Banerjee: ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనేతలంతా సర్వశక్తులొడ్డి పోరాడిన బెంగాల్ ఎన్నికల్లో కమలనాథులను మట్టికరిపించిన మమతా బెనర్జీ.. ఇప్పుడు ఏకంగా ప్రధాని సీటుపైనే కన్నేసినట్టు కనిపిస్తోంది. ఆమె తాజా ఢిల్లీ పర్యటన ఇదే సంకేతాలనిస్తోంది. బీజేపీని, అందులోనూ ప్రధాని మోడీని ఎదుర్కొనే విషయంలో ఇంతకాలం ప్రతిపక్షాలు ఎన్ని వ్యూహాలు పన్నినా చతికిలపడుతూనే వచ్చాయి. కానీ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం ఒంటరిగా తన రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొని వరుసగా మూడో సారి అసెంబ్లీని గెలుచుకుని హ్యాట్రిక్ సాధించారు. ఈ విజయమే మమతా బెనర్జీని ప్రతిపక్షాల తరఫున నాయకత్వం వహించేస్థాయికి తీసుకొచ్చింది. ఇంతకాలం ప్రధాని నరేంద్ర మోదీని ఢీకొట్టగలిగే శక్తిసామర్థ్యాలు, ఇమేజి కలిగిన నేత కోసం ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలకు లేడీ బెంగాల్ టైగర్ రూపంలో దీదీ దొరికారు. ఫలితంగా దేశ రాజకీయ పరిస్థితుల్లో మార్పులు శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి. దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ రెండుగా చీలి కొన్ని ఎన్డీయే గూటిలో ఉండగా, మరికొన్ని మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమిలో చేరుతున్నాయి. ఈ రెండు కూటములకు దూరంగా ఉన్న పార్టీలు సైతం 2024 ఎన్నికల నాటికి ఎటో ఒకవైపు చేరక తప్పని పరిస్థితి మెల్లమెల్లగా ఏర్పడుతోంది.
కాంగ్రెస్ దారెటు? కాంగ్రెస్ పేరుకే జాతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీకి ఎక్కువ, జాతీయ పార్టీకి తక్కువ అన్నట్టుగా ఉంది ఆ పార్టీ పరిస్థితి. 2014 సార్వత్రికి ఎన్నికల్లో ఓటమికి పదేళ్ల యూపీఏ పాలనపై ఉన్న వ్యతిరేకతే కారణం అని సరిపెట్టుకున్నప్పటికీ, రాహుల్ నాయకత్వంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడం ఆ పార్టీ స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఆ తర్వాత స్థానికంగా బలమైన నేతలున్న పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి కొన్ని రాష్ట్రాల్లో తప్ప దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వరుసగా ఓటమి పాలవుతూ వస్తోంది. దీంతో ఇంతకాలం కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్షాలు యూపీఏ పేరుతో కొనసాగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు బీజేపీని వ్యతిరేకించే పక్షాలు కాంగ్రెస్ నేతృత్వంలో ముందుకుసాగితే ఉపయోగం ఉండదనే అభిప్రాయానికి వచ్చేశాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై గౌరవాన్ని ప్రదర్శిస్తూనే, మమతా బెనర్జీ, శరద్ పవార్ వంటి సీనియర్ నేతల నేతృత్వంలో బీజేపీని ఎదుర్కోవాలని భావిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ కోసం పనిచేసిన ఆయన, ఆ వెంటనే దీదీని 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎక్కుపెట్టారు.
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ లేని కూటమి నిలదొక్కుకోవడం సాధ్యపడదని ప్రతిపక్ష కూటమి భావిస్తోంది. ఇందుక్కారణం ప్రతిపక్ష పార్టీల్లోని ప్రాంతీయ పార్టీలకు తమ తమ రాష్ట్రాల్లో తప్ప బయట మరే రాష్ట్రంలో కనీసం ఉనికి కూడా లేకపోవడమే. ఉదాహరణకు తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్‌లో బలంగా ఉన్నా, ఆ ప్రభావం బెంగాల్ బయట కనిపించదు. అదే రీతిన యూపీ దాటితే సమాజ్‌వాదీ పార్టీకి, బిహార్ దాటితే రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)కి, మహారాష్ట్ర దాటితే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి, తమిళనాడు దాటితే డీఎంకే పార్టీకి ఉనికే లేదని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో పరస్పరం అన్ని పార్టీలు మద్ధతు ప్రకటించుకున్నా, క్షేత్రస్థాయిలో ఓట్లుగా మార్చే అవకాశం ఉండదు. కేవలం బీజేపీ వ్యతిరేకతపైనే ఆధారపడాల్సి వస్తుంది. అదే కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం) వంటి పార్టీలకు దేశవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఎంతో కొంత ఉనికి, ఓటుబ్యాంకు ఉంటుంది. ఈ పార్టీలు మద్ధతిస్తే, ఆ ఓటుబ్యాంకు ప్రతిపక్ష పార్టీకి ఎంతోకొంత అదనంగా వచ్చి చేరుతుంది. అందుకే కాంగ్రెస్ లేని కూటమి సాధ్యం కాదంటూ కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.
మధ్యే మార్గం – ఉమ్మడి సారధ్యం.. 2014 కంటే 2019లో మరింత ఎక్కువ ఓటుబ్యాంకుతో మరిన్ని ఎక్కువ సీట్లు కైవసం చేసుకున్న ఎన్డీయే కూటమిని ఎదుర్కోవాలంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఢీకొట్టే బలమైన వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా జనం ముందు నిలబెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో మోదీకి దీదీయే సరైన సమఉజ్జీ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ఇంకా ఏకాభిప్రాయం రానప్పటికీ, ప్రతిపక్షాల్లో మెజారిటీ ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. మోదీ-షా ద్వయాన్ని ధైర్యంగా ఎదురిస్తూ, ఎలాంటి సంకోచం లేకుండా పదునైన విమర్శలు చేస్తున్న మమతా బెనర్జీ ఈ తరహా ఇమేజిని సంపాదించుకోగలిగారు అనడంలో సందేహం లేదు. అయితే జాతీయ పార్టీ కాంగ్రెస్‌ను కూటమిలో భాగస్వామిగా చేసుకునే విషయంలో ఒక అవగాహనకు రావాలని దీదీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కూటమికి కాంగ్రెస్ పార్టీయే సారధ్యం వహిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు సమన్వయ బాధ్యతల్లో ఉంటూ మమతా బెనర్జీని కూటమి ప్రధాని అభ్యర్థిగా జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై ప్రశాంత్ కిశోర్ పలు దఫాలుగా కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో చర్చలు జరిపారని సమాచారం.
ప్రాథమిక స్థాయిలో ప్రశాంత్ కిశోర్ చర్చల తర్వాత ఇప్పుడు మమతా బెనర్జీ నేరుగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా అమె వరుసపెట్టి కాంగ్రెస్ సీనియర్ నేతలను కలవడం, అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కావడం వెనుక కారణం కూడా ఇదేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రధాని పదవిని వదలుకుని కూటమిలో కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతమేర సిద్ధపడుతుందన్నదే అందరి ముందున్న ప్రశ్న.
(మహాత్మ కొడియార్, టీవీ9 తెలుగు, న్యూఢిల్లీ)
Also Read..
ప్రశాంత్ కిషోర్ టీమ్ పై త్రిపుర పోలీసుల కేసు..ఆగస్టు 1 న హాజరు కావాలని సమన్లు జారీ