AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: సామాజిక న్యాయం నుంచి సమాన అవకాశాల దాకా… మోదీ పాలనలో అంబేద్కర్ మార్గం

డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ మహాపరినిర్వాణ దినం సందర్భంగా దేశం ఆ మహనీయుడ్ని స్మరిస్తోంది. అదే క్రమంలో మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని మరింత స్పష్టంగా వినిపిస్తోంది. సామాజిక న్యాయం నుంచి సమాన అవకాశాల దాకా.. బాబాసాహెబ్ ఆశించిన రాజ్యాంగ స్పూర్తికి మోదీ నినాదం “సబ్కా సాథ్, సబ్కా వికాస్” కొత్త ఊపిరి పోస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

PM Modi: సామాజిక న్యాయం నుంచి సమాన అవకాశాల దాకా… మోదీ పాలనలో అంబేద్కర్ మార్గం
PM Modi - Dr. Br AmbedkarImage Credit source: Shital Morjaria (Dr. BR Ambedkar's Pic)
Ram Naramaneni
|

Updated on: Dec 06, 2025 | 4:07 PM

Share

రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ మహాపరినిర్వాణ దినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన నివాళులు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన చాటిన సామాజిక న్యాయం, సమానత్వం, గౌరవం వంటి లక్షణాలు నేటి భారత పాలనలో మరింత స్పష్టంగా ప్రతిఫలిస్తున్నాయనే విశ్లేషణ వెలువడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నినాదం ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయత్న్’ కూడా అదే ప్రజాస్వామ్య స్ఫూర్తికి కొనసాగింపుగా నిలుస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత దశాబ్దంలో సుమారు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు మోదీ వెల్లడించిన విషయాన్ని.. ‘భారత రాజ్యాంగం అందరికీ మార్గదర్శి కావాలి’ అన్న అంబేద్కర్ ఆశయంతో పోల్చి చూస్తున్నారు.

గుజరాత్ సీఎంగా అంబేద్కర్ మార్గంలో మోదీ

గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోనూ మోదీ అంబేద్కర్ స్ఫూర్తిని కార్యరూపంలో పెట్టే పాలనను అమలు చేశారు. సామాజిక న్యాయ శాఖ ద్వారా నూటికి పైగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి, విద్య, గృహాలు, పారిశుద్యం, ఆర్థిక సాధికారత వంటి రంగాల్లో ఎంతో పురోగతి సాధించారు.అంబేద్కర్ భావనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో అంబేద్కర్ భవన్‌కు శంకుస్థాపన చేశారు. ఆయన విగ్రహాలను ఆవిష్కరించారు. రాజ్యాంగంపై అవగాహన పెంపొందించేందుకు ‘సంవిధాన్ యాత్ర’ను ప్రారంభించారు.2007లో అంబేద్కర్ జయంతినాడు ‘స్వచ్చ్ గుజరాత్ మహా అభియాన్’ను ప్రారంభించడం ద్వారా పరిశుభ్రతను ప్రజా బాధ్యతగా చూపించి.. అంబేద్కర్ విలువలకు ప్రతీకగా నిలిచారు.

అంబేద్కర్‌కు ఎంతో ప్రాధాన్యమిచ్చిన ప్రధాని

ఢిల్లీలో అంబేద్కర్ స్మారకం, లండన్‌లోని ఆయన నివాసానికి జ్ఞాపక చిహ్నం, జనపథ్‌లోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రం.. ఇవన్నీ మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు. అంబేద్కర్ జీవితం, తత్త్వానికి ప్రతీక అయిన అయిదు ప్రధాన స్థలాల సమాహారంగా ‘పంచతీర్థ్’ను అభివృద్ధి చేయడం గొప్ప విషయమని అంబేద్కర్ వాదులు చెబుతున్నారు. 2015లో ‘సంవిధాన్ దివస్‌’ను ప్రకటించడం ద్వారా రాజ్యాంగ నిర్మాతకు గౌరవం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించేలా చేశారు.

అంబేద్కర్ గురించి మోదీ ప్రత్యేక విశ్లేషణ

బాబాసాహెబ్ అంబేద్కర్‌ను దేశంలోని ప్రధాన ఆర్థిక ఆలోచనాపరుల్లో ఒకరిగా మోదీ తరచూ ప్రస్తావిస్తుంటారు. 2015లో దళిత పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన ఆర్థిక రచనలు.. నేటి ఆర్థిక సవాళ్లకు మార్గనిర్దేశకాలు అన్నట్లు వ్యాఖ్యానించారు. అదే దృక్పథం ఎఎస్‌ఐఐఎమ్‌ (Ambedkar Social Innovation and Incubation Mission–2020), పీఎం–అజయ్‌ (2021) వంటి పథకాల రూపంలో ప్రతిఫలిస్తోంది. ఎస్సీ, ఓబీసీ వర్గాల సాధికారతకు 127వ రాజ్యాంగ సవరణతో రాష్ట్రాలకు తిరిగి అధికారాలు ఇవ్వడం, అలాగే 370వ ఆర్టికల్ రద్దుతో జమ్మూకాశ్మీర్‌లోని పేద, అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు తెరవడం అంబేద్కర్ చూపించిన మార్గాల దిశగా చేపట్టిన నిర్ణయాలుగానే భావిస్తున్నారు.

అంబేద్కర్ ఆశయాలకు ప్రత్యేక రూపం

అంబేద్కర్ విలువలు స్మరణకే పరిమితం కాకుండా.. అభివృద్ధి, గౌరవం, సమాన అవకాశాల రూపంలో ప్రజలకు చేరేలా మోదీ పాలన కృషి చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న ‘సమానత భారతం’ వైపు దేశం అడుగులు వేస్తోందనే సందేశం.. ఈ మహాపరినిర్వాణ దినాన ప్రత్యేకంగా ప్రతిధ్వనిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..