Sasikala: జయలలిత ఫార్ములా చిన్నమ్మకు వర్కౌట్ అవుతుందా..? ఏఐఏడీఎంకే లో ఎంట్రీకి చిన్నమ్మ యాక్షన్ ప్లాన్ అదేనా?

శశికళ... చిన్నమ్మ.. పురచ్చితాయి.. ఈ పేర్లకు పరిచయం అక్కర్లేదు.. దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెశ్చేలి శశికళ ఇపుడు తమిళ రాజకీయాల్లో..

Sasikala: జయలలిత ఫార్ములా చిన్నమ్మకు వర్కౌట్ అవుతుందా..? ఏఐఏడీఎంకే లో ఎంట్రీకి చిన్నమ్మ యాక్షన్ ప్లాన్ అదేనా?
Sasikala
Follow us

|

Updated on: Oct 18, 2021 | 1:30 PM

AIADMK – Sasikala: శశికళ… చిన్నమ్మ.. పురచ్చితాయి.. ఈ పేర్లకు పరిచయం అక్కర్లేదు.. దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెశ్చలి శశికళ ఇపుడు తమిళ రాజకీయాల్లో కలకలం రేపారు.. తమిళ పాలిటిక్స్ అనగానే కరుణానిధి, జయలలిత ఇద్దరు పొలిటికల్ లెజెండ్స్ గుర్తొస్తారు.. కానీ ఇపుడు ఆ ఇద్దరు లేరు.. కరుణానిధి వారసుడిగా స్టాలిన్ పార్టీలో అన్నీ తానై పార్టీని అధికారంలోకి తెచ్చి సీఎం అయ్యారు.. కానీ ఏఐఏడీఎంకే లో పరిస్థితి వేరు.. పార్టీ తర్వాతి వారసులు పలానా అని జయలలిత ఎప్పుడూ ప్రకటించలేదు.. ప్రస్తావించలేదు కూడా.. జయ మరణం తర్వాత చిన్నమ్మ సీఎం కావాలని కలలు కన్నా జైలు శిక్ష రూపంలో అది నెరవేరలేదు.. అనూహ్యంగా పళనిస్వామి సీఎం అయ్యారు. పార్టీ అధికారంలో ఉంది కనుక నాలుగేళ్లు నడిపించగలిగారు.. ఇపుడు పరిస్థితులు మారుతున్నాయి.

ఒక్క సారి ఫ్లాష్ బ్యాక్ వెళితే.. అది 2016 డిసెంబర్ 5.. అనారోగ్యంతో సీఎం జయలలిత మృతి చెందారు.. తాత్కాలిక సిఎంగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టారు.. 2017 జనవరిలో శశికళ తాను సీఎం కావాలని అనుకుని ఏర్పాట్లు చేసుకున్నారు.. ఇంతలో పెద్ద బాంబు లాంటి వార్త.. రిజర్వులో ఉన్న అక్రమాస్తుల కేసు తీర్పు వచ్చింది.. జయలలిత, శశికలపై ఉన్న అక్రమాస్తుల కేసు తీర్పు రావడంతో జైలుకెళ్ళాల్సిన పరిస్థితి.. దీంతో తనకు అత్యంత నమ్మకస్తుడిగా భావించి పలనీస్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు.. జైలుకెళ్లిన కొద్దిరోజులకే సీన్ మొత్తం మారిపోయింది.. అప్పటిదాకా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ జైలుకెళ్లే ముందు ఉప ప్రధాన కార్యదర్శి గా తన మేనల్లుడు టిటివి దినకరన్ ని నియమించారు.. శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు సీఎం ఈపీఎస్.. జనరల్ బాడీ సమావేశంలో శశికలను, టిటివి ని పార్టీ నుంచి తొలగించారు.. ఆతర్వాత టిటివి దినకరన్ చే అమ్మా మక్కల్ మున్నెట్ర కలగం పార్టీని స్థాపించారు.. నాలుగేళ్లు గడిచాయి.. జైలు నుంచి విడుదలయ్యారు.. పొలిటికల్ గ్రాండ్ ఎంట్రీ కోసం పెద్ద ప్రణాళికే వేసింది చిన్నమ్మ.. జైలు నుంచి విడుదలై బెంగళూరు నుంచి వచ్చే క్రమంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన కొద్దిరోజులకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు శశికళ.. 8 నెలల పాటు మౌనంగా ఉన్న శశికళ ఇపుడు పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.. ఇందుకోసం తన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు.. అందులో ముందుగా జయలలిత స్మారక మందిరాన్ని సందర్శించారు.. జయ స్మారకానికి జైలు నుంచి వచ్చాక వెళ్లాలని అనుకున్నా అప్పట్లో అధికారంలో ఉన్న పళనిస్వామి అడ్డుకున్నారు.. మరమ్మతులు పేరుతో ఆంక్షలతో సాధ్యపడలేదు. ఇక ఏఐఏడీఎంకే ఏర్పాటై 50 వసంతాలు అయిన సందర్భంగా పార్టీ స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి.. ఈ సందర్భంగా శశికళ ఎంజీఆర్ స్మారక భవనానికి వెళ్లారు.. స్వర్ణోత్సవాల సందర్భంగా పార్టీ పాతాకావిష్కరణ చేశారు.. అందులో ఉన్న శిలాఫలకంపై శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి అని ఉండడం గమనార్హం.. ఇంతవరకు అలా ఉంటే.. అసలు విషయానికి వద్దాం.. పార్టీ నుంచి బహిష్కరణ కు గురైన శశికలకు మళ్లీ పార్టీలోని స్థానం ఉంటుందా… అందులోనూ మాజీ సీఎం పళనిస్వామి శశికలకు ఎంట్రీ లేదని పదేపదే నికశ్చిగా తేల్చేశారు.

అయినా సరే అలాంటి సందేహాలకు అవకాశం లేదంటోంది చిన్నమ్మ.. పార్టీ భవిష్యత్తు తనతోనే సాధ్యం అంటోంది.. అందుకోసం పెద్ద వ్యూహంతో ముందుకు వెళుతోంది.. ముందుగా పార్టీలో చీలిక తేవడం.. శశికళ కంటే ముందే చీలిక ప్రయత్నం తెచ్చిన ఓపిఎస్ ఆతర్వాత సర్దుబాటు ధోరణిలో పార్టీతో కలిసిపోయారు.. సీఎం కావాలని అనుకున్నా సాధ్యపడక డిప్యూటీ సీఎం అయ్యారు.. పరిస్థితుల ప్రభావం వల్ల అప్పట్లో సర్దుకున్నా పళనిస్వామితో పూర్తిగా ఇమడలేకపోతున్నారు ఓపిఎస్.. ఇపుడు చిన్నమ్మ ఓపిఎస్ టీమ్ కు గాలం వేస్తున్నారు.. ఎన్నికలకు ముందు కూడా శశికలకు అనుకూల వ్యాఖ్యలు చేశారు ఓపిఎస్.. దీంతో పాటు పార్టీలో ముఖ్యులతో చర్చలు జరుపుతోంది శశికళ టీమ్.. పార్టీలో మెజారిటీ నేతలను తమవైపు తిప్పుకోవడం ద్వారా పార్టీ కైవసం సాధ్యమని భావిస్తూ అందుకు తగ్గ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.. త్వరలో రాష్ట్ర పర్యటన చేయనున్న శశికళ తటస్థంగా ఉన్న నేతల్లో కదలిక తేవొచ్చన్న ఆలోచన కూడా… ఇక పళనిస్వామి బలహీనత కూడా తనకు కలిసి వస్తుందన్న ధీమా చిన్నమ్మది.. పళనిస్వామిది తమిళనాడులోని కొంగునాడు ప్రాంతం.. రాష్టం మొత్తంగా 65 స్థానాల్లో గెలుపొందగా ఈ ప్రాంతంలో మాత్రమే ఎడిఎంకే 40 స్థానాలను గెలుచుకుంది.. దక్షిణ, ఉత్తర తమిళనాడులో కనీస స్థానాలు కూడా రాలేదు.. కొంగునాడు కూడా డిఎంకేకి ముందు నుంచే పెద్దగా పట్టలేక పోవడంతో ఎడిఎంకే కి ఆస్థానాలు వచ్చాయి.. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎడిఎంకె తన ప్రభావాన్ని చూపలేకపోయింది.

అంటే పలనీస్వామి పార్టీని నడిపించలేరు అన్న ఆలోచన పార్టీలో ఒక వర్గంలో జరుగుతున్న చర్చ.. అందుకే చిన్నమ్మ పార్టీని సొంతం చేసుకోగలననే ధీమా చిన్నమ్మది.. ఇక పార్టీలో చిన్నమ్మకు అణువణువు తెలిసి ఉండడం.. జయలలిత ఉన్నప్పుడు పార్టీలో అన్నీ తానై వ్యవహరించిన శశికలకు భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలు రచించాలో బాగా తెలుసు అని ఆమెను సపోర్ట్ చేసే వర్గం మాట.. చిన్నమ్మ తన ప్రయత్నాలను మొదలు పెట్టింది.. అయినా ఎడిఎంకె ముఖ్య నేతల నుంచి కౌంటర్ రియాక్షన్ ఉండాల్సిన స్థాయిలో లేదు.. ఎందుకు మౌనంగా ఉన్నారనేది క్యాడర్ లో తీవ్రంగా జరుగుతున్న చర్చ.. దేశంలోని మిగిలిన ప్రాంతాలకంటే బిన్నంగా ఉండే తమిళ రాజకీయాల్లో ఎడిఎంకే పాలిటిక్స్ ఆది నుంచి మరింత ఆసక్తిగా ఉంటున్నాయి.. 1972లో డీఎంకే ని విభేదించి ఎంజీఆర్ ఎడిఎంకే స్థాపించారు.. 1989లో ఎంజీఆర్ మరణం తర్వాత జయలలిత పార్టీ సారథ్యం తనకే దక్కాలని పార్టీని చీల్చారు.. అనూహ్య పరిణామాలతో పార్టీని దక్కించుకున్నారు.. ఇక జయ మరణం తర్వాత జరుగుతోంది కూడా ఇదే.. ఇప్పటికే ఒకసారి పన్నీర్ సెల్వం ప్రయత్నించి సక్సెస్ కాలేకపోయినా ఇపుడు చిన్నమ్మ మాత్రం జయలలిత ఫార్ములాతో నాదే సక్సెస్ అనే ధీమాతో ఉన్నారు.. మొత్తానికి ఎడిఎంకెలో పార్టీ ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు ప్రతి సీన్ క్లైమాక్స్ లానే ఉందని చెప్పక తప్పదు.. ఇకపై ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచిచూడాల్సిందే.

చెన్నూరు మురళి, స్పెషల్ కరస్పాండెంట్, టీవీ9

Read also: Kesineni Nani: టీడీపీకి బిగ్ షాక్.. ఆఫీసులో చంద్రబాబు ఫోటోలు తీసేసిన కేశినేని నాని