నటనలోనూ, రాజకీయాల్లోనూ అన్నగారి రూటే సెపరేటు.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన యుగ పురుషుడు..

ప్రజలకి చేరువ కావాలనుకునే ప్రతివాళ్లూ కాలానికి, పార్టీలకి అతీతంగా ఎన్టీఆర్‌నే అనుకరించాల్సి వస్తోంది. పడవ నడిపించేవాడు నావికుడు. ప్రజల్ని నడిపించేవాడు నాయకుడు.

నటనలోనూ, రాజకీయాల్లోనూ అన్నగారి రూటే సెపరేటు.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన యుగ పురుషుడు..
Ntr
Follow us

| Edited By: Phani CH

Updated on: Jan 18, 2022 | 1:38 PM

Sr. NTR Death Anniversary: ప్రజలకి చేరువ కావాలనుకునే ప్రతివాళ్లూ కాలానికి, పార్టీలకి అతీతంగా ఎన్టీఆర్‌నే అనుకరించాల్సి వస్తోంది. పడవ నడిపించేవాడు నావికుడు. ప్రజల్ని నడిపించేవాడు నాయకుడు. మరి నాయకులకే దారి చూపించేవాడు. రాజకీయాలకే పాఠాలు నేర్పినవాడు. మామూలు నాయకుడనిపించుకోడు. కేవలం ఓ కథానాయకుడుగా మిగిలిపోడు. కృషి ఉంటే మనుషులు రుషులైనట్టు. తెరమీది కథానాయకుడు ప్రజాజీవితంలో మహానాయకుడవుతాడు. వెండి తెరమీంచి ప్రజల గుండెల్లోకి, అక్కడి నుంచి ప్రజాజీవితంలోకి అడుగుపెట్టి సిసలైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్‌. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ చరిత్ర అప్పటికీ ఇప్పటికీ చెరిగిపోనిది! మరపురానిది! ఈరోజు ఎన్టీఆర్‌ వర్ధంతి. ఆ మహానాయకుడిని పునశ్చరణ చేసుకుందాం!

ఆకర్షించే ఆహార్యం, మాటల్లో గాంభీర్యం, దిక్కులన్నీ ఏకమైనా ఎదిరించే ధీరత్వం.. ఠక్కున నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం.. ఇన్ని ఉంటే తప్ప ఒక వ్యక్తి ప్రజలకి ప్రియతమ నాయకుడు కాలేడు. ఎన్టీఆర్‌లో ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. అసలు ఎన్టీఆర్‌ గురించి చెప్పాలంటే మహా, మెగా లాంటి పదాలు సరిపోవు. అందుకే అప్పటికీ ఇప్పటికీ రాజకీయరంగంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడు. చూడగానే ఆకర్షించే రూపం. ఆ రూపానికి తగ్గ స్వరం. ఆజ్ఞాపించగలిగే అధినాయక స్వభావం. కుత్సత రాజకీయాలు తెలియని స్వచ్ఛమైన హృదయం. అన్నీ కలిస్తే ఎన్టీఆర్‌. ఓ కళాకారుడికి ఉండాల్సిన సున్నితమైన హృదయం. ప్రజానాయకుడిలో మూర్తీభవిస్తే, ప్రజల కష్టాల కథలు తెలిసిన కథానాయకుడు -రాజకీయ నాయకుడిగా ఆవిర్భవిస్తే. అదే ఎన్టీఆర్‌.

1

1981లో ఊటీలో సర్దార్‌ పాపారాయుడు షూటింగ్‌ టైమ్‌లో ఓ జర్నలిస్ట్‌ ఎన్టీఆర్‌ని అడిగాడు. త్వరలో మీ షష్టిపూర్తి జరగబోతోంది కదా? మీ జీవితానికి సంబంధించి ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకున్నారా అని! దానికి ఎన్టీఆర్‌ నవ్వాడు. నిమ్మకూరనే చిన్న ఊళ్లో పుట్టిన నన్ను ఈ స్థాయికి తీసుకువెళ్లిన జనానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇక్కడినుంచి నెలలో పదిహేనురోజులు షూటింగ్‌కి కేటాయిస్తే పదిహేనురోజులు ప్రజలకోసం కేటాయిస్తాను అని! అదే ప్రజాజీవితంలోకి ఎన్టీఆర్‌ తొలి అడుగు. ఓ రాజకీయ ప్రస్థానానికి అదే అంకురార్పణ. 1982 మార్చి 29న తెలుగుదేశం ఆవిర్భవించింది. ప్రాంతీయపార్టీల చరిత్రలోనే ఓ కొత్త శకానికి నాంది పలికింది. పాత చెవ్రోలెటు వ్యాను చైతన్య రథంగా మారింది. “తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!” అనే నినాదంతో.. కుమారుడు హరికృష్ణ సారథిగా ముందుకి కదిలింది. చైతన్యరథమే ప్రచార వేదిక. అదే నిత్య నివాసంగా మారిపోయింది. ఆ వేదికమీంచే ప్రజల్ని ఉత్తేజితుల్ని చేస్తూ తన సహజశైలిలో ఉద్వేగపూరితమై ఉపన్యాసాలిస్తూ ముందుకి సాగాడు ఎన్టీఆర్‌. ఓ కార్మికుడిలా ఖాకీదుస్తులు ధరించి, ఎండను లెక్కచేయక… ప్రజల అభిమానానికి దాసోహమంటూ అడుగడుగునా ఆగుతూ ఓ కర్మయోగిలా పనిచేసిన ఎన్టీఆర్‌ని తలుచుకుంటే … ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. రాష్ట్రచరిత్రలో అలాంటి చైతన్య యాత్ర మరొకటి లేదనిపిస్తుంది.

2

1983 జనవరి 7న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తెలుగుదేశం 199 సీట్లు సాధించింది. తెలుగుదేశం పార్టీ సాయంతో పోటీ చేసిన సంజయ్‌ విచార్‌మంచ్‌ (మేనకాగాంధీ పార్టీ) అయిదు స్థానాల్లో పోటీ చేసి నాలుగింటిలో విజయం సాధించింది. కాంగ్రెసుకి కేవలం అరవై మాత్రమే దక్కాయి. ఈ విజయం రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లోనే ఓ అపూర్వ విజయం. అభిమాన నటుల మీద ఆదరణ కురిపించడం కేవలం తమిళనాడుకే పరిమితం కాదని తెలుగువారు నిరూపించారు. పోటీ చేసింది ఎవరైనా ఎన్టీఆర్‌ బొమ్మ పెట్టుకుంటే చాలు సక్సెస్‌ వరించింది. తెలుగుదేశం జెండా రాష్ట్రం నలుమూలలా సగర్వంగా రెపరెపలాడింది. అఖిలాంధ్రకోటి అభిమానంతో ఎన్టీఆర్‌ని అన్నా అని పిలిచింది. సాక్షాత్తూ శ్రీరాముడికే పట్టాభిషేకం జరుగుతోందా అన్నంత గొప్పగా తారకరాముడి పదవీ స్వీకార ఉత్సవం జరిగింది. ప్రజానాయకుడి పదవీస్వీకారోత్సవం ఎప్పుడూ సంబరమే. అయితే కేవలం ధనబలం, రాజకీయ బలంతో ఎన్ని ఆర్భాటాలు చేసినా ఆ ఉత్సవానికి కళ రాదు. ప్రజల గుండెల్లోంచి సహజంగా పొంగుకొచ్చిన అభిమానం వెల్లువైతే ఎలా ఉంటుందో… ఆ టైమ్‌లో రాష్ట్రం ప్రత్యక్షంగా చూసింది. స్వచ్ఛమైన తెలుగువాడి అభిమానానికి అంతగా పాత్రుడైన ఎన్టీఆర్‌ ధన్యుడు. ఎన్టీఆర్‌ సినిమా తెరమీద కథానాయకుడు మాత్రమే కాదు… కొత్తతరం రాజకీయాలకి తెరచాపలెత్తిన ప్రజానాయకుడిగా కూడా విజయం సాధించాడు. ఆత్మగౌరవ నినాదంతో అధికారంలోకి వచ్చాక, తెలుగు వైభవం కోసం ఎంతగానో కృషి చేశాడు. నిర్ణయాలు తీసుకున్న తరవాత ఎంతటి అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గని పోరాట పటిమ ప్రదర్శించాడు. తెరమీదే కాదు… నిజజీవితంలోనూ తన నాయకత్వ లక్షణాలు నిరూపించాడు. శిఖరాన్ని అధిరోహించడం వేరు. అధిరోహించిన శిఖరాన్నుంచి అకస్మాత్తుగా జారిపడ్డప్పుడు హతాశుడైపోకుండా … తిరిగి పట్టుదలతో శిఖరాగ్రానికి చేరుకోవడం వేరు. నాయకుడికి ఉండాల్సిన గొప్ప లక్షణం అది. 1984 లో నాదెండ్ల భాస్కరరావు కొందరు ఎమ్మెల్యేల మద్దతుతో తానే ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్నాడు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటి ఈ చర్యకి అప్పటి గవర్నరు రాంలాల్ సహకరించాడు. అయితే ఈ హఠాత్పరిణామానికి రామారావు కుంగిపోలేదు. తిరిగి జనం లోకి వెళ్లాడు. జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో ఉద్యమం సాగించాడు. ఒక్క కాంగ్రెస్‌ చేసిన ఈ కుట్రని వ్యతిరేకించడంలో అన్ని పక్షాలూ ఎన్టీఆర్‌కి మద్దతునిచ్చాయి. సెప్టెంబర్ 16 నాటికి ఎన్టీఆర్‌ తిరిగి ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠించాడు. అక్కడితో విజయం ఆగిపోలేదు. నాదెండ్ల కుట్ర తరవాత శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి పొందాలనుకున్నాడు ఎన్టీఆర్‌. మార్చి 1985లో ప్రజలతీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాడు. గతంలో కంటే ఎక్కువగా ఏకంగా 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చాడు. తొమ్మిదినెలల్లో పార్టీపెట్టి 199 సీట్లు సాధించడం ఒక ఘనత అయితే … కూలిపోయిందనుకున్న ప్రభుత్వాన్ని అంతకంటే ఘనతరంగా తిరిగి పీఠం ఎక్కించడం మరో ఘనత. ఇలాంటి సంచలనాత్మకమైన విజయాలు మరో నాయకుడి డిక్షనరీలో కనిపించవు.అందుకే ఎన్టీఆర్‌ ఈజ్‌ ఎన్టీఆర్‌.

సినిమా హీరోలు కష్టాలు తీరుస్తారు. కానీ అది తెరమీదే! తెరమీంచి ప్రజల్లోకి నడిచి వచ్చి… ఆ కలని నిజం చేసిన ఘనుడు ఎన్టీఆర్‌. తెరమీద విష్ణువులా అలవైకుంఠపురంబులో ఆ మూల సౌధంబులో కనిపించాడేమోగానీ … రాజకీయానికి వచ్చేసరికి ప్రజాజీవితంలోకి చొచ్చుకుపోయాడు ఎన్టీఆర్‌. పేదవాడి కష్టాలేమిటో తెలిసిన ప్రజానాయకుడిగా కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. అభివృద్ధిని అంకెల్లో మాత్రమే చూపించే పద్ధతికి స్వస్తి చెప్పి… పేదవాడికి అక్షరాలా ఉపయోగపడే పథకాలకి శ్రీకారం చుట్టాడు. రెండు రూపాయలకి కిలో బియ్యం… కిలో బియ్యం కేవలం రెండే రూపాయలకి ఇవ్వాలన్న ఆలోచన ఎవరికి వస్తుంది? పేదవాడి అవసరం తెలిసిన వాడికి! ఆకలంటే ఏమిటో ఎరిగిన వాడికి! ఓట్ల కోసం వేసే రాజకీయ పథకంలా పుట్టిన ఆలోచన కాదది! పాలకుడి నిర్ణయాలు ప్రజలకి నేరుగా ఉపయోగపడాలన్న ఆదర్శంతో తీసుకున్న నిర్ణయం అది! అందుకే అది జనం లోకి వెళ్లింది. వాళ్ల హృదయాలు కొల్లగొట్టింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఈ పథకాన్ని కొనసాగిస్తూనే రావడం ఎన్టీఆర్‌ పట్టుదలకీ ప్రజాసంక్షేమ దృష్టికీ నిదర్శనం. పేదలకి పూరి గుడిసెలో తాత్కాలిక నివాసాలో ఏర్పరచుకునేందుకు ప్రభుత్వం అంతో ఇంతో సాయం చేయడం ఆనవాయితీ. అయితే పేదవాడికి పక్కా ఇల్లు కట్టించాలన్న ఆలోచన ఎన్టీఆర్‌ది! ప్రతి మనిషికీ కూడూ గూడూ గుడ్డా అనే కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత పాలకుడికి ఉందన్న ఆదర్శాన్ని ఎన్టీఆర్‌ నమ్మాడు. అందుకే జనతావస్త్రాల్ని అందుబాటులోకి తెచ్చాడు. తెలుగు సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే చీరలూ దోవతుల్ని సామాన్యుడికి చేరువ చేశాడు.

3

ఇవి మాత్రమే కాదు.. ప్రజలకోసం ఎన్నో పథకాలు … ఎన్నో ఆలోచనలు.. ఎన్నో నిర్ణయాలు.. ఎన్టీఆర్‌ ఎక్స్‌ క్లూజివ్‌ పేరుతో లిస్ట్‌ చేస్తే… ఎన్నో కనిపిస్తాయి. రాష్ట్రంలో వేళ్లూనుకుపోయిన కాంగ్రెస్‌ పార్టీకి చెక్‌ చెప్పిన తొలి నాయకుడు ఎన్టీఆర్‌. మహిళలకి ఆస్తి హక్కు ఉండాలని చట్టం తెచ్చినా… తెలుగుగంగ ప్రాజెక్టులో రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చేందుకు పట్టుబట్టినా.. బీసీలకు రిజర్వేషన్లు కల్పించినా ఆ ఘనత ఎన్టీఆర్‌దే. ఎన్టీఆర్‌ అంటే తెలుగుకి ప్రతీక. ఎన్టీఆర్‌ అంటే ఆత్మగౌరవానికి నిలువుటద్దం. ఒకప్పుడు.. తెలుగు రాజధానిలో బస్సులకి తెలుగు బోర్డులు కూడా లేని దుస్థితి… ఆ స్థితి నుంచి బయటికి తెచ్చి … తెలుగు వైభవాన్ని చాటి చెప్పే మహామహుల విగ్రహాల్ని కొలువుదీర్చిన ఘనత ఎన్టీఆర్‌దే! తెలుగు, తమిళం కూడా తేడా తెలియక దక్షిణాదివాళ్లందరినీ ఒకే గాటన కట్టేసి … మద్రాసీలుగా పిలిచే ఉత్తరాది నిర్లక్ష్యానికి దీటైన ప్రత్యుత్తరాన్నిచ్చింది ఎన్టీఆరే! తెలుగువాడి ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో సగర్వంగా నిలబెట్టిన ఘనుడు ఎన్టీఆర్‌. 1991 లో నంద్యాల లోక్‌సభ ఉప ఎన్నికలలో కాంగ్రెసు తరపున అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు నిలబడితే… తోటి తెలుగువాడిగా ఆయనకి గౌరవం ఇస్తూ.. అక్కడ ఎవరినీ పోటీగా నిలబెట్టలేదు ఎన్టీఆర్‌. నిజమైన తెలుగువాడు ఎలా ఉండాలో చాటి చెప్పాడు కాబట్టే … ఇప్పటికీ తెలుగు గుండెల్లో ఎన్టీఆర్‌ కొలువై ఉండగలిగాడు.

రాష్ట్రం .. దేశం… ఇవి భౌగోళిక భేదాలే తప్ప… ప్రజల మనసు తెలిసిన ప్రజానాయకుడికి ఎల్లలు ఎవరూ చెప్పలేరు. ప్రతిభకి పరిధులు నిర్ణయించలేరు. ఆత్మగౌరవానికి హద్దులు గీయలేరు. ప్రాంతీయ పార్టీ తెలుగుదేశంతో రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్‌ తరవాతికాలంలో జాతీయ స్థాయికీ ఎదిగాడు. కాంగ్రెస్‌కి సమాధానం చెప్పగల దీటైన ప్రత్యామ్నాయాన్ని కూడగట్టాడు. బడాబడా నాయకులెందరినో ఏకతాటి మీదకి తెచ్చాడు. ప్రధాని పదవిని కూడా అలంకరించగల స్థాయికి పెరిగాడు.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా 1977 లో అఖండ విజయం సాధించిన జనతా పార్టీ … 1980 మధ్యంతర ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న జనతాపార్టీ కుప్పకూలిపోవడం కాంగ్రెస్‌ వ్యతిరేక ప్రతిపక్షాలకి పెద్ద దెబ్బ. ఆ సమయంలో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఏకం కావడానికి ఓ వేదిక అవసరమయింది. వారందరినీ ఒక తాటిమీద నడిపించే నాయకత్వం తప్పనిసరి అయింది. నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న ఎన్టీఆర్‌ సారథిగా బాధ్యత వహించాడు. 1984 లో విజయవాడలో ప్రతిపక్షాల కాన్‌క్లేవ్‌ నిర్వహించినా… 1987 లో నేషనల్‌ ఫ్రంట్‌ స్థాపించినా అది ఎన్టీఆర్‌కే చెల్లింది. ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో అత్యంత కీలక పాత్ర వహించడం ఎన్టీఆర్‌తోనే మొదలయిందని చెప్పాలి. రాజీవ్‌ బోఫోర్స్‌ కుంభకోణ వివాదంలో ప్రతిపక్ష సభ్యులు… పార్టీలకి అతీతంగా పార్లమెంట్‌ సభ్యత్వానికి 105 మంది మూకుమ్మడి రాజీనామా చేశారు. ప్రతిపక్షాల మధ్య జాతీయ స్థాయిలో ఇంతటి ఐక్యతని తెచ్చిన ఘనుడు ఎన్టీఆరే! 1984 ఇందిరహత్య తరవాత పార్లమెంట్‌ ఎలక్షన్లలో దేశమంతగా ఇందిరా సానుభూతి పవనాలు వీచినా ఎపిలో మాత్రం ఎన్టీఆర్‌ హవాయే నడిచింది. పార్లమెంట్‌లో ఓ ప్రాంతీయ పార్టీని ప్రధాన ప్రతిపక్షం హోదాలో కూర్చోబెట్టిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కింది.

అసలు జాతీయ రాజకీయాల వెంట ఎన్టీఆర్‌ నడవడం కాదు… కేంద్రమే ఎన్నోసార్లు ఎన్టీఆర్‌ని అనుసరించింది. దీనికి ఉదాహరణలు ఎన్నో! డిస్టంట్‌ ఎడ్యుకేషన్‌ యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ మోడల్నే కేంద్రం ఆదర్శంగా తీసుకుంది. నేషనల్‌ లెవెల్లో దీన్ని ఎడాప్ట్‌ చేసుకుంది. అలాగే వ్యవసాయ బావుల శ్లాబ్‌ సిస్టమ్‌ వల్ల కరెంట్‌ బిల్స్‌ తగ్గాయి. పంటలకి నీరు లభించింది. రైతు ఊపిరి పీల్చుకున్నాడు. తరవాతి కాలంలో దీన్నీ కేంద్రం అనుకరించింది. మహిళలకి ఆస్తి హక్కు కల్పించాలంటూ ఎన్టీఆర్‌ తొలి అడుగు వేశాడు. తరవాత ఐదేళ్లకి దేశవ్యాప్తంగా అది ఎప్లై అయింది. ఎన్టీఆర్‌ సాధించిన విజయాలు, ప్రారంభించిన పథకాలు ఇన్నీ అన్నీ కావు. స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్లు… బీసీ లకి రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది ఎన్టీఆరే! గుజరాత్‌ తరవాత సంపూర్ణ మద్య నిషేధం పాటించేందుకు తీవ్రప్రయత్నం చేసిన రాష్ట్రం మనదే. ఎన్టీఆర్‌ పట్టుదలే ఇందుకు కారణం. ఎన్టీఆర్‌ చనిపోయే వరకూ మద్యనిషేధం అమల్లో ఉంది… కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేయని వాడే సిసలైన నాయకుడు. రెవెన్యూ సిస్టమ్‌లో మార్పులు చేసే సాహసం ఎన్టీఆర్‌ మాత్రమే చేయగలిగాడు. గ్రామపాలనలో మార్పులు తెచ్చి విలేజ్‌ అసిస్టెంట్ లతో కొత్త రెవెన్యూ విధానానికి రూపకల్పన చేశాడు ఎన్టీఆర్‌…

4

ఒకే తాలూకాలో వందల కొద్దీ గ్రామాలుండడం వల్ల పరిపాలన సంక్లిష్టం అవుతుండడాన్ని ఎన్టీఆర్‌ గమనించాడు. అందుకే ఆయన మండల వ్యవస్థకి శ్రీకారం చుట్టాడు. విద్యారంగంలో గురుకుల పాఠశాలల కాన్సెప్ట్‌ కూడా ఎన్టీఆర్‌దే! తిరుపతిలో పద్మావతీ యూనివర్సిటీ స్థాపించి… ఇండియాలో మొదటి మహిళా యూనివర్సిటీకి శ్రీకారం చుట్టిందీ ఎన్టీఆరే! ఇలా ఒకటేమిటి… ఎన్నిటికో ఆద్యుడు ఎన్టీఆర్‌! ఎన్టీఆర్‌ వ్యక్తిత్వం ఒకరు నేర్పితే వచ్చింది కాదు. పట్టుదలకీ క్రమశిక్షణకీ మారుపేరైన ఎన్టీఆర్‌… కొన్ని ప్రత్యేకమైన ఆశయాలు, ఆదర్శాలు కలిగి ఉండేవాడు. ప్రజలపట్లా పరిపాలన పట్లా ఓ విశిష్టమైన అవుట్‌లుక్‌ ఎన్టీఆర్‌ది! ప్రజలకి చేరువకావాలనుకునే ప్రతివాళ్లూ కాలానికి పార్టీలకి అతీతంగా ఎన్టీఆర్‌నే అనుకరించాల్సి వస్తోంది.అందుకే ఎన్టీఆర్‌కి మహా మెగా లాంటి పదాలేవీ సరిపోవు. ప్రజలకి నాయకుడు ఎలా దగ్గరకావాలో, వారిలో ఒకడిగా ఎలా కలిసిపోవాలో మొదటిసారిగా చెప్పింది ఎన్టీఆరే! రాజకీయాలు ప్రజలకి దూరం కాదనీ, నాయకులంటే అందరికీ దూరంగా ఉండే అజ్ఞాత వ్యక్తులు కాదనీ ఎన్టీఆర్‌ చాటి చెప్పాడు. ప్రజాభిమానం వెల్లువైతే ఎలా ఉంటుందో, ప్రాక్టికల్‌గా రాజకీయాలు ప్రజల్లోకి రావడం అంటే ఏమిటో ఎన్టీఆర్‌ చైతన్యరథయాత్ర తెలియజెప్పింది. అందుకే తరవాతి కాలంలో దేశంలో జరిగిన రథయాత్రలకీ, పాదయాత్రలకీ అదే స్ఫూర్తిగా నిలిచింది.

కాలాలు మారాయి. పార్టీలు మారాయి. విలువలు మారాయి. విధానాలు మారాయి. కానీ ఎన్టీఆర్‌ పథకాలకి మాత్రం ఛార్మ్‌ తగ్గిపోలేదు. ప్రజాసేవా పథకాలు ప్రజాకర్షణ పథకాలుగా రూపుమార్చుకునే కాలం వచ్చినా ఎన్టీఆర్‌ పథకానికి పేరు మార్చే సాహసం ఎవరూ చేయలేదు. రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రతిపక్షాలు కూడా హైజాక్‌ చేశాయని అంటారుగానీ.. పరోక్షంగా అది ఎన్టీఆర్‌ని ఎంతగానో గౌరవించాయని చెప్పాలి. ఎన్టీఆర్‌కే కాదు, ఎన్టీఆర్‌ పథకాలకీ విజయం తథ్యం అని ప్రజలు నిరూపించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచినా పరోక్షంగా ఆ విజయం ఎన్టీఆర్‌ పథకాలకే దక్కుతుంది. పేదవాడి ఆకలి తీర్చినా, ఉండేందుకు పక్కా ఇళ్లు కట్టించినా, మహిళా సంక్షేమం కోసం కృషి చేసినా అన్నీ ఎన్టీఆర్‌ ఆలోచనలే! ఆ నాయకుడి ఆదర్శాలే! నిర్ణయాలు తీసుకోవడంలో గానీ… అనుకున్నదాన్ని ఆచరించడంలో గానీ ఎన్టీఆర్‌ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. రాబోయే ప్రమాదాల్ని లెక్కచేయలేదు. చంద్రగ్రహణాలు చుట్టుముట్టినా చివరి ఘట్టం వరకూ సింహంలా బతికాడు. తరతరాలపాటు నిలిచిపోయేంత పేరు తెచ్చుకుని తరాలు మారినా తన పేరే చెప్పుకోవాల్సిన రీతిలో రాజసంగా.. గంభీరంగా కనుమరుగయ్యాడు. ఎన్‌.. టీ.. ఆర్‌… తెలుగువాడు ఎంత తెలుగువాడైనా… ఈ మూడు ఇంగ్లిష్‌ అక్షరాలూ మరిచిపోడు… తెలుగువారి గుండెల్లో కథానాయకుడూ ప్రజానాయకుడూ ఎన్టీఆరే! తెరమీద ఎన్టీఆర్‌ మాస్‌ హీరో. అందుకేనేమో… రాజకీయాల్నీ మాస్‌ లోకి తేగలిగాడు. పాలనని ప్రజలకి చేరువ చేశాడు. నిజమైన ప్రజానాయకుడనిపించుకున్నాడు. తెలుగునీ తెలుగువాడినీ గౌరవించాడు. అందుకే.. తెలుగు గుండెల్లో నిండుగా నిలిచిపోయాడు.

Also Read:

Naga Chaitanya: సమంతపై నాగచైతన్య షాకింగ్‌ కామెంట్స్‌ !! ఆ విషయంలో సమంతే బెస్ట్‌ అంటున్న చై !! షాక్‌లో ప్యాన్స్‌ !! వీడియో

Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో