Russia-Ukraine Crisis: రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం అనివార్యమా? యుద్ధం జరిగితే భారత్‌పై ప్రభావం ఉంటుందా?
Russia - Ukraine Conflict: రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం వస్తుందా? ఉక్రెయిన్ పై రష్యా దాడి అనివార్యమా? అదే జరిగితే అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాలు ఊరుకుంటాయా..? ఉక్రెయిన్ కు సాయం చేయవా..?
Russia-Ukraine Conflict: రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం వస్తుందా? ఉక్రెయిన్ పై రష్యా దాడి అనివార్యమా? అదే జరిగితే అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాలు ఊరుకుంటాయా..? ఉక్రెయిన్ కు సాయం చేయవా..? ఒకవేళ యుద్ధం వస్తే మన దేశం ఏం చేస్తుంది? భారత్ లో పెట్రోల్, వంట నూనెల ధరలు పెరుగుతాయా? వాణిజ్య రంగం పై దాని ప్రభావం ఎంత వరకు ఉంటుంది. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా ఏ మేరకు ఉండొచ్చనే చర్చ సాగుతోంది. కాస్తా పేపర్ నాలెడ్జ్ ఉన్న వారు వాకింగ్ లో, టీ స్టాల్స్ వద్ద.. మరో చోట ఇప్పుడే ఈ అంశం గురించే చర్చించుకుంటున్నారు. కొవిడ్ ప్రభావం తగ్గడంతో ఇప్పుడిప్పుడే బజార్లకు వస్తున్నారు జనాలు. ఇటు దేశ, రాష్ట్ర రాజకీయాలతో పాటు..అటు ప్రపంచ యుద్ధం పైనా ఎవరి వాదన వారు వినిపించడం ఆసక్తికరమే. గల్ఫ్ యుద్ధం, ఆప్ఘాన్ యుద్ధం వార్తలు చూసిన వాళ్లు కావడంతో రాబోయే పరిస్థితులను అంచనా వేసి ఆందోళన చెందడం సాధారణ విషయమే.
ముక్కలైన సోవియట్ యూనియన్…
పెరిస్ట్రాటికా, గ్లాస్ నోస్త్ సంస్కరణలకు వ్యతిరేకంగా యునైటెడ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ ( యుఎస్ఎస్ఆర్)లో ఉద్యమాలు ఎగిశాయి. చివరకు అవి యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయి డిసెంబర్ 31, 1991లో 15 స్వతంత్ర దేశాలు ఏర్పడేందుకు దారితీశాయి. ఆర్మేనియా, అజర్ బైజాన్, బెలారస్, ఈస్తోనియా, జార్జియా, ఖజికిస్తాన్, కిర్గిజిస్తాన్, లాత్వియా, లిధునియా, మోల్డోవా, రష్యా, తజికిస్తాన్, తుర్క్ మినిస్తాన్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్ దేశాలుగా అవతరించినా అక్కడ ఆధిపత్యం దాదాపు రష్యాదే. ప్రపంచంలో అమెరికాకు ధీటుగా నిలిచే దేశంగా గుర్తింపు ఉన్న రష్యాకు చెక్ పెట్టాలంటే ఆ ప్రాంతంలో పాగా వేయాలనేది అమెరికా ఆలోచన. అందుకే నాటో కూటమిలో చేరాలని ఉక్రెయిన్ ను ఒత్తిడి తెస్తోంది. ఆ కూటమిలో చేరితే ఊరుకునేది లేదని రష్యా బలంగా హెచ్చరించింది. ఫలితంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఏ క్షణమైనా ఉక్రెయిన్ పై రష్యా బలగాలు దాడులు చేసే అవకాశముంది. ఆప్ఘనిస్తాన్ లో 20 ఏళ్ల పాటు తమ సైనికులను ఉంచిన అమెరికా…హఠాత్తుగా అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఫలితంగా తిరిగి ఉగ్రవాదుల చేతుల్లోకి ఆ దేశం వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉక్రెయిన్ కు కూడా మేము ఉన్నాం. మీకెందుకు అని భరోసా ఇస్తున్నా…నమ్మే పరిస్థితుల్లో ఆదేశం లేదు. ఫలితంగా రష్యాకు లొంగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ సైనిక బలం, ఆయుధ సంపత్తి చాలా తక్కువ.
మిన్క్స్ ఒప్పందం… రష్యా, ఉక్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ మధ్య మిన్స్క్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోకూడదని, రష్యా అనుకూల వేర్పాటువాద ప్రాంతం డాన్‌బాస్ నుంచి రష్యన్ దళాల ఉపసంహరించుకోవాలని ఉంది. అమెరికా కూడా ఈ కూటమిలో భాగమే. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా ఈ ఒప్పందాన్ని ఆమోదించింది. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని పునరుద్ధరించాలి. సైనిక జోక్యం వద్దు. డాన్‌బాస్‌కు పూర్తి స్వయంప్రతిపత్తి కల్పించాలి. రష్యాతో సరిహద్దు ఆనుకుని ఉన్న ప్రాంతంతో సహా ఉక్రెయిన్ అంతటా అధికార వికేంద్రీకరణ జరపాలనేది ఒప్పంద సారాంశం. ఈ ఒప్పందాన్ని అమలు చేయాలని రష్యా కోరుతోంది. ఉక్రెయిన్ కాదంటోంది. ఇందుకు అమెరికా మద్దతు పలుకుతోంది. అదే అసలు సంక్షోభానికి కారణం.
శాంతియుత వాతావరణం కోసం ప్రయత్నిస్తున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ పైకి ప్రకటిస్తున్నాడు. కానీ 24 గంటలు గడవకముందే లుహాన్స్, డోనెస్క్ లు ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తూ సంతకాలు చేయడంతో బిత్తరపోవడం ఉక్రెయిన్ తో పాటు..నాటో దేశాల వంతైంది.
ఆ దేశాలు ఏం చేస్తున్నాయంటే… రష్యాపై అమెరికా అర్థిక ఆంక్షలు విధించింది. రష్యా అతిపెద్ద ఆర్థిక సంస్థలు వెబ్, సైనిక బ్యాంకుపై ఆంక్షలు విధించామన్నారు అధ్యక్షుడు జో బైడెన్. రష్యాపై ఇప్పటికే జర్మనీ, బ్రిటన్ ఆర్థికపరమైన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తుందంటున్నారు అమెరికా అధ్యక్షుడు జో బెడెన్. ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించాలని పుతిన్ చూస్తున్నాడు. వెస్ట్ దేశాలతో రష్యాకు ఉన్న వ్యాపార, వాణిజ్య సంబంధాలను నిలిపివేశామని చెప్పారాయన. రష్యాలోని ప్రముఖులపై కూడా ఆంక్షలు విధింపు అమలవుతోంది. ఉక్రెయిన్‌కు అన్నివిధాలా సహాయం అందిస్తామన్నారు యూఎస్ బాస్. ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యాతో స్నేహ సంబంధాలకు జర్మనీ కటీఫ్ చెప్పింది. రష్యా నుంచి తమ దేశానికి గ్యాస్ సరఫరాకు చేపట్టిన నార్డ్ స్ట్రీమ్-2 గ్యాస్ పైప్‌లైన్ సర్టిఫికేషన్ ప్రాసెస్ నిలిపేస్తామని జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కూల్జ్ చెప్పారు. రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తే ఆంక్షలు తప్పవంటోంది జర్మనీ. రష్యాకు చెందిన ఐదు బ్యాంకులపై ఆంక్షలు పెట్టామన్నారు బ్రిటన్ ప్రధాని బోరిక్ జాన్సన్. రోషియా బ్యాంక్, ఐఎస్ బ్యాంక్, జనరల్ బ్యాంక్, ప్రామ్స్‌వ్యాజ్ బ్యాంక్, బ్లాక్ సీ బ్యాంకులతోపాటు రష్యాకు చెందిన ముగ్గురు అత్యంత ధనవంతులపై కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి.
ఎప్పుడు ఏం జరిగిందంటే…
2012లో EUలో కలవకుండా అడ్డుకునేలా రష్యా ప్రయత్నం 2013లో EU నుంచి బయటకు వచ్చేలా చేసిన రష్యా 2014లో రష్యా ఆధీనంలో క్రిమియా రీజియన్ 2021 నవంబర్- సరిహద్దుల్లో రష్యా బలగాలు 2021 డిసెంబర్ 7- ఆంక్షలు తప్పవని రష్యాకు అమెరికా వార్నింగ్ 2021 డిసెంబర్15 – చర్చలకు డ్రాఫ్ట్ ప్రకటించిన రష్యా 2021 డిసెంబర్ 30 – బైడన్-పుతిన్ 50 నిమిషాల ఫోన్ కాల్ 2022 జనవరి 10 – జనీవాలో అమెరికా-రష్యా ద్వైపాక్షిక చర్చలు 2022 జనవరి 31 – ఐక్యరాజ్యసమితి ఓపెన్ చర్చలకు ఓకే 2022 ఫిబ్రవరి 7 – పుతిన్‌తో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ భేటి 2022 ఫిబ్రవరి 10- యూకే మధ్యవర్తిత్వ చర్చలు 2022 ఫిబ్రవరి 11 – పెంటగాన్ నుంచి యూరోప్‌కు 5వేల సైనిక బలగం 2022 ఫిబ్రవరి 13- లక్షా 30వేల బలగాలను దింపిన రష్యా 2022 ఫిబ్రవరి 14 – మరోసారి రష్యాకు సీరియస్ వార్నింగ్ 2022 ఫిబ్రవరి 20 చర్చల నుంచి వైదొలిగిన దేశాలు 2022 పిబ్రవరి 22 -డోనెస్క్, లుహాన్స్ స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తింపు 2022 ఫిబ్వరి23- రష్యా పై అమెరికా, జర్మనీ, బ్రిటన్ దేశాల ఆంక్షలు
బలాలు, బలగాలు (ఉక్రెయిన్ – రష్యా) ట్రూప్స్ – 11 లక్షలు – 29 లక్షలు ఎటాక్ ఎయిర్ క్రాఫ్ట్‌లు – 98 – 1511 ఎటాక్ చోపర్స్ 34 – 544 ట్యాంకులు 2596 – 12,240 ఆర్మడ్ వాహనాలు 12,303 – 30,122
యుద్ధమే వస్తే ఎంత కష్టం.. ఎంత నష్టం
ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం వస్తే ఆయిల్ సంక్షోభం రానుంది. క్రూడాయిల్ ధర 150 డాలర్లకు చేరే అవకాసముంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభానికి దారి తీయవచ్చు. అణ్వాయుధ యుద్ధానికి తెరతీసే అవకాశాలను కొట్టిపారేయలేదు. 1945లో జపాన్ లోని యురేషిమా, నాగసాకి నగరాల పై అమెరికా అణుబాంబులను ప్రయోగించిన సంగతి తెలిసిందే. అణుసామర్థ్యం ఉన్న 9 దేశాల్లో రష్యా ఒకటి. కాబట్టి అవసరాన్ని బట్టి తమ అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాన్ని తీయవచ్చు. కానీ అది అంత తేలికగా జరిగే వ్యవహారం కాదనేది వాస్తవం. లక్షల మంది పౌరుల భద్రత ఇప్పుడు ప్రమాదంలో పొంచి ఉంది.
చరిత్ర చెబుతున్న నిజాలు
2014 నుంచి ఉక్రెయిన్ లో అంతర్యుద్ధం జరిగింది. ఫలితంగా 14వేల మంది చనిపోగా…20 లక్షల మంది పౌరులు వలస వెళ్లాల్సి వచ్చింది. ఫలితంగా యుద్ధం కంటే శాంతియుతంగా వెళితేనే మేలు.
ఆఫ్గనిస్తాన్ లో 20 ఏళ్ల అంతర్యుద్ధంతో 2లక్షల డాలర్లకు పైగా ఖర్చు అయింది అమెరికాకు. 2,442 మంది అమెరికా సైనికులు బలి కాగా…3,800 భద్రతా సిబ్బంది చనిపోయారు. నాటో బలగాలు 144 మంది చనిపోగా…69వేల మంది ఆఫ్గన్ బలగాలు మృత్యువాత పడ్డాయి. వేల మంది పౌరులు చనిపోగా..లక్షలమంది వలస పోయిన పరిస్థితిని చూస్తున్నాం. అయినా ఇంకా అక్కడ అశాంతి కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితి ఇటు ఉక్రెయిన్, అటు రష్యాలో రాకూడదనేది మేధావుల సూచన.
అక్కడ యుద్ధం.. ఇక్కడ జ్వరం
ఇండో-ఉక్రెయిన్ బంధం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ఏసియా పసిఫిక్‌లోనే అతి పెద్ద దిగుమతి దేశంగా ఇండియా ఉంది. ఉక్రెయిన్ కు ఉన్న దేశాల్లో అతిపెద్ద దిగుమతి దేశం ఇదే. 2019-20 మధ్య దాదాపు 20 వేల కోట్ల రూపాయల వ్యాపారం ఇరు దేశాల మధ్య సాగింది. భారత్ నుంచి ఫార్మా, రియాక్టర్స్ ఎగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన రెడ్డీస్ ల్యాబ్, సన్, ర్యాన్‌బ్యాక్సీ కంపెనీ ఆఫీసులు ఉక్రెయిన్ లో ఉన్నాయి. అక్కడకు మన ఎగుమతులు ఎక్కువే. జర్మనీ, ఫ్రాన్స్ తర్వాత ఎక్కువగా ఫార్మా దిగుమతులను భారత్ నుంచే తీసుకుంటోంది ఉక్రెయిన్. అదే సమయంలో ఉక్రెయిన్ నుంచి ఇండియాకు వంట నూనెలు బాగా దిగుమతి అవుతాయి. భారత్ కు వచ్చే 74శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్ నుంచే వస్తోంది. అంతే కాదు..ప్రపంచ మార్కెట్ల నుంచి ఆయిల్ సరఫరా కొరత ఉండటంతో ధరల పై ప్రభావం పడనుంది. పాలిమర్స్, మెటలర్జికల్స్, ప్లాస్టిక్ దిగుమతులు తగ్గి ధరలు పెరిగే వీలుంది. రష్యా, యూరోప్ దేశాలతో సంబంధాలు కట్ అవుతాయి…
యుద్ధం రాకముందే చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ క్రూడాయిల్ ఉత్పత్తిలో 13 శాతం వాటా రష్యాదే. రోజుకు 9.7 మిలియన్ పీపాల చమురు ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచ గ్యాస్ సరఫరాల్లో రష్యా వాటా 40 శాతం ఉంది. ఇప్పుడు యుద్ధం వస్తే చమురు పీపాకు 150 డాలర్లు చేరే వీలుంది. అంటే ఒకేసారి పీపా 90 డాలర్ల నుంచి 150కి పైగా చేరడం ఇబ్బంది కరమే.
ఆర్థికంగాను భారత్ కు ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా ద్రవ్యోల్భణం పెరిగితే ఇబ్బందినే. భారత్ లో జనవరి నెల ద్రవ్యోల్భణం 6.01 గా నమోదైంది. యుద్ధం వస్తే రూపాయి మరింతగా పతనమై చమురు ధరలు పెరిగి ఆర్థిక నష్టం జరగుతుంది. వ్యాపార, వాణిజ్య రంగాల పైనా ప్రభావం పడనుంది. భారత్ దిగుమతుల్లో రష్యా వాటా1.4 శాతమే అయినా ద్వైపాక్షిక పెట్టుబడులు రూ.3.75 లక్షల కోట్లు ఉండాలనే లక్ష్యం నెరవేరదు. అంతే కాదు ఆయుధాల పైనా ప్రభావం చూపనుంది. మన ఇప్పుడు భారత్ లోనే ఆయుధాలను ఉత్పత్తి చేసుకుంటున్నా…భారత ఆయుధాల్లో 50 శాతం రష్యా నుంచి దిగుమతి అవుతున్నాయి. గగనతల రక్షణ, న్యూక్లియర్ సబ్ మైరెన్లు దిగుమతి ఇప్పటికీ కొనసాగుతోంది.
స్పెషల్ ఫ్లైట్స్
సాధారణ విమాన సర్వీసులు రద్దు చేసింది ఉక్రెయిన్. ఫలితంగా అక్కడున్న 20వేల మంది భారతీయ విద్యార్థుల తరలింపు కోసం మూడు వందేభారత్ మిషన్ ఫ్లయిట్స్ రంగంలోకి దిగాయి. ఫిబ్రవరి22, 24, 26న ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయడంతో పాటు విదేశాంగ శాఖ హెల్ప్ లైన్ +91 11 23014104 ను పెట్టడం ఆసక్తికరం.
అటు ఇటు కాని…
యలపటి ఎద్దును అదిలించలేదు. దాపటి ఎద్దును కదిలించలేదు అనే సామెతలా మారింది భారత్ పరిస్థితి. ఉక్రెయిన్, రష్యాలో ఎవరి పక్షం లేదు భారత్. ఎటువైపు మొగ్గు చూపినా మిగతా దేశంతో దౌత్య సంబంధాలు దెబ్బతింటాయి. ఇరుదేశాలతోను బలీయమైన సంబంధాలు ఉన్నాయి భారత్ కు. ఆ రెండు దేశాలతోనే కాదు అమెరికా, ఐరోపా దేశాలతో సంబంధాలు కొనసాగుతున్నాయి. అమెరికా ఇప్పటికే భారత్ మద్దతు కోరింది. అయినా తటస్థ స్థితినే పాటిస్తోంది. అమెరికాతో కలిసి క్వాడ్, రష్యాతో కలిసి బ్రిక్స్ లో భాగస్వామిగా ఉంది భారత్. కాబట్టి ఏం చేయాలనే పరిస్థితి ఉంది. అమెరికా-రష్యాల ప్రచ్చన్న యుద్ధంతో మిగతా దేశాలకు కత్తిమీద సాములా మారింది. బ్రిటన్, జర్మనీలు రష్యా పై గుర్రుగా ఉన్నప్పటికీ అమెరికాకు సహకరిస్తామని చెప్పడం లేదు. రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేేయాలంటున్నాయి. అగ్రదేశానికి అవకాశమిస్తే రేపో మాపో తమ దేశం పైకి దండెత్తే అవకాశముందని భావిస్తున్నాయి. అదే సమయంలో ఆప్ఘనిస్తాన్, వియత్నాం, సౌత్ కొరియా, ఇరాక్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో జోక్యం చేసుకుని చేయి కాల్చుకుంది అమెరికా. అందుకే రష్యాను బెదిరించడం మినహా అమెరికా ఏం చేయలేకపోతోంది. తమ సైన్యాన్ని ఉక్రెయిన్ కు మద్దతుగా పంపే సాహసం చేయలేకపోతోంది. ఇది రష్యాకు కలిసొచ్చే అంశం. ఇప్పటికే క్రిమియాను సొంతం చేసుకున్న రష్యా మరోవైపు ఉక్రెయిన్ ను తమలో కలిపేసుకునే వ్యూహ రచన చేస్తోంది. యుద్ధం జరగకుండా శాంతియుతంగా వెళుతుందా లేక అనివార్యమవుతుందా అనేది చూడాల్సి ఉంది.
-కొండవీటి శివనాగరాజు, సీనియర్ జర్నలిస్టు, రీసెర్చ్ ప్రొడ్యూసర్, టీవీ9 తెలుగు
Also Read..