UP Elections 2022: పశువుల చుట్టూ యూపీ రాజకీయం.. ప్రధాని సైతం ఆ కామెంట్ చేయడంతో..
UP Elections 2022: దేశ రాజకీయాల్లోనే యూపీ ప్రాధాన్యత ఏంటో అందరికీ తెలిసిందే. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా యూపీనే కీలకం.

UP Elections 2022: దేశ రాజకీయాల్లోనే యూపీ ప్రాధాన్యత ఏంటో అందరికీ తెలిసిందే. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా యూపీనే కీలకం. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో పట్టుసాధిస్తే.. కేంద్రంలో అధికారం సునాయసం అవుతుంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ యూపీ ఎన్నికల్లో గెలిచేందుకు తాపత్రపడుతుంటాయి. ఇక ప్రస్తుతం విషయానికి వస్తే.. యూపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో విడత పోలింగ్ పూర్తవుతున్నా కొద్ది.. మరో విడత పోలింగ్ కోసం ప్రధాన పార్టీల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ మొదలు కొని, యూపీ సీఎం యోగి చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. యూపీలో ప్రధాన సమస్యగా పరిణమించిన వీధి పశువుల అంశం.. యూపీ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. ఎందుకంటే.. వీధి పశులు కారణంగా యూపీలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు. అలాగే రైతుల పంటలను కూడా ఈ వీధి పశువులు నాశనం చేశాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ దీనిని ప్రధాన అంశంగా తీసుకున్నాయి.
మార్చి 10న అంటే ఎన్నికల ఫలితాల తరువాత ప్రధాన ఎన్నికల సమస్యగా మారిన వీధి పశువులను ఎదుర్కొనేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ మేరకకు ఆదివారం నాడు యూపీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలకు భరోసా ఇచ్చారు. 2017లో యూపీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. పశువుల అక్రమ తరలింపు, పశుమాంసం విక్రయాలు భారీస్థాయిలో పడిపోయాయి. ఈ నేపథ్యంలో వీధి పశువుల సమస్య తీవ్రమైంది. అయితే, ఈ సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు త్వరలోనే నూతన వ్యవస్థను తీసుకువస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ‘‘ఇకపై పాలు ఇవ్వని గోవుల నుంచి కూడా ఆదాయం పొందేలా వ్యవస్థను మీ ముందు ఉంచుతాం’’ అని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ.
ఇదిలాఉంటే.. సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తే వీధి పశువుల దాడిలో గాయపడిన, మరణించిన వారి కుటుంబాలకు రూ. ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు అఖిలేష్ యాదవ్. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా తనదైన శైలిలో హామీల వర్షం కురిపించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. వీధి పశువుల సమస్యను పరిష్కరించేందుకు ఛత్తీస్‌గఢ్ మోడల్‌ను అవలంభిస్తామని ప్రకటించింది. అంతేకాదు.. వీధి పశువుల కారణంగా, ఇతర జంతువుల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 3 వేల నష్టపరిహారం ఇస్తామని కూడా ప్రకటించింది. అలాగే పశువుల పెంపకాన్ని ప్రోత్సహించడానికి, వాటి బెడద నుంచి తప్పించేందుకు ఆవు పేడను కిలో రూ. 2 చోప్పున కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.
వాస్తవానికి యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత పశువుల అక్రమ రవాణా, గోమాంసం విక్రయాల నిషేధం వంటి చర్యల వల్ల.. వీధి పశువుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అదే సమయంలో సామాన్యులకు వాటివల్ల కలిగే ఇబ్బందులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. యూపీలో నాలుగో దశ పోలింగ్ తాజాగా ముగిసింది. అయితే, తాజాగా పోలింగ్ జరిగిన ప్రాంతంలో పశు సంపద చాలా ఎక్కువ అనే చెప్పాలి. వీధి పశువులు విచ్చలవిడిగా తిరగడమే కాకుండా.. జనాలపై దాడులకు పాల్పడుతున్నాయి. ఈ దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రైతులు సైతం పంటలు నష్టపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అసంతృప్త జ్వాలలు రగులుతున్నాయి. దీన్ని పసిగిట్టిన ప్రధాన పార్టీలన్నీ వీధి పశువుల సమస్యను పరిష్కరిస్తామనే హామీలు గుప్పిస్తున్నాయి. మరి మార్చి 10న ఏ పార్టీ గెలుస్తుందో.. ఏ పార్టీ ఈ సమస్యకు పరిష్కారం చూపుతుందో వేచి చూడాలి.
Also read:
Green Energy: గ్రీన్ ఎనర్జీలో భారత్ అగ్రగామిగా నిలుస్తుంది.. 21 వ శతాబ్దం మనదే: ముఖేష్ అంబానీ
India vs Sri Lanka 1st T20: అభిమాన ప్లేయర్ కోసం రోడ్డెక్కిన ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?