Annamacharya: అన్నమయ్య కేవలం ఒక వ్యక్తి కాదు.. అఖండ భావనా కేతనం.. అనిర్వచనీయమైన భక్తితత్త్వ ప్రభంజనం

ఆయన పేరులో ఒక పవిత్రత. ఆయన నామస్మరణలో భక్తిభావావేశం. ఆయన కీర్తనల్లో ఆధ్యాత్మిక సౌరభం. తాత్వికంగా ఆయన భావవాది. కవితాపరంగా అభ్యుదయపథగామి. భజగోవిందుని స్మరణలో, భజన పాటల ఒరవడిలో ఆయన్ని మించిన వాగ్గేయకారులు లేరు.

Annamacharya: అన్నమయ్య కేవలం ఒక వ్యక్తి కాదు.. అఖండ భావనా కేతనం.. అనిర్వచనీయమైన భక్తితత్త్వ ప్రభంజనం
Sri Tallapaka Annamacharya
Follow us
Balu

| Edited By: Balaraju Goud

Updated on: Feb 23, 2022 | 12:01 PM

Sri Tallapaka Annamacharya: ఆయన పేరులో ఒక పవిత్రత. ఆయన నామస్మరణలో భక్తిభావావేశం. ఆయన కీర్తనల్లో ఆధ్యాత్మిక సౌరభం(Spiritual aroma). తాత్వికంగా(Philosophically) ఆయన భావవాది. కవితాపరంగా అభ్యుదయపథగామి. భజగోవిందుని స్మరణలో, భజన పాటల ఒరవడిలో ఆయన్ని మించిన వాగ్గేయకారులు(Vocabularies) లేరు. తేలిక పదాలలో నిగూఢమైన భావనలు పొదిగిన పదకవితా పితామహుడాయన. జోలపాటనుంచి పెళ్లిపాటల వరకూ ఏదీ ఆయన సంకీర్తనలకి అతీతం కాదు. ఆయన గీతామృతాన్ని ఆస్వాదిస్తుంటే సమయమే తెలీదు. అన్నమయ్య సుప్రభాతమే ఇప్పటికీ శ్రీవేంకటేశ్వరునికి మేలుకొలుపు గీతం ఆ సంకీర్తనాచార్యుని వర్ధంతి ఇవాళ.

అన్నమయ్య వెంకటాచలపతి భక్తుడు. వేనవేల సంకర్తనలు రచించినవాడు. దక్షిణాపథమున భజన సంప్రదాయానికి అచ్చతెలుగు ప్రతినిధి. పామరజన భాషలో భక్తిసంగీతాన్ని సృజించిన మహా వాగ్గేయకారుడు. ఆయన ఏది రాసినా గానామృతమే. ఆయన ఏది చెప్పినా అభ్యుదయ సందేశమే. పద ప్రయోగాలలో, భక్తిరసావేశంలో ఆయనకి ఆయనే సాటి. అంతటి మహనీయుడు అన్నమయ్య. మనవాడు. మన తెలుగువాడు! ఐదు శతాబ్దాల క్రితం అస్తమించినా- ఆ పదకవితా పితామహుడి ప్రభ మాత్రం ఇప్పటికీ వెలుగుతూనే వుంది. ఎప్పటికీ ప్రకాశిస్తూనేవుంటుంది. వింటే అన్నమయ్య సంకీర్తన వినాలి. పాడితే- అన్నమయ్య కృతులే పాడాలి. ఇదీ తెలుగునాట స్థిరపడిపోయిన జనాభిప్రాయం. పదపదాన తొణికిసలాడే భక్తిపారవశ్యం. ప్రతి పల్లవిలోనూ ధ్వనించే దివ్య నివేదనం. ప్రతి చరణంలోనూ ప్రతిఫలించే దైవలీలామృతం. ఇదీ అన్నమయ్య అనే భక్తి సంగీత శిఖర దర్శనం.

అదివొ అల్లదివో శ్రీహరివాసమూ అన్న సంకీర్తన వినని తెలుగువారుంటారా..? విన్నపాలు వినవలె వింతవింతలూ అన్న పల్లవి తలవని భావుకులుంటారా..? “పంకములో పుట్టదా పరిమళపు తామెర, పొంక కీటములందు పుట్టదా పట్టు..” అన్న చరణంలో దాగిన సందేశానికి పులకించని రసజ్ఞులుంటారా..? ఆయన నామస్మరణతో కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడే పరశించిపోతాడని చెప్తే ఆశ్చర్యం లేదు. అన్నమయ్య మనుమడు తాళ్లపాక చిన్నన్న గ్రంథస్తం చేసిన “అన్నమాచార్య చరితము”లో ఆ పావన చరితుడి జీవితవిశేషాలెన్నో కనిపిస్తాయి. అన్నమయ్య పూర్వీకులు 10వ శతాబ్దంలో వారణాసి నుంచి దక్షిణాదికి వచ్చి స్థిరపడ్డారు. ఆయన తండ్రి నారాయణసూరి మంచి కవి పండితుడు. ఆయన భార్య లక్కమాంబ. ఆమె స్వస్థలం కడప జిల్లా సిద్దపట్నం తాలూక మాడువూరు. ఈ దంపతులకు చాలాకాలం పిల్లలు పుట్టలేదు. సంతానప్రాప్తి కోసం వారు ఏడుకొండలవాడిని దర్శించుకుని గరుడస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ సమయంలో ఒక దివ్యకాంతి ప్రత్యక్షమై ధగధగమని మెరిసే ఖడ్గాన్ని వారి చేతుల్లో పెట్టి అదృశ్యమైందట. అంటే భజగోవిందుడే తన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్యదంపతులకు ప్రసాదించాడన్న మాట. అనంతరకాలంలో లక్కమాంబ గర్భం ధరించింది. పుత్రోదయమయ్యింది. ఆయనే అన్నమయ్య.

చిన్నతనం నుంచే అన్నమయ్య తిరుమలేశుని స్తుతిగీతాలు ఆలపించేవాడట! తన పదహారో ఏట నుంచి మాత్రం ఒక యజ్ఞంలా సంకీర్తనా రచనని చేపట్టాడు. 32,000 సంకీర్తనలు రచించాడు. ఆజన్మాంతం అదే భక్తితత్త్వంలోకి మునిగిపోయాడు. 95 సంవత్సరాల నిండు జీవితాన్ని గడిపాడు. 1503న ఫల్గుణ బహుళ ద్వాదశినాడు పరమపదించాడు. అన్నమయ్య సంతానము, మనవలు ఆయన సంకీర్తనలను రాగి రేకుల మీద రాయించారు. వీటిలో ప్రస్తుతం 12,000 మాత్రమే లభించాయి. మిగతావి దొరకలేదు. ఈ సంకీర్తనలను తిరుమల సంకీర్తనా భండాగారంలో భద్రపరిచారు. వాగ్గేయకారుడిగా అజరామర కీర్తని సంపాదించుకున్న అన్నమయ్య సంకీర్తనా లక్షణమనే సంస్కృత గ్రంథాన్ని కూడా రచించాడట. మంజరీ ద్విపదలో శృంగార మంజరి అనే కావ్యం కూడా రాశాడట. ఆయన రచించాడని చెప్తున్న 12 శతకాలలో వేంకటేశ్వర శతకం ఒక్కటే లభ్యమవుతోంది. ఇతర రచనలేవీ దొరకలేదు.

అన్నమయ్య వర్ణవ్యవస్థని ధిక్కరించాడు. “దేవుడు కొందరివాడు కాదు, అందరివాడు…” అని చాటిచెప్పాడు. భారతదేశంలో మధ్య యుగాలలో వచ్చిన భక్తి ఉద్యమానికి తెలుగుప్రాంతంలో అన్నమయ్యే ప్రతినిధి. ఆ రోజుల్లో పాశ్చత్య ప్రపంచం నుంచి మన దేశంలోకి ఏకేశ్వరోపాసన చేసే మతం ప్రవేశించింది. అందుకనే హిందువులలోనూ ఏకేశ్వరోపాసనను ప్రచారం చేయవలసిన అవసరాన్ని గుర్తించిన అన్నమయ్య “బ్రహ్మమొక్కటే” అని ఎలుగెత్తి నినదించాడు. భావంలో, రాశిలో, శైలిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాంగ్మయంలో మరొకటి లేదన్నది పరిశోధకుల నిశ్చితాభిప్రాయం. పదకవితకి, ద్విపద ప్రక్రియకీ ఆయన వల్ల ఉన్నత స్థానాలు లభించాయని విమర్శకులు చెబుతారు. ఆయన సంకీర్తనల్లో భక్తి, సంగీతం, శృంగారం, వేదాంతం, సంస్కరణవాదం, అభ్యుదయ భావనలు పరిపుష్టితో దర్శనమిస్తాయి. విష్ణుతత్త్వాన్ని ఇంత సంలీనతతో వర్ణించిన వాగ్గేయకారుడు మరొకరు లేరు. అన్నమాచార్యుడు వేన వేల సంకీర్తనలతో తిరు వేంకటాచలపతిని ఆరాధించాడు. పద కవితలతో ఆ భగవంతుడి పదములు సేవించాడు. తెలుగు పాటలతో ఆ దివ్య మంగళరూపుడికి ప్రణమిల్లాడు. ప్రతి సంకీర్తననీ మధురభక్తితో రచించాడు. ఆయన కీర్తనల్లో ఎన్నో వైవిధ్యాలు కనిపిస్తాయి. పెళ్లి పాటలు, సువ్వి పాటలు, జోల పాటలు, లాలిపాటలు, ఏలపాటలు, గొబ్బిళ్లపాటలు, తుమ్మెద పాటలు, సంవాద పాటలు, కోటాటపు పాటలు, చిందు పాటలు, తందాన పాటలు ఇలా ఎన్నో రకాల పాటలను విరచించి తెలుగువారికి తరగనంత స్వరనిధిని అందించాడు. అన్నమయ్య పదాలు ప్రజలకు చేరువ కావడానికి కారణం ఆయన తన కీర్తనల్లో వాడుక భాషకే ప్రాముఖ్యతనివ్వడం. వివిధ జానపద గేయ లక్షణాలను ఆకళింపు చేసుకోవడం. అది అన్నమయ్య విరచితమని తెలియకనే చాలా మంది ఆయన పాటలను పాడుకుని మురిసిపోతుంటారు.

అన్నమయ్య సమకాలికులైన సాహితీవేత్తలు వుంటే వుండవచ్చు. కానీ అన్నమయ్యలా వారెవ్వరూ సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేయలేకపోయారు. సరికొత్త పద్దతిలో సంకీర్తనా సాహిత్యాన్ని సృజించిన కారణజన్ముడు అన్నమయ్య. ఆనాడు సమాజంలో వున్న దురాచారాలను నిశితంగా గమనించి… వాటిపై పోరాటం సాగించిన సంఘ సంస్కర్త ఆయన. అన్నమయ్యలో లోక పరిశీలనాశక్తి మెండు. అందుకే కులం కాదు గుణమే ప్రధానమని పదే పదే చెప్పుకొచ్చారు. ఆయన సాహిత్యంలో పాండిత్య ప్రకర్షలు ఏ మాత్రం గోచరించవు. చాలా సరళంగా, పామరజనానికి అర్థమయ్యే రీతిలో వుంటాయి. పదకవిత్వానికే ఆయన పితామహుడు. తపోనిష్టలాంటి దీక్షతో సంకీర్తనావళిని రచిస్తూ సాగిపోయాడాయన. అందుకే ఆ కీర్తనల్లో అంత గాఢత. అంత సంలీనత..! ఆయన చెప్పని విషయం లేదు. ఆయన స్ఫృశించని అంశం లేదు. కాలాతీత కావ్యాల్లా ఆయన కీర్తనలు జనరంజకాలై వర్థిల్లుతున్నది.

ఈ కారణంగానే..! తిరువేంకటాధీశుడికి అన్నమయ్య అన్నా… అన్నమయ్య పాటలన్నా అమితమైన ఇష్టం… వేకువజామున అన్నమయ్య మేలుకొలుపు పాడందే ఆ అరవిందలోచనుడు కళ్లు తెరవడు… ఆయన జోలపాడందే అరమోడ్పు కన్నులతో పవళించడు. ఆ జగద్రక్షకుడిపై అలవిమాలిన ప్రేమతో వేలకీర్తనలు రాసి- చరిత్రలో చిరస్మరణీయుడిగా మిగిలిపోయాడు అన్నమయ్య. సంకీర్తనా రచనకే తలమానికంగా మారిపోయాడు. వందల సంవత్సరాల తర్వాత కూడా ఆయన కీర్తనలు నిత్యనూతనంగా వుంటాయి. వినేకొద్దీ వినాలనిపిస్తాయి. ఎందరో గాయనీగాయకులు ఆ సంకీర్తనలను ఆలపించి తమకు తాము ధన్యులయ్యారు.

ఒకరా ఇద్దరా వందలకొద్దీ గాయనీగాయకులు అన్నమయ్యకు స్వరార్చన చేశారు.వేన వేల మంది ఆ స్వర లహరుల్లో ఓలలాడారు. అన్నమయ్య కేవలం ఒక వ్యక్తి కాదు. అఖండ భావనా కేతనం. అనిర్వచనీయమైన భక్తితత్త్వ ప్రభంజనం. అందులో మునిగితే- బయటికి రాలేము.

Read Also….

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. మరికాసేపట్లో దర్శన టికెట్లు విడుదల