Punjab Incident: పంజాబ్ ఉదంతం దేనికి సంకేతం..? కాంగ్రెస్, బీజేపీల వాదనలో నిజమెంత..? సుప్రీంకోర్టులో తేలేదేంటి..?

ప్రస్తుతం ప్రధాని పంజాబ్‌ టూర్‌పై రాజకీయ రగడ రాజుకుంటోంది. నేతల విమర్శలతో వాతావరణం వేడెక్కుతోంది. ముమ్మాటికీ భద్రతా వైఫల్యమేనని బీజేపీ ఆరోపిస్తుంటే.. ఎదురుదాడికి దిగుతోంది కాంగ్రెస్‌.

Punjab Incident: పంజాబ్ ఉదంతం దేనికి సంకేతం..? కాంగ్రెస్, బీజేపీల వాదనలో నిజమెంత..? సుప్రీంకోర్టులో తేలేదేంటి..?
Pm Modi Security Lapse
Follow us
Rajesh Sharma

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 07, 2022 | 7:51 PM

PUNJAB INCIDENT RAISES POLITICAL UPROAR ACROSS THE COUNTRY: ఓ దేశ ప్రధానికి జరగాల్సిన అనుభవమేనా ఇది ? యావత్ దేశ ప్రజల్లో వినిపిస్తున్న ప్రశ్న ఇది. కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం కాకపోయి వుంటే బహుశా ఇదే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యేదేమో. రాజకీయ రగడ కూడా అదే స్థాయిలో మార్మోగేదేమో.. కానీ కరోనా పుణ్యమాని ప్రధానికి తన సొంత దేశంలో జరిగిన అవమానం పెద్దగా చర్చకు దారి తీయట్లేదు. కానీ ప్రజల్లో మాత్రం ప్రధాన మంత్రిని ఇలా నడిరోడ్డు మీద అడ్డుకోవడం కరక్టేనా అన్న ప్రశ్న వినిపిస్తోంది. రాజకీయాలు ఎలాగైనా వుండనీ.. అంశాల వారీగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని విమర్శించనీ గానీ.. కానీ ప్రధాని అధికారిక పర్యటనను ఇలా అడ్డుకోవడం.. 20 నిమిషాల పాటు రోడ్డుపై నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానీ, రాష్ట్ర డీజీపీగానీ రంగంలోకి దిగకపోవడం దారుణంగానే కనిపిస్తోంది. అసలు రైతుల ముసుగులో ఖలిస్తాన్ అనుకూల వాదులు ఆ ఫ్లై ఓవర్ పై పెద్ద ఎత్తున గుమి కూడుతున్న విషయం రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కు తెలియదంటే నమ్మగలమా ?

ప్రస్తుతం ప్రధాని పంజాబ్‌ టూర్‌పై రాజకీయ రగడ రాజుకుంటోంది. నేతల విమర్శలతో వాతావరణం వేడెక్కుతోంది. ముమ్మాటికీ భద్రతా వైఫల్యమేనని బీజేపీ ఆరోపిస్తుంటే.. ఎదురుదాడికి దిగుతోంది కాంగ్రెస్‌. పంజాబ్‌ భద్రతా వైఫల్యంపై రాష్ట్రపతిని మీట్‌ అయ్యారు ప్రధాని మోదీ. పంజాబ్​ పర్యటనలో భద్రతా లోపాలపై రాష్ట్రపతితో మాట్లాడారు. ఈ విషయంపై రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది. ప్రధాని మోదీ పంజాబ్​ పర్యటనలో భద్రతా లోపాలు తలెత్తటంపై ఆందోళన వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ అంశంపై మోదీతో ఫోన్​లో మాట్లాడినట్లు ట్విట్టర్‌లో వెల్లడించారు. ఇక.. ప్రధాని టూర్‌పై తనదైనశైలిలో సెటైర్లు విసిరారు పంజాబ్‌ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ. ప్రధాని మోదీ రైతుల కోసం 15 నిమిషాలు ఆగలేకపోయారా అని ప్రశ్నించారు. రైతులు ఢిల్లీ సరిహద్దులో ఏడాదికి పైగా ఆందోళన చేపట్టారని.. అలాంటిది కేవలం 15 నిమిషాల ఆలస్యానికే మోదీ అసహనానికి గురయ్యారా అని ఎద్దేవా చేశారు సిద్ధూ. ఇదే విషయమై.. ఘాటుగా రియాక్టయ్యారు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్. పంజాబ్‌లో జరిగింది సిగ్గుచేటు చర్య అన్నారు కంగనా. ప్రధానిపై దాడి అంటే ప్రతి ఒక్క భారతీయుడిపై దాడి జరగడం వంటిదేనన్నారు కంగనా రనౌత్‌. పంజాబ్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోందని ఆరోపించారు. అయితే ఇక.. ఇదే విషయమై స్పందించిన రాకేశ్‌ టికాయత్‌ ప్రధాని టూర్‌పై విమర్శలు గుప్పించారు. ప్రధాని ప్రాణాలతో బతికిపోయారంటూ చేస్తున్న ప్రచారాన్ని ఓ స్టంట్‌గా అభివర్ణించారు. మరోవైపు.. భద్రతా వైఫల్యాన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసన వ్యక్తం చేశాయి బీజేపీ వర్గాలు. పాట్నా, ఛండీగఢ్‌తో పాటు పలు ప్రాంతాల్లో రోడ్లపై ధర్నాలు చేపట్టారు. పాట్నాలో బీజేపీ యూత్‌ వింగ్‌ ఆధ్వర్యంలో పంజాబ్‌ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఛండీగఢ్‌లో కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. పంజాబ్‌ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. సీఎం చన్నీ గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు.

ప్రధాని మోదీ పంజాబ్‌ టూర్‌పై బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. రాజకీయ దురుద్దేశంతోనే ప్రధాని పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని బీజేపీ ఆరోపిస్తుండగా జనం లేకనే ప్రధాని తన టూర్‌ క్యాన్సిల్‌ చేసుకున్నారని కాంగ్రెస్‌ విమర్శిస్తుంది. కాగా ప్రధాని టూర్‌లో భద్రతా లోపంపై సుప్రింకోర్టులో పిల్‌ దాఖలైంది. విచారణ చేపట్టిన ధర్మాసనం అన్ని రికార్డ్‌లను పంజాబ్‌ అండ్‌ హర్యానా హైకోర్ట్‌ రిజిస్ట్రార్‌ జనరల్ దగ్గర భద్ర పరచాలని ఆదేశించింది. పీఎం పర్యటనలో భద్రతా లోపాలపై వస్తున్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ఆదేశాలిచ్చింది. పీఎం టూర్‌కి సంబంధించిన అన్ని వివరాలతో కూడిన రికార్డులను సురక్షితంగా భద్రపరచవలసిన జవాబుదారీతనం, బాధ్యతలను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు అప్పగించింది. రిజిస్ట్రార్ జనరల్‌కు అవసరమైన సహకారాన్ని పంజాబ్ పోలీసులు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీలు అందించాలని ఆదేశించింది. రిజిస్ట్రార్ జనరల్‌తో సమన్వయం కోసం చండీగఢ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ , జాతీయ దర్యాప్తు సంస్థ అధికారి ఒకరు నోడల్ ఆఫీసర్లుగా పని చేయాలని తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిటీలు తమ కార్యకలాపాలను జనవరి 10 వరకు నిలిపేయాలని ఆదేశించింది.

మోదీ జనవరి 5న పంజాబ్‌లో పర్యటించారు. కొన్ని అభివృద్ధి పథకాలను ప్రారంభించడంతోపాటు ఓ బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్ళారాయన. అయితే హెలికాప్టర్‌లో ప్రయాణించేందుకు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రోడ్డు మార్గంలో ప్రయాణించాలనుకున్నారు. జాతీయ స్మారక కేంద్రంలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించేందుకు వెళ్తుండగా, ఆ మార్గంలోని రోడ్డును కొందరు నిరసనకారులు దిగ్బంధించడంతో ఫిరోజ్‌పూర్ ఫ్లైఓవర్ వద్ద ఆయన వాహన శ్రేణి నిలిచిపోవాల్సి వచ్చింది. దాదాపు 20 నిమిషాలపాటు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో మోదీ తన పర్యటనను రద్దు చేసుకుని, తిరిగి భటిండా విమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఈ సంఘటనపై లాయర్స్ వాయిస్ అనే ప్రభుత్వేతర సంస్థ సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీనిపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయ స్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి 10వ తేదీన జరగనుంది. ప్రధాని పర్యటనకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని ముందే హెచ్చరించినా పంజాబ్‌ ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు. ఉగ్రవాద సంస్థలు మోదీ టూర్‌కి ఆటంకం కలిగించే అవకాశం ఉందని , ప్రధాని టూర్‌లో ఖలీస్తానీ ఆర్గనైజేషన్స్‌తో పాటు మరికొన్ని ఉగ్రవాద సంస్థలు ఆటంకం కలిగించే అవకాశం ఉందని స్పెషల్‌ ప్రొటక్షన్‌ గ్రూప్‌ హెడ్‌, పంజాబ్‌ ప్రభుత్వానికి, పంజాబ్‌ పోలీసులకు జనవరి 3వ తేదీన లెటర్‌ రాశారు. ప్రధాని వెళ్లే దారిలో రోడ్డును బ్లాక్‌ చేసే అవకాశం ఉందని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే పంజాబ్‌ పోలీసులు నిర్లక్ష్యం వహించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని భద్రత విషయంలో పంజాబ్‌ పోలీసులు వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రధాని పర్యటనకు ఇండియన్‌ ముజాహిదీన్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌, హర్కత్‌ అల్‌ ముజాహిదీన్‌, తెహ్రీక్‌ ఏ తాలిబన్‌ పాకిస్తాన్‌, మాజీ స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూమెంట్‌ ఆఫ్‌ ఇండియా లాంటి ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు ఉందని పంజాబ్‌ పోలీసులకు ఎస్పీజీ హెడ్‌ లెటర్‌ రాశారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరికలను పంజాబ్‌ పోలీసులు పెడ చెవిన పెట్టినట్టు తెలుస్తోంది. ఇవన్నీ ఓవైపు కనిపిస్తున్నా కాంగ్రెస్ పార్టీ, పంజాబ్ ప్రభుత్వ పెద్దలుగానీ తమ వైఫల్యాన్ని అంగీకరిచకపోవడం విడ్డూరం. దేశ ప్రధానికి తమ దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళే హక్కుంది. అదే సమయంలో ప్రజలకు తమ నిరసనను వ్యక్తం చేసే హక్కూ వుంది. కానీ.. ఈ తరహా ఉదంతాలు మన దేశం పరువును అంతర్జాతీయ స్థాయిలో తీసేవిగానే పరిగణించాలి. నిరసన వ్యక్తం చేయడం వేరు.. ప్రధానిని 20 నిమిషాల పాటు రోడ్డు మీద నిర్బంధించడం వేరు. అదేసమయంలో ఏ ఉగ్రవాద సంస్థనో ప్రధానిని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడితే.. పరిణామాలు చాలా దారుణంగా వుండేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరో రెండు నెలల్లో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఇటీవల పదవీచ్యుతుడైన కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్, ఇంకోవైపు ఢిల్లీ నుంచి పరిధి విస్తరణకు బయలు దేరిన ఆమ్ ఆద్మీ పార్టీలకు కూడీ ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవిగానే పరిగణించాలి. ఈ క్రమంలో జరిగిన ఈ ఉదంతం రాజకీయ అస్త్రంగా మారే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. ఈనేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణలో ఏం తేలుతుందనేది ఆసక్తికరంగా మారింది.