రాజకీయ కాక రేపుతున్న చంద్రబాబు వ్యాఖ్యలు.. టీడీపీ-జనసేన మధ్య లవ్ ఓకే అవుతుందా?
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు. ఇదే సిద్ధాంతం టీడీపీ చాలాకాలంగా పాటిస్తోంది. లెఫ్ట్, రైట్ వింగ్ పార్టీలతో కలిసి గతంలో స్నేహ గీతాలు పాడిన తెలుగుదేశం...
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు. ఇదే సిద్ధాంతం టీడీపీ చాలాకాలంగా పాటిస్తోంది. లెఫ్ట్, రైట్ వింగ్ పార్టీలతో కలిసి గతంలో స్నేహ గీతాలు పాడిన తెలుగుదేశం… ఆ తర్వాత విబేధించి వాటిని పక్కనపెట్టింది. రాష్ట్ర విభజన అనంతరం బీజేపీ – జనసేనతో కలిసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సైకిల్ పార్టీ.. ఆ తర్వాత ఆ పార్టీలను బ్యాక్ సీట్ నుంచి దించేసింది. 2019లో సింగిల్‌గానే సవారీ చేయబోయి బొక్క బొర్లా పడింది. ఫలితంగా మళ్లీ మిత్రుల అవసరం తమ్ముళ్లకు కనిపిస్తోంది. చంద్రబాబు చిత్తూరు టూర్‌లో చేసిన కామెంట్లు, కేడర్ కోరస్‌లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.
కుప్పంలో గురువారంనాడు రోడ్ షో నిర్వహిస్తున్న చంద్రబాబును.. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయాలని ఓ తెలుగు తమ్ముడు కోరాడు. దీనిపై స్పందించిన చంద్రబాబు..లవ్ ఎప్పుడూ రెండు వైపులా ఉండాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేనతో చేతులు కలిపేందుకు సిద్ధమంటూ టీడీపీ చిన్నస్థాయి కార్యకర్త మొదలు రాష్ట్రస్థాయి నాయకుడి వరకు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆల్రెడి జనసేనతో పెళ్లి అయిపోయింది.. కొత్తగా ప్రేమేంటీ.. ఉన్న బంధం బలపడాలన్నదే తమ ఉద్దేశమని కొందరు టీడీపీ నేతలు కుండబద్దలు కొట్టేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెబుతున్నారు.
కేడర్ నుంచి లీడర్స్ వరకు జనసేనతో కొత్త బంధాలపై టీడీపీ శ్రేణులు ఆశలు పెట్టుకున్నారు. అధినేత కూడా వారి మనసును అర్థం చేసుకున్నారో ఏమో వాళ్ల ఆలోచనలను ఎండార్స్ చేస్తూ కొత్త బంధాలపై సంకేతాలు పంపుతున్నారు. ప్రేమ రెండువైపులా ఉండాలంటూ జనసేనకు స్నేహహస్తం అందిస్తున్నారు చంద్రబాబు. పొత్తులు పెట్టుకోవడం వల్ల గెలిచిన సందర్భాలున్నాయి.. పొత్తు పెట్టుకుని ఓడిన అనుభవాలున్నాయంటూనే అవసరాన్ని బట్టి పొలిటికల్ అలయెన్స్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు.
గత కొంతకాలంగా తమకు, టీడీపీ మధ్య రహస్య బంధం ఉందని జరుగుతున్న ప్రచారానికి చంద్రబాబే స్పష్టత ఇచ్చారని జనసేన నాయకులు చెబుతున్నారు. టీడీపీతో తమకు ఎలాంటి స్నేహం లేదని.. సొంతంగా అధికారంలోకి రావాలన్నదే పవన్ లక్ష్యమంటున్నారు.
ఇప్పటికే నాలుగైదు సార్లు కలిసి కాపురం చేసి విడిపోయిన బీజేపీ నాయకులు కూడా చంద్రబాబు వ్యాఖ్యలను లైట్ తీసుకుంటున్నారు. సొంత మామ నుంచి నిన్నమొన్నటిదాకా తమను ప్రేమించిన చంద్రబాబు పచ్చి అవకాశవాది అంటూ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కావాలనుకుంటే ఎవరితోనైనా లవ్ చేస్తాడు.. ఆ తర్వాత ఆయన ఏంటో చూపిస్తాడని అన్నారు. మామ దగ్గర నుంచి బీజేపీ వరకు అందరినీ చంద్రబాబు లవ్ చేశారని అన్నారు. చంద్రబాబు అన్ని పార్టీలతో చక్రం తిప్పుతాడు.. తర్వాత తన నైజాన్ని చూపిస్తాడని అన్నారు.
తన రాజకీయ అవసరాల కోసం లెఫ్ట్, రైట్ తేడా లేకుండా వాడుకుని వదిలేయడం చంద్రబాబుకు వెన్నెతో పెట్టిన విద్యే అంటూ ఏపీ మంత్రి కొడాలి నాని ఘాటుగానే విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడికి లేదంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగానే సమయం ఉంది. అయినా పార్టీలు అప్పుడే ఎలక్షన్ మూడ్‌లోకి తీసుకెళుతున్నాయి. టీడీపీ ఇప్పటికే నియోజకవర్గాల వారీ రివ్యూలు మొదలుపెట్టింది. పొత్తులపైనా చర్చ జనాల్లో తీసుకొచ్చింది. అటు జనసేన త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామంటోంది. బీజేపీ జనాగ్రహ సభలో బెజవాడలో శంఖారావం పూరించింది. అధికార పార్టీ వైసీపీ కూడా పార్టీ పరంగా జనాల్లోకి వస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇవన్నీ చూస్తూంటే కోయిల ముందే కూసిందన్నట్టుగా పార్టీలు వ్యవహరిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
Also Read..
CM Jagan: ఏపీ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ప్రకటించిన జగన్ సర్కార్.. మరో గుడ్ న్యూస్
Tamilnadu: జ్యోతిష్కుడిని నమ్మి కూతురును కడతేర్చిన తల్లి.. ఆపై ఏం జరిగిందంటే..